thippatheega health benefits: తిప్పతీగ ఉపయోగాలు బోలెడు.. డయాబెటిస్ సహా పలు వ్యాధులకు మందు
Giloy Health Benefits: తిప్ప తీగతో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. డయాబెటిస్ నుంచి గుండె జబ్బుల వరకు ఇది ఔషధంగా ఉపయోగపడుతోంది.
Giloy Health Benefits: తిప్ప తీగ మన పల్లెల్లో విరివిగా లభిస్తుంది. తిప్పతీగ ఇచ్చే ఆరోగ్యప్రయోజనాలు అద్భుతమైనవి అనడంలో అతిశయోక్తి లేదు. మెరుగైన రోగనిరోధక శక్తి కోసం ఆయుర్వేదం అందించే మరో సూపర్‌ఫుడ్ ఇది. ఆయుర్వేదంలో 'అమృతం'గా ప్రసిద్ది చెందింది. పురాతన కాలం నుండి భారతీయ వైద్యంలో ఉపయోగంలో ఉన్న తిప్పతీగ మొక్కలో పుష్కలంగా ఔషధ గుణాలు ఉన్నాయి. తిప్పతీగ కాండం సహా ఆకు వరకు అనేక అనారోగ్య సమస్యలను పరిష్కరిస్తుంది.
తిప్ప తీగతో ఆరు ఆరోగ్య ప్రయోజనాలు:
1. తిప్ప తీగతో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది
హృదయం ఆకారంలో ఉండే ఈ మూలిక సహజంగా యాంటీ ఆక్సిడెంట్స్‌తో నిండి ఉంటుంది. ఇది ఫ్రీ రాడికల్స్, వ్యాధిని కలిగించే క్రిములతో పోరాడటానికి సహాయపడుతుంది. ఇది టాక్సిన్స్‌ను తొలగించడంలో, రక్తాన్ని శుద్ధి చేయడంలో, కాలేయ వ్యాధిని ఎదుర్కోవడంలో, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌లను ఎదుర్కోవడంలో మన శరీరానికి సహాయపడుతుంది.
యాంటీ-పైరేటిక్ స్వభావం కలిగి ఉండటం వలన ఇది దీర్ఘకాలిక జ్వరాలతో పోరాడటానికి కూడా సహాయపడుతుంది. డెంగ్యూ ఉన్నప్పుడు కూడా సిఫారసు చేస్తారు. తిప్పతీగ మన రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది.
2. డయాబెటిస్ నివారణకు తిప్పతీగ
మీ రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను మెరుగుపరచడం ద్వారా డయాబెటిస్‌ను అదుపు చేయడంలో తిప్పతీగ మీకు సహాయపడుతుంది. వివిధ రకాల ఫైటోకెమికల్స్ శరీరంలో ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడం, సహజ ఇన్సులిన్ స్రావాన్ని పెంచడానికి పని చేస్తాయి. జర్నల్ ఏన్షియంట్ సైన్స్ ఆఫ్ లైఫ్‌లో ప్రచురించిన 2010 పరిశోధనా పత్రం కూడా తిప్పతీగ లేదా టినోస్పోరా కాలేయంలో మధుమేహం-ప్రేరిత ఆక్సీకరణ ఒత్తిడిని గణనీయంగా ఎదుర్కొంటుందని పేర్కొంది.
3. శ్వాస సంబంధిత సమస్యలతో పోరాడే తిప్పతీగ
తిప్ప తీగలో కనిపించే అద్భుతమైన యాంటీ ఇన్‌ఫ్లమేటరీ శక్తులు తరచుగా దగ్గు, జలుబు, టాన్సిలిటిస్ వంటి ఏవైనా సాధారణ శ్వాసకోశ సమస్యలతో పోరాడటానికి సహాయపడతాయి. జలుబు, దగ్గు మాత్రమే కాకుండా, ఇది ఉబ్బసం రోగులకు కూడా ఉపశమనం కలిగిస్తుంది. ఛాతీ బిగుతుగా ఉండడం, శ్వాస ఆడకపోవడం, దగ్గు, గురక వంటి లక్షణాలను తిప్పతీగ తగ్గిస్తుంది.
4. ఒత్తిడి, ఆందోళనను తగ్గించే తిప్పతీగ
తిప్పతీగను అడాప్టోజెనిక్ హెర్బ్‌గా ఉపయోగించవచ్చు. అడాప్టోజెన్ అనేది ప్రాథమికంగా మన శరీరం ఒత్తిడికి అనుగుణంగా సహాయపడే పదార్ధం. ఈ ఆరోగ్య టానిక్ మన శరీరం నుంచి టాక్సిన్స్ బయటపడటానికి, మన జ్ఞాపకశక్తిని పెంచడానికి సహాయపడుతుంది. అందువల్ల ఇది మనల్ని ప్రశాంతంగా ఉంచడంలో కూడా సహాయపడుతుంది.
5. గుండె జబ్బుల నుంచి రక్షణకు తిప్పతీగ
డయాబెటిక్ ఎలుకలలో తిప్పతీగ ప్రభావాలను జర్నల్ ఆఫ్ ఎత్నోఫార్మకాలజీలో ప్రచురించిన ఒక పరిశోధనా పత్రం అధ్యయనం చేసింది. ఇది డయాబెటిక్ ఎలుకలలో సీరం కొలెస్ట్రాల్ స్థాయిలను గణనీయంగా తగ్గించిందని కనుగొన్నారు. తిప్పతీగ లిపిడ్ జీవక్రియను సక్రమంగా ఉండేలా చేస్తుంది. తద్వారా మీ గుండెకు పరోక్షంగా ప్రయోజనం చేకూరుస్తుందని మరొక అధ్యయనం కనుగొంది.
6. మహిళల్లో బోలు ఎముకల వ్యాధిని నివారించే తిప్పతీగ
తిప్పతీగ కాండం మహిళల్లో బోలు ఎముకల వ్యాధిని ప్రభావితం చేస్తుందని యూరోపియన్ మెనోపాజ్, ఆండ్రోపాజ్ సొసైటీ యొక్క అధికారిక జర్నల్ అయిన మాట్యురిటాస్‌లో ప్రచురితమైన ఒక అధ్యయనం తెలిపింది. తద్వారా బోలు ఎముకల వ్యాధి నివారణలో ఉపయోగపడుతుందని తేల్చింది.
తిప్ప తీగ మొక్కలు మన దగ్గర పుష్కలంగా అందుబాటులో ఉన్నాయి. తిప్ప తీగ రసం రూపంలో అనేక ఆయుర్వేద ఉత్పత్తుల సంస్థలు మార్కెట్లోకి తెచ్చాయి. వాడే ముందు ఒకసారి ఆయుర్వేద వైద్య నిపుణుడిని సంప్రదించడం మంచిది.
సంబంధిత కథనం