Fear Of Women : ఆడవాళ్లంటే భయం.. 55 ఏళ్లుగా ఒంటరి జీవితం.. బ్రహ్మచారి తాత ఇది పద్ధతేనా?-this 71 years man 55 years in isolation due to his fear of women gynophobia ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Fear Of Women : ఆడవాళ్లంటే భయం.. 55 ఏళ్లుగా ఒంటరి జీవితం.. బ్రహ్మచారి తాత ఇది పద్ధతేనా?

Fear Of Women : ఆడవాళ్లంటే భయం.. 55 ఏళ్లుగా ఒంటరి జీవితం.. బ్రహ్మచారి తాత ఇది పద్ధతేనా?

Anand Sai HT Telugu

Gynophobia : మనలో చాలామంది జంతువులు, నీరు, అగ్ని లేదా చీకటి గదులు వంటి అనేక విషయాలకు భయపడతాం. కానీ ఓ 71 ఏళ్ల వృద్ధుడు మాత్రం.. తనకు మహిళలంటే భయంగా ఉందంటూ వార్తల్లో నిలిచాడు.

ఇతడికి మహిళలంటే భయం

జీవితంలో భయాలు ఉండటం సహజం. ఏదైనా విషయంపై భయం కలిగితే ఆ విషయం జోలికి మళ్లీ వెళ్లం. కానీ కొందరికి మాత్రం వింత భయాలు ఉంటాయి. వాటి గురించి తెలిస్తే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఓ తాత భయం తెలిసి అందరూ షాక్ అవుతున్నారు. అదేంటంటే.. అతడికి మహిళలు అంటే భయం. దీంతో తనను తానే నిర్భందించుకున్నాడు. మహిళల ముఖాలను కూడా చూడటం లేదు అతడు. ఇదంతా ఎక్కడ జరిగిందంటే..

ఆఫ్రికాలోని రువాండాకు చెందిన కాలిట్‌క్సే న్జామ్‌వితా 55 సంవత్సరాలుగా ఒంటరిగా ఉంటున్నాడు. మహిళలతో ఎలాంటి సంబంధం ఉండకూడదు అనేది అతడి భయానికి కారణం. కనీసం వారిని చూసేందుకు కూడా ఇష్టపడడు. అందుకే ఇంట్లోనే తనను తాను బంధించుకున్నాడు. ఇలా మహిళలపై భయంతో అతని ఏకాంత ప్రయాణం 16 సంవత్సరాల వయస్సులో ప్రారంభమైంది. ఈ వింత మనిషి ప్రవర్తన అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.

అతను చిన్నప్పటి నుంచి స్త్రీలంటే భయంతోనే బతుకుతున్నాడు. 16 ఏళ్లు వచ్చేసరికి ఈ భయం ఇంకా పెరిగిపోయింది. దీంతో స్త్రీలను చూడకుండా ఉండటానికి తన ఇంటికి కంచె వేసుకున్నాడు. దీని కోసం 15 అడుగుల కంచెను పెట్టి.., ఇంట్లోకి మహిళలు రాకుండా తాళం వేసుకున్నాడు. 'నా ఇంటికి తాళం వేసినా సరిపోతుంది. కానీ నా ఇంటికి కంచె వేయడానికి కారణం మహిళలు నా దగ్గరికి రాకుండా చూసుకోవడమే. వారు నా దగ్గర నుంచి కూడా వెళ్లడం నాకు ఇష్టం లేదు. వారివైపు కూడా చూడలేను.' అని ఆ బ్రహ్మచారి తాత వివరించాడు. తనకు చిన్నప్పుడు జరిగిన సంఘటనలే మహిళలంటే భయం అయ్యేందుకు కారణంగా తెలుస్తోంది.

అతనికి ఆడవాళ్ళంటే భయం.. కానీ స్థానికంగా ఉండే ఆడవాళ్ళు, ముఖ్యంగా ఇరుగుపొరుగు వాళ్ళు మాత్రం అతడికి సాయం చేస్తుంటారు. 'అతడిని చిన్నప్పటి నుండి చూస్తున్నాం. చాలా అరుదుగా బయట కనిపిస్తాడు. ఎప్పుడై కిరాణా వస్తువులు అందిస్తాం. అయినా అతడు మాత్రం మహిళలను చూడకుండానే జాగ్రత్తలు తీసుకుంటాడు.' అని ఇరుగు పొరుగు వారు చెప్పుకొచ్చారు.

ఎవరైనా అతనికి సహాయం చేయడానికి ప్రయత్నిస్తే, ఎవరితోనూ మాట్లాడటానికి ఇష్టపడడు. అందుకని ఇంట్లోకి కావాల్సిన వస్తువులు కంచె మీద నుంచి విసిరేస్తారు ఇరుగు పొరుగువారు. కొన్నిసార్లు అతడు బయటకు వచ్చినా.. చాలా జాగ్రత్తలు తీసుకుంటాడు. ఎవరైనా స్త్రీ తన ఇంటి సమీపంలోకి వస్తే.. త్వరగా ఇంట్లోకి పరుగెత్తి తాళం వేసుకుంటాడు ఈ తాత.

గైనోఫోబియా

ఆ వృద్ధుడు గైనోఫోబియా అనే మానసిక స్థితితో బాధపడుతున్నాడని చెబుతున్నారు. ఇది ఉంటే మహిళలను చూస్తే కారణం లేకుండా భయం కలుగుతుంది. గైనోఫోబియా లక్షణాలు స్త్రీల పట్ల విపరీతమైన భయం, వారి గురించి ఆలోచించడం ద్వారా ఆందోళన కలిగిస్తుంది. గైనోఫోబియా ఉన్నవారికి భయాందోళనలు, ఛాతీ బిగుతుగా అవ్వడం, అధిక చెమట, వేగవంతమైన హృదయ స్పందన, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు ఉంటాయి.