Healthy Oils: ఈ నూనెలు పెరుగుతున్న కొలెస్ట్రాల్‌ను నియంత్రిస్తాయి, గుండెపోటు రాకుండా అడ్డుకునే ఛాన్స్
Healthy Oils: కొలెస్ట్రాల్ స్థాయిలను అదుపులో ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. కొలెస్ట్రాల్ శరీరంలో పెరిగితే గుండె సమస్యలు వస్తాయి. ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. మీ కొలెస్ట్రాల్ స్థాయిని అదుపులో ఉంచడానికి సహాయపడే కొన్ని వంట నూనెలు ఇక్కడ ఉన్నాయి.
వయసులో సంబంధం లేకుండా గుండె సమస్యలు పెరిగిపోాయాయి. ముఖ్యంగా కొలెస్ట్రాల్ శరీరంలో పెరిగితే గుండె జబ్బులు వచ్చే అవకాశం పెరిగిపోతుంది. డయాబెటిస్, రక్తపోటు, స్థూలకాయం వంటి వ్యాధులు కూడా చెడు జీవన శైలి కారణంగా వచ్చే వ్యాధులే. కొలెస్ట్రాల్ పెరగడం వల్ల కూడా ఈ వ్యాధులన్నీ వచ్చే అవకాశం ఉంది.
శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయి పెరగడం వల్ల, రక్తనాళాలైనా సిరలు బ్లాక్ కావడం ప్రారంభమవుతాయి. ఇది గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది. కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించడంలో ఆహారం చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా వేయించిన పదార్థాలను తినడం ఖచ్చితంగా మానుకోవాలి. ఇప్పుడు ప్రతిరోజూ నూనె లేకుండా ఆహారాన్ని వండడం, తినడం సాధ్యం కాదు. కాబట్టి ఏ వంట నూనెను ఉపయోగించడం ప్రయోజనకరంగా ఉంటుందో తెలుసుకోవడం చాలా ముఖ్యం. కాబట్టి రోజువారీ వంటల్లో ఉపయోగించే బెస్ట్ వంట నూనె గురించి తెలుసుకుందాం.
ఆలివ్ ఆయిల్
ఆలివ్ ఆయిల్ గుండెకు ఎంతో మేలు చేస్తుంది. చర్మం, జుట్టు చక్కగా ఉండాలన్నా, ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలన్నా ఆలివ్ నూనెను ఉపయోగించడం ఉత్తమం. ఆలివ్ నూనెలో ఆరోగ్యకరమైన కొవ్వులు పుష్కలంగా ఉన్నాయి. ఇవి శరీరంలోని ప్రతి అవయవానికి ప్రయోజనకరంగా ఉంటాయి. ఆలివ్ నూనెను ఆహారంలో ఉపయోగించడం వల్ల శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ తగ్గి గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
వేరుశెనగ నూనె
వేరు శెగన నూనె గుండెకు రక్షణగా నిలుస్తుంది. వేరుశెనగ నూనెలో యాంటీసెప్టిక్, ఆస్ట్రిజెంట్, యాంటీస్పాస్మోడిక్ లక్షణాలు ఉన్నాయి. ఈ నూనె గడ్డకట్టదు, ఈ కారణంగా ఇది గుండె రోగులకు చాలా మంచిదని భావిస్తారు. శీతాకాలంలో చాలా నూనెలు త్వరగా గడ్డకట్టేస్తాయి. కానీ వేరుశెనగ నూనె మాత్రం గడ్డకట్టదు. కాబట్టి శీతాకాలంలో దీనిని తినడం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. శరీరాన్ని వెచ్చగా ఉంచడంతో పాటు, పోషణను కూడా ఇస్తుంది. అంతేకాకుండా శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో సహాయపడుతుంది.
నువ్వుల నూనె
నువ్వుల నూనె తీసుకోవడం వల్ల గుండె వ్యాధిగ్రస్తులకు, కొలెస్ట్రాల్ పెరగడానికి కూడా ఎంతో మేలు జరుగుతుంది. నువ్వుల నూనెలో అసంతృప్త కొవ్వులు, మోనోశాచురేటెడ్, పాలీఅన్శాచురేటెడ్ కొవ్వులు ఉన్నాయి. ఇవి మొత్తం గుండె ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. చలికాలంలో నువ్వులనూనెను తినడం వల్ల శరీరానికి వెచ్చదనం లభిస్తుంది.
అవోకాడో ఆయిల్
అవకాడో నూనె మన ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. యాంటీఆక్సిడెంట్ లక్షణాలతో నిండిన అవోకాడో ఆయిల్ గుండెను బలోపేతం చేస్తుంది. ఈ నూనెలో లుటిన్ వంటి ఆరోగ్యకరమైన యాంటీఆక్సిడెంట్ లక్షణాలు ఉన్నాయి. ఇవి ఆరోగ్యానికి, కళ్ళకు ప్రయోజనకరంగా ఉంటాయి. పెరిగిన కొలెస్ట్రాల్ ను అదుపులో ఉంచడానికి అవొకాడో ఆయిల్ ను ఉపయోగించవచ్చు. అయితే, ఈ నూనె కొంచెం ఖరీదైనది, అందువల్ల దీనిని రోజూ ఉపయోగించడం వల్ల బడ్జెట్ పై భారం పడుతుంది. కాబట్టి అప్పుడప్పుడు వాడేందుకు ప్రయత్నించండి.
(గమనిక: అధ్యయనాలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ కోసం ఇక్కడ అందిస్తున్నాం. ఇది కేవలం సమాచారం మాత్రమే. ఇది వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి సందేహాలుంటే వెంటనే వైద్యులను సంప్రదించండి.)