లంచ్, డిన్నర్లలో జీడిపప్పు పనీర్ మసాలా కర్రీ ఇలా వండారంటే అదిరిపోతుంది, రెసిపీ ఇదిగో-this cashew paneer masala curry is delicious for lunch and dinner heres the recipe ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  లంచ్, డిన్నర్లలో జీడిపప్పు పనీర్ మసాలా కర్రీ ఇలా వండారంటే అదిరిపోతుంది, రెసిపీ ఇదిగో

లంచ్, డిన్నర్లలో జీడిపప్పు పనీర్ మసాలా కర్రీ ఇలా వండారంటే అదిరిపోతుంది, రెసిపీ ఇదిగో

Haritha Chappa HT Telugu

లంచ్, డిన్నర్లలో రుచికరమైన కర్రీ తినాలనుకుంటే జీడిపప్పు పనీర్ మసాలా కర్రీ ప్రయత్నించండి. ఇది అన్నంతోనే కాదు రోటీతో తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. చపాతీతో తింటే ఇది ఇంకా అద్భుతంగా ఉంటుంది. దీని రెసిపీ ఎలాగో తెలుసుకోండి.

జీడిపప్పు పనీర్ మసాలా కర్రీ

పనీర్ తో చేసే వంటకాలు ఎన్నో ఉన్నాయి. మటర్ పనీర్, షాహి పనీర్, కడై పనీర్ వంటి కూరలు ఎన్నో దీనితో వండవచ్చు. ఓసారి కాజు పనీర్ మసాలా కర్రీ ప్రయత్నించండి. ఇది చాలా రుచిగా ఉంటుంది. అతిథులు వచ్చినప్పుడు దీన్ని వడ్డిస్తే ప్రశంసలు దక్కడం ఖాయం. చెఫ్ పంకజ్ భడోరియా చెప్పిన రెసిపీ ఇక్కడ ఇచ్చాము. కాజు పనీర్ మసాలా కర్రీ ఎలా చేయాలో తెలుసుకోండి.

కాజు పనీర్ మసాలా తయారీకి

పనీర్ - 400 గ్రాములు

జీడిపప్పులు - 20

పెద్ద ఉల్లిపాయలు - రెండు

పెద్ద టమోటాలు - నాలుగు

అల్లం - పెద్ద ముక్క

వెల్లుల్లి రెబ్బలు - పది రెబ్బలు

పచ్చిమిర్చి - నాలుగు

దాల్చినచెక్క - చిన్న ముక్క

పెద్ద యాలకులు - రెండు

క్రీమ్ - అరకప్పు

కసూరి మేథీ - రెండు స్పూన్లు

నల్ల మిరియాల పొడి - అర స్పూను

గరం మసాలా పొడి - అర స్పూను

ఉప్పు - రుచికి సరిపడా

నూనె - రెండు స్పూన్లు

కొత్తిమీర తరుగు - రెండు స్పూన్లు

కాజు పనీర్ మసాలా రెసిపీ

  1. జీడిపప్పును ముందుగానే నీటిలో వేసి అరగంట పాటూ నానబెట్టుకోవాలి.
  2. అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి మిక్సీ జార్లో వేసి మెత్తగా రుబ్బుకుని పక్కన పెట్టుకోవాలి.
  3. అలాగే టమోటా ముక్కలను మిక్సీ జార్లో వేసి ప్యూరీలాగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. మరో పక్కన మిక్సీలో యాలకులు, దాల్చిన చెక్క కూడా పొడి చేసుకోవాలి.
  4. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేసి వేడి చేయాలి.
  5. ఇప్పుడు అందులో పనీర్ ముక్కలను నూనెలో వేసి వేయించాలి. అవి లేత బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి.
  6. వేయించిన పనీర్ ముక్కలను తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే నూనెలో నానబెట్టిన జీడిపప్పులను కూడా వేసి వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి.
  7. అదే కళాయిలో మరో రెండు స్పూన్ల నూనె వేసి వేడి చేయండి. ఉల్లిపాయల తరుగు వేసి రంగు మారేవరకు వేయించాలి.
  8. ఇప్పుడు రుబ్బిన అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి మిశ్రమాన్నివేసి వేయించాలి.
  9. అందులో యాలకులు, దాల్చిన చెక్క పొడిని కూడా వేసి బాగా కలుపుకోవాలి.
  10. తర్వాత టమోటాల ప్యూరీ వేసి బాగా కలపాలి. పైకి నూనె తేలే వరకు ఉడికించాలి.
  11. తర్వాత జీడిపప్పులు కూడా వేసి కలుపుకోవాలి. అందులో అరకప్పు నీళ్లు పోసి బాగా కలపాలి.
  12. పనీర్ ముక్కలు, క్రీమ్, ఉప్పు వేసి బాగా కలపాలి. ఇప్పుడు తక్కువ మంట మీద 4 నుంచి 5 నిమిషాలు ఉడికించాలి. గరం మసాలా, మిరియాల పొడి వేసి బాగా కలుపుకోవాలి.
  13. అందులో కసూరి మేథి వేసి బాగా కలుపుకోవాలి. పైన కొత్తీమీర తరుగును చల్లుకోవాలి. అంతే టేస్టీ కాజు పనీర్ మసాలా కర్రీ సిద్ధమైనట్టే.

కాజు పనీర్ మసాలా కర్రీని అన్నంలో, చపాతీతో అదిరిపోతుంది. ఈ కర్రీ కొంచెం తిన్నా పొట్ట నిండిన ఫీలింగ్ వస్తుంది. బరువు తగ్గాలనుకునే వారు చపాతీతో దీన్ని తింటే మంచిది.

హరిత హిందూస్తాన్ టైమ్స్‌లో చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్లో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, తెలుగు సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్‌వర్క్‌లలో పని చేశారు. ప్రింట్, డిజిటల్ జర్నలిజంలో 17 ఏళ్ల అనుభవం ఉంది. 2023 డిసెంబరు నుంచి హిందూస్థాన్ టైమ్స్‌లో ఆస్ట్రాలజీ, లైఫ్‌స్టైల్ సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు. లింక్టిన్ లో కనెక్ట్ అవ్వండి.