Sweets for Diabetics: డయాబెటిస్ రోగులకు ఈ స్వీట్లు సురక్షితమైనవి, తీపి తినాలనిపిస్తున్నప్పుడు వీటిని తినేయండి
Sweets for Diabetics: డయాబెటిస్ ఉన్నా కూడా తీపి కోరికలు పూర్తిగా చావవు. ఏదైనా స్వీట్ తినాలనిపిస్తూ ఉంటుంది. అలాంటప్పుడు కింద ఇచ్చిన ఏదో ఒక స్వీట్ తినేందుకు ప్రయత్నించండి. ఎలాంటి సమస్యా ఉండదు.
డయాబెటిస్ రోగులు తీపి పదార్థాలకు పూర్తిగా దూరంగా ఉండాలని చెబుతారు. కానీ అప్పుడప్పుడు వారికి కూడా తీపి పదార్థం తినాలన్న కోరిక పుడుతుంది. డయాబెటిస్ ఉన్న రోగులు తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న ఆహారాలను ఎంచుకొని తినాలి. అలాగే ఫైబర్ అధికంగా ఉండే ఆహారాన్ని తినాలి. చక్కెర కలిపిన పదార్థాలను తినకూడదు. కానీ తీపి తినాలన్న కోరికలు పుడితే ఏం చేయాలో తెలియక వారు ఇబ్బంది పడుతూ ఉంటారు.
ఇక్కడ మేము తక్కువ గ్లైసిమిక్ ఇండెక్స్ ఉండే కొన్ని రకాల స్వీట్లు ఇక్కడ ఇచ్చాము. మీరు వీటిని ఇంట్లో చేసి పెట్టుకుంటే తీపి తినాలన్న కోరిక పుట్టినప్పుడు ఈ స్వీట్ ను తినవచ్చు. ఇవి ఆరోగ్యానికి మేలు చేస్తాయి. రక్తంలో చక్కెర స్థాయిలను అమాంతం పెరగకుండా అడ్డుకుంటాయి. అయితే ఈ స్వీట్లు అతిగా తింటే మాత్రం రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగిపోతాయి.
బెల్లం కొబ్బరి లడ్డూలు
కొబ్బరి లడ్డులు పంచదార,బెల్లం... రెండింటితోను చేస్తారు. అయితే డయాబెటిస్ ఉన్నవారు బెల్లం, కొబ్బరితో చేసిన లడ్డూను తినవచ్చు. రెండు రోజులకు ఒకటి తినడం వల్ల ఎలాంటి సమస్యా రాదు. బెల్లం సహజమైన తీపి పదార్థం. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను అమాంతం పెంచదు. అలాగే గ్లూకోజ్ కూడా అకాస్మాత్తుగా పెరగదు. కొబ్బరిలో ఫైబర్ అధికంగా ఉంటుంది. అలాగే ఆరోగ్యకరమైన కొవ్వులు కూడా ఉంటాయి. కాబట్టి బెల్లం కరిగించి అందులో తురిమిన కొబ్బరిని జోడించి బాగా కలిపి చిన్న లడ్డూల్లా చుట్టుకొండి. మీకు తీపి తినాలన్న కోరిక పుట్టినప్పుడు వీటిని తింటూ ఉండండి.
శెనగపిండి లడ్డూలు
పంచదార కలపకుండా శెనగపిండి లడ్డూలను చేసుకుంటే మంచిది. ఇందులో మీరు బెల్లాన్ని వాడవచ్చు. లేదా స్టెవియాను వాడవచ్చు. ఇది సూపర్ మార్కెట్లలో లభిస్తుంది. శెనగపిండిలో ప్రోటీన్, ఫైబర్ ఉంటుంది. కాబట్టి రక్తంలో చక్కెర నియంత్రించేందుకు సహాయపడుతుంది. శెనగపిండిని నెయ్యిలో వేయించి అందులో స్టెవియా పొడిని వేసి, తరిగిన నట్స్, సీడ్స్ వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత వాటిని లడ్డూల్లా చుట్టుకోవాలి. వీటిని అప్పుడప్పుడు తినడం వల్ల ఆరోగ్యానికి కూడా మంచిదే. పైగా తీపి కోరికలు కూడా తీరుతాయి.
ఓట్స్ డ్రైఫ్రూట్స్ బర్ఫీ
మధుమేహులకు ఓట్స్ ఎంతో మేలు చేస్తాయి. దీనిలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంచుతుంది. డ్రై ఫ్రూట్స్ వేస్తాం కాబట్టి సహజమైన తీపి కూడా వస్తుంది. కాబట్టి పంచదార వేయకుండా ఈ బర్ఫీని తయారు చేసుకోవాలి. ఓట్స్ ను వేయించి పొడి చేసుకోవాలి. ఖర్జూరం, ఓట్స్ ,డ్రైఫ్రూట్స్ బాగా కలిపి బర్ఫీలా చేసుకోవాలి. ఈ బర్ఫీ ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఖర్జూరంలో సహజమైన తీపి ఉంటుంది. ఈ తీపి కూడా అధికంగా ఉంటుంది. కాబట్టి ఈ బర్ఫీలను రోజుకు ఒకటి కన్నా ఎక్కువ తినకపోవడమే మంచిది.
రాగి హల్వా
రాగులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటి గ్లైసెమిక్ ఇండెక్స్ కూడా చాలా తక్కువ. ఇవి గ్లూకోజ్ నెమ్మదిగా విడుదల అయ్యేలా చేస్తాయి. కాబట్టి రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. నెయ్యిలో రాగి పిండిని వేయించి బెల్లం తురుము లేదా స్టెవియా పొడి వేసి బాగా కలుపుకోవాలి. అందులోనే మరిగించిన పాలు కూడా వేసి బాగా కలిపి కాసేపు స్టవ్ మీద ఉడికించుకోవాలి. ఇది దగ్గరగా హల్వా లాగా అయ్యాక కొన్ని డ్రై ఫ్రూట్స్ ని చల్లుకొని తినేయాలి. ఇది చాలా రుచిగా ఉంటుంది.
చియా పుడ్డింగ్
చియా విత్తనాలు ఎంత తిన్నా ఆరోగ్యకరమే. దీనిలో ఫైబర్, ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు అధికంగా ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంచుతాయి. వీటితో తయారుచేసిన స్వీట్లు షుగర్ పేషెంట్లకు మంచివి. ఇవి స్వీట్ తినాలన్న కోరికలను తీరుస్తాయి. ముందుగా పాలు తీసుకొని మరిగించండి. అందులో చియా విత్తనాలు కోకో పౌడర్ అంటే చాక్లెట్ పౌడర్ వేసి బాగా కలుపుకోవాలి. కోకో పౌడర్ బయట దొరుకుతుంది. దాన్నే వాడితే మంచిది. ఎందుకంటే దీనిలో పంచదార ఉండదు. అందులోనే స్టెవియా పొడి కూడా వేసి బాగా కలిపి ఫ్రిజ్లో పెట్టుకోవాలి. మరుసటి రోజు దాన్ని తింటే ఎంతో రుచిగా ఉంటుంది.
సంబంధిత కథనం