డయాబెటిస్... ప్రపంచంలోని ప్రజలను ఇబ్బంది పెడుతున్న ప్రధాన సమస్యగా మారిపోయింది. డయాబెటిస్ వచ్చిందంటే జీవితాంతం వెంటాడుతుంది. ప్రతిరోజూ మందులు వాడాల్సిందే. ఇది మీ రక్తంలోని చక్కెర స్థాయిలను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. అలాగే డయాబెటిస్ వచ్చినవారు కళ్ల ఆరోగ్యం విషయంలో కూడా చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. డయాబెటిస్ వల్ల కళ్ళు దెబ్బ తినే అవకాశం కూడా ఉంటుంది. వారు చేసే కొన్ని పనులు కంటికి హానికరంగా మారుతాయి.
డయాబెటిస్ వల్ల శరీరంలో చక్కెర స్థాయిలు పెరిగిపోయి అనేక సమస్యలకు కారణం అవుతాయి. అధికంగా ఆకలి వేయడం, అధికంగా దాహం వేయడం, తరచుగా మూత్ర విసర్జన చేయడం, తీవ్ర అలసట, మానసిక స్థితిలో మార్పులు... ఇవన్నీ కూడా డయాబెటిస్ వల్ల కలిగేవి. అయితే రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో పెట్టుకోకపోతే తీవ్రమైన గుండె జబ్బులు, మూత్రపిండాల వైఫల్యానికి కూడా కారణం అవుతుంది. అలాగే డయాబెటిస్ అదుపులో ఉండకపోతే కళ్ళు కూడా తీవ్రంగా దెబ్బతింటాయి. కంటిచూపు కూడా పోయే ప్రమాదం ఉంది.
డయాబెటిస్ కారణంగా రెటీనాలోని చిన్న రక్త కణాలు దెబ్బతింటాయి. దీనివల్ల చూపు సరిగా కనిపించదు. కళ్ళు తీవ్రంగా ప్రభావితం అవుతాయి. దీన్నే డయాబెటిక్ రెటినోపతి అంటారు. రక్తంలో చక్కెర శాతం అధికంగా ఉన్నపుడు కంటి నరాలు బలహీనంగా మారుతాయని వైద్యులు చెబుతున్నారు. అలాగే కంటి నుంచి రక్తస్రావం కావడం వంటివి కూడా జరుగుతుంది. ఇలా కంటి సమస్యలు వస్తూ ఉంటాయి. డయాబెటిస్ ఉన్నవారు రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుకోపోతే ఎలాంటి కంటి సమస్యలు వస్తాయో తెలుసుకోండి.
రెటీనా మధ్య భాగంలో ఉన్నదాన్ని మాక్యులా అంటారు. ఇది కంటి భాగంలో వాపును కలిగిస్తుంది. దీనివల్ల అస్పష్టమైన దృష్టి వస్తుంది. దీనికి వెంటనే చికిత్స తీసుకోవాల్సిన అవసరం ఉంది.
కంటి శుక్లాలు కూడా డయాబెటిస్ ఉన్నవారికి వచ్చే అవకాశం ఎక్కువ. ఇది కంటిపై ఉండే కటకాన్ని కప్పివేసి దృష్టిని బలహీన పరుస్తుంది.
డయాబెటిస్ రోగులకు అధికంగా వచ్చే కంటి వ్యాధి గ్లాకోమా. ఇది ఆప్టిక్ నరాలను దెబ్బతీస్తుంది. పూర్తిగా దృష్టి పోవడానికి కూడా కారణమవుతుంది. 2020లో డయాబెటిక్ రెటినోపతి పది కోట్ల మందికి వచ్చినట్టు అంచనా. అది కూడా కేవలం మధుమేహాన్ని అదుపులో ఉంచుకోని వారికే. ఈ సంఖ్య 2045 నాటికి 16 కోట్లకు చేరే అవకాశం ఉంది.
డయాబెటిస్‌తో బాధపడుతున్న వారు రాత్రిపూట చూడటంలో ఇబ్బంది పడుతున్నా, దృష్టిలో నల్లటి మచ్చలు లేదా చుక్కల చుక్కలుగా కనిపిస్తున్నా వెంటనే వైద్యులను సంప్రదించాలి. అలాగే కాంతిని చూడలేకపోతున్నా, రంగులు మసకబారినట్టు కనిపిస్తున్నా, కళ్ళల్లో నొప్పి లేదా తీవ్ర ఒత్తిడి అనిపిస్తున్నా తేలికగా తీసుకోకుండా పరీక్షలు చేయించుకోవాలి.
ప్రపంచంలో ఎక్కువగా టైప్2 డయాబెటిస్ బారినే పడిన వారే అధికంగా ఉన్నారు. ఇది పెద్ద వయసులో వచ్చేది. ఇక టైప్1 డయాబెటిస్ అనేది ఐదు సంవత్సరాలలోపు పిల్లలకు వస్తుంది. ఇది జీవితాంతం వెంటాడుతుంది. ఇక గర్భం ధరించాక వచ్చే జస్టేషనల్ డయాబెటిస్ గర్భిణీ స్త్రీలలో కనిపిస్తుంది. ఇది కూడా డయాబెటిక్ రెటినోపతికి కారణం అవుతుంది. కాబట్టి ఏ రకమైన డయాబెటిస్ ఉన్నా కూడా వారంతా ఎప్పటికప్పుడు కంటి పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉంది.
(గమనిక: అధ్యయనాలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ కోసం ఇక్కడ అందిస్తున్నాం. ఇది కేవలం సమాచారం మాత్రమే. ఇది వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి సందేహాలుంటే వెంటనే వైద్యులను సంప్రదించండి.)
సంబంధిత కథనం