చిరంజీవి కుమారుడిగా ఇండస్ట్రీకి పరిచయమైన రామ్ చరణ్ తనకంటూ గుర్తింపును తెచ్చుకున్నాడు. అతను సినిమాల్లోకి అడుగుపెట్టినప్పటి నుంచి ఇప్పటివరకు అద్భుతమైన ఫిట్‌నెస్ మెయింటైన్ చేస్తున్నారు. కఠినమైన వ్యాయామాలు, ఆహార ప్రణాళికలతో 40 వయసులో కూడా పాతికేళ్లలా కనిపిస్తున్నారు. అతను ఏం తింటున్నారో, తన టోన్డ్ బాడీని ఎలా కాపాడుకుంటున్నారో తెలుసుకునేందుకు అతని అభిమానులు ఎంతోమంది ఆసక్తి చూపిస్తారు.
రామ్ చరణ్ చెబుతున్న ప్రకారం ఆయన ఇంట్లో వండిన భోజనాన్ని తినేందుకు మాత్రమే ఆసక్తి చూపిస్తారు. భోజనం విషయంలో చాలా కఠినంగా ఉంటారు. ఏవి పడితే అవి తినరు. సమతుల్య జీవనశైలిని కొనసాగించడానికి అతను నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంటారు. ఫిట్‌నెస్ అనేది 80శాతం మనం తీసుకునే డైట్ మీద ఆధారపడి ఉంటుందని రామ్ చరణ్ అంటూ ఉంటారు.
ఆరోగ్యంగా, అందంగా ఫిట్‌గా కనిపించాలంటే హెల్తీ డైట్ ప్రధాన పాత్ర పోషిస్తుందని, అందుకే తన ఆహారంలో ప్రాసెస్డ్ ఫుడ్, అనారోగ్యకరమైన ఆహారాలు ఉండవని చెబుతారు. వారంలో ఆరు రోజులు కఠినమైన ఆహార నియమాలను పాటించే రామ్ చరణ్ ఆదివారం మాత్రం తనకి ఇష్టమైన ఆహారాన్ని తినేందుకే ఆసక్తి చూపిస్తారు.
రామ్ చరణ్ డైట్ ప్లాన్‌ను అతని ఫిట్‌నెస్ కోచ్ అయినా రాకేష్ వుడియార్ తయారు చేశారు. అతని డైట్ లో ఆల్కహాల్, పంచదార నిండిన కూల్ డ్రింకులు, రెడ్ మీట్ ఏవీ ఉండవు.
తన రోజును ఆరోగ్యకరమైన బ్రేక్ ఫాస్ట్‌తో మొదలుపెడతారు. అందులో కూడా ఎగ్ వైట్ తో చేసిన ఆహారాన్ని తింటారు. అలాగే ఓట్స్, బాదం మిల్క్‌ను తీసుకుంటారు. బ్రేక్ ఫాస్ట్ చేసిన తర్వాత మూడు గంటల పాటు ఏమీ తీసుకోరు. తర్వాత వెజిటబుల్ సూప్ తీసుకుంటారు. ఇక లంచ్‌లో చికెన్, బ్రౌన్ రైస్, ఆకుపచ్చని కూరగాయలతో చేసిన కూరలను తింటారు. ఇక సాయంత్రం పూట స్నాక్స్‌గా గ్రిల్డ్ ఫిష్, చిలకడదుంపలు, గ్రిల్ చేసిన కూరగాయలు తింటారు. రాత్రి ఆహారాన్ని సాయంత్రం ఆరు గంటలకు పూర్తి చేస్తారు. అవకాడోలు, సలాడ్లు వంటివి తీసుకుంటారు. ఇంతకుమించి ఎక్కువ ఆహారాన్ని తీసుకోరు రామ్ చరణ్.
ఇక వ్యాయామం విషయానికి వస్తే సోమవారం బైసెప్స్ చేస్తారు. అలాగే మంగళవారం క్వాడ్స్ తప్పకుండా చేస్తారు. అలాగే బుధవారం నుంచి శనివారం వరకు ప్రతిరోజూ ఎలాంటి వ్యాయామాలు చేయాలో ముందుగానే ప్రణాళిక సిద్ధం చేసుకుంటారు. ఆదివారం మాత్రం ఎలాంటి వ్యాయామాలు చేయరు. ఆరోజు పూర్తిగా తనకు నచ్చినట్టు జీవిస్తారు. ఆహారం విషయంలో కూడా ఆదివారం ఎలాంటి నియమ నిబంధనలు ఉండవు. తనకి ఇష్టమైన బిర్యానీలు వంటివి తింటారు.
రామ్ చరణ్ తినే ఆహారంలో ఎక్కువగా కూరగాయలు, ఆకుకూరలు, ఎగ్ వైట్స్, ఓట్స్ వంటివే ఉంటాయి. ఇవన్నీ కూడా ఆరోగ్యానికి మేలు చేసేవే. పైగా శరీర బరువును కూడా పెంచవు. అందుకే 40 ఏళ్లు వచ్చినా కూడా రామ్ చరణ్ ఇంకా పాతికేళ్ల యువకుడిలాగే కనిపిస్తున్నారు.
సంబంధిత కథనం