Avoid Foods: ఈ కూరగాయలు ఆరోగ్యానికి మంచివే కానీ వానాకాలంలో మాత్రం దూరం పెట్టాలి
Avoid Foods: వానాకాలం వచ్చిందంటే ఆహారపరంగా, ఆరోగ్య పరంగా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఆరోగ్యానికి మేలు చేసే పండ్లు, కూరగాయలలో కూడా కొన్నింటిని వర్షాకాలంలో తినకపోవడమే మంచిది.
మండే ఎండల నుంచి వానలు చల్లదనాన్ని తెచ్చిపెట్టాయి. వాతావరణాన్ని ఆహ్లాదకరంగా మార్చాయి. ఇంతవరకు బాగానే ఉన్నా… వర్షాకాలం వచ్చిందంటే చాలు ఆరోగ్యపరంగా ఎంతో మంది టెన్షన్ పడుతుంటారు. ఎందుకంటే వర్షాకాలం అనేక తీవ్రమైన వ్యాధుల ప్రమాదాన్ని కూడా తెస్తుంది. ఈ సీజన్లో, వైద్యులు కూడా జాగ్రత్తగా ఉండమని సూచిస్తారు. ఆహారం, ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సలహా ఇస్తారు.

ఆరోగ్యానికి మేలు చేసే విటమిన్లు, మినరల్స్ వంటి పోషకాలు అధికంగా ఉండే కొన్ని కూరగాయలు కూడా వానాకాలంలో దూరం పెట్టాల్సిన అవసరం ఉంది. అవి ఆరోగ్యానికి హాని కలిగించే అవకాశం ఉంది. వానాకాలం వస్తే వాతావరణంలో తేమ పెరిగిపోతుంది. దీనివల్ల కొన్ని రకాల పండ్లు, కూరగాయల్లో బ్యాక్టీరియా పెరిగే అవకాశం ఉంది. అవి కడుపులో చేరి ఇన్ఫెక్షన్లు, జీర్ణ సమస్యలను తెస్తాయి. ఆరోగ్య నిపుణులు చెబుతున్న ప్రకారం వర్షాకాలంలో కొన్ని రకాల కూరగాయలకు, పండ్లకు దూరంగా ఉండాలి. ఆ కూరగాయలు, పండ్లు ఏమిటో తెలుసుకుందాం.
వంకాయ
వర్షాకాలంలో వంకాయ తినడం వల్ల ఆరోగ్యానికి కీడు జరిగే అవకాశం ఉంది. పొట్టలో చికాకు, గ్యాస్ సమస్య పెరుగుతుంది. అంతేకాకుండా వర్షాకాలంలో ఈ వంకాయల్లో ఫంగస్ చేరే ఛాన్సులు ఎక్కువ. దీనివల్ల వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. అందుకే చాలా మంది వర్షాకాలంలో వంకాయ తినడానికి దూరంగా ఉంటారు.
గ్రీన్ వెజిటేబుల్స్
ఈ సీజన్ లో గ్రీన్ వెజిటేబుల్స్ లో తేమ ఎక్కువగా ఉండటం వల్ల బ్యాక్టీరియా చేరిపోతుంది. జీర్ణకోశ ఇన్ఫెక్షన్లు, జీర్ణ సమస్యలకు కారణమవుతుంది. ఆకుపచ్చగా ఉండే కూరగాయలను చాలా జాగ్రత్తగా శుభ్రపరిచి వండుకోవాలి.
మొలకెత్తిన ధాన్యాలు
వర్షాకాలంలో మొలకెత్తిన ధాన్యాలు, పప్పుధాన్యాలకు కూడా దూరంగా ఉండాలి. తేమ అధికంగా ఉండటం వల్ల, మొలకెత్తిన ధాన్యాలలో ఫంగస్ ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను సాగనివ్వదు. దీని వల్ల వీటిని తిన్నవారు అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉంది.
పుట్టగొడుగులు
విటమిన్ డి అధికంగా ఉండే పుట్టగొడుగులు ఆరోగ్యపరంగా మంచివే. కానీ వానాకాలంలో మాత్రం వీటికి దూరంగా ఉండాలి. ఎందుకంటే ఈ కూరగాయను తేమతో కూడిన వాతావరణంలో పండిస్తారు, ఈ కారణంగా వర్షాకాలంలో ప్రమాదకరమైన బ్యాక్టీరియా పెరిగే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. వీటిని తిన్న వ్యక్తికి కొన్ని రకాల సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
సీఫుడ్
వర్షాకాలంలో చేపలు లేదా రొయ్యలు వంటి సీఫుడ్ కు కూడా దూరంగా ఉండాలి. ఎందుకంటే ఇది సముద్ర జీవుల సంతానోత్పత్తి సమయం. ఈ సీజన్ లో చేపలు తినడం వల్ల ఫుడ్ పాయిజనింగ్ రిస్క్ పెరుగుతుంది. కాబట్టి వానాకాలంలో చేపలను, రొయ్యలను దూరం పెడితే మంచిది. ముఖ్యంగా పిల్లలకు తినిపించకపోవడమే మంచిది.
వానాకాలంలో ఆహారం వేడివేడిగా తినడం మంచిది. తాజా ఆహారాన్ని తింటే ఎలాంటి అనారోగ్యాలు రాకుండా ఉంటాయి. వానాకాలంలో దాహం తక్కువగా ఉంటుంది. అందుకే నీరు తాగేందుకు ఇష్టపడరు. అయినా కూడా రోజుకు మూడు లీటర్ల నీటిని తాగాల్సిందే. వానాకాలంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందే.
టాపిక్