Diabetes In Summer : మధుమేహ వ్యాధిగ్రస్తులకు హెచ్చరిక.. వేసవిలో ఈ లక్షణాలను నిర్లక్ష్యం చేయకండి
Diabetes In Summer In Telugu : మధుమేహ వ్యాధిగ్రస్తులు వేసవిలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కొన్ని రకాల లక్షణాలు కనిపిస్తే వెంటనే అప్రమత్తం అవ్వాలి.
ప్రపంచంలో అత్యంత వేగంగా పెరుగుతున్న మధుమేహ జనాభాలో భారతదేశం ఒకటి. జీవనశైలిలో మార్పులు, ఆహారపు అలవాట్ల వల్ల చాలా మంది మధుమేహంతో బాధపడుతున్నారు. మధుమేహం పూర్తిగా నయం కాదు. తీవ్రత తగ్గేందుకు చికిత్స తీసుకోవాలి. మధుమేహ వ్యాధిగ్రస్తులు వేసవిలో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే శరీరం తరచుగా పొడిబారడం వల్ల బాధపడవచ్చు.
అధిక ఉష్ణోగ్రతలు రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతాయి. ఉష్ణోగ్రత కూడా రక్త నాళాలు విస్తరించడానికి కారణమవుతుంది. ఫలితంగా ఇన్సులిన్ శోషణ పెరుగుతుంది. ఇది కాకుండా వేసవిలో మధుమేహానికి సంబంధించిన కొన్ని అసాధారణ లక్షణాలను ఎదుర్కొనే అవకాశం ఉంది. మీరు ఈ లక్షణాలను గమనించినట్లయితే మీరు వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. మధుమేహ వ్యాధిగ్రస్తులు వేసవిలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం..
ఇన్ఫెక్షన్లు సంభవించవచ్చు
వేడి వేసవి వాతావరణం మధుమేహం సమస్యలను కలిగిస్తుంది. రక్తం, కణజాలాలలో అధిక చక్కెర స్థాయిలు బ్యాక్టీరియా పెరుగుదలను ప్రోత్సహిస్తాయి. సంక్రమణ ప్రమాదాన్ని పెంచుతాయి. మధుమేహం వల్ల ఇన్‌ఫెక్షన్‌లతో పోరాడే శరీర సామర్థ్యాన్ని తగ్గిస్తుంది. మూత్రాశయం, మూత్రపిండాలు, జననేంద్రియాలు, చిగుళ్ళు, పాదాలు, చర్మం వంటి ప్రదేశాలలో ఇన్ఫెక్షన్లు సంభవించవచ్చు.
త్వరగా బరువు కోల్పోతారు
మధుమేహ వ్యాధిగ్రస్తులకు రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. అందుకే వేసవిలో డీహైడ్రేషన్‌కు గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. రక్తంలోకి తగినంత గ్లూకోజ్ విడుదల కాకపోతే, ఆకలి అనుభూతి చెందుతుంది. దీనిని భర్తీ చేయడానికి, శరీరం కొవ్వును వేగంగా కాల్చివేస్తుంది. శక్తిని విడుదల చేస్తుంది. ఫలితంగా మీరు త్వరగా బరువు కోల్పోతారు.
వేసవిలో జాగ్రత్తగా ఉండాలి
మధుమేహంతో బాధపడేవారు వేసవిలో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అధిక వేడి వారి శరీరంలో మార్పులకు కారణమవుతుంది. చర్మం రంగు మారవచ్చు. మెడ, చంకలు, గజ్జలు మొదలైన వాటిపై చర్మం నల్లగా మారితే జాగ్రత్తగా ఉండండి. దీనిని వైద్యపరంగా అకాంథోసిస్ నైగ్రికన్స్ అంటారు. ఈ సమస్య వస్తే వైద్యుడిని సంప్రదించాలి. చర్మం రంగు మారడం మధుమేహం వల్లనా లేక మరేదైనా కారణమా అని నిర్ధారించుకోవడానికి పరీక్షలు చేయించుకోవాలి.
నోటి దుర్వాసన
ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్నప్పుడు, నోటిలో లాలాజలం ఉత్పత్తి తక్కువగా ఉంటుంది. నోరు పొడిబారడానికి దారితీస్తుంది. చివరికి నోటి దుర్వాసన వస్తుంది. ఫలితంగా డయాబెటిక్ పేషెంట్లలో రక్తనాళాలు దెబ్బతింటాయి. చిగుళ్ళతో సహా శరీర భాగాలకు రక్త ప్రసరణ తగ్గుతుంది. అవి బలహీనంగా మారతాయి, సంక్రమణ ప్రమాదాన్ని పెంచుతాయి. నోటిలో గ్లూకోజ్ స్థాయిలు కూడా పెరగవచ్చు.
తరచుగా నీరు తాగాలి
వేసవిలో డీహైడ్రేషన్ ప్రమాదాన్ని నివారించడానికి మధుమేహ వ్యాధిగ్రస్తులు తరచుగా నీరు తాగాలి. వదులుగా ఉండే కాటన్ దుస్తులు ధరించండి. మీకు మద్యం సేవించే అలవాటు ఉంటే, మీరు దానిని మానుకోవాలి. రక్తంలో చక్కెర స్థాయిలను క్రమం తప్పకుండా పర్యవేక్షించాలి. సరైన సమయంలో మందులు వాడాలి.
అవయవాలను దెబ్బతీస్తాయి
దీర్ఘకాలిక అధిక రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు శరీర కణజాలాలు, అవయవాలను దెబ్బతీస్తాయి. శరీర కణజాలాలకు మద్దతు ఇచ్చే రక్త నాళాలు, నరాలు కూడా బలహీనపడతాయి. దీర్ఘకాలికంగా కొరోనరీ ఆర్టరీ వ్యాధి, గుండెపోటు, స్ట్రోక్, నరాల దెబ్బతినడం, చర్మ వ్యాధులు, లైంగిక రుగ్మతలు, వినికిడి లోపం వంటి సమస్యల ప్రమాదం పెరుగుతుంది.