గుండె జబ్బులు ఎప్పుడు ఎవరికి వస్తాయో చెప్పడం కష్టం. ఎక్కువగా వృద్దుల్లోనే గుండె జబ్బులు వస్తాయని అనుకుంటారు. నిజానికి ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా గుండె జబ్బులు వచ్చి పడుతున్నాయి. అవి పిల్లలను కూడా ప్రభావితం చేస్తున్నాయి.
వికసించే బాల్యంలోనే తీవ్రమైన గుండె సమస్యలు వారిని ఎదగకుండా అడ్డుకుంటున్నాయి. పిల్లల్లో గుండె జబ్బులు ఎందుకు వస్తాయో తెలుసుకుంటే వారిని కాపాడుకోవచ్చు.
కొన్నిసార్లు పుట్టుకతోనే పిల్లల్లో గుండె జబ్బులు వస్తాయి. అంటే గుండెలో రంధ్రాలు ఏర్పడడం, గుండె నిర్మాణం సరిగా లేకపోవడం వంటివి జరుగుతాయి. అలాంటి పిల్లలు శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడతారు. బరువు పెరగరు. తీవ్రమైన అలసట బారిన పడతారు. కుటుంబంలో గుండె జబ్బుల చరిత్ర ఉంటే పుట్టబోయే పిల్లలకు ఇలాంటి సమస్యలు వస్తాయి. వీటిని అడ్డుకోవడం చాలా కష్టం. కానీ పిల్లలు పుట్టిన తర్వాత గుండె జబ్బులు బారిన పడకుండా అడ్డుకోవాలంటే తల్లిదండ్రులు వారికి ఆరోగ్యకరమైన ఆహారాన్ని పెట్టాలి.
ఇప్పుడు అంతా జంక్ ఫుడ్ అధికంగా దొరుకుతుంది. పిల్లలు కూడా ఆ జంక్ ఫుడ్‌ను తినడానికి ఇష్టపడతారు. అలా జంక్ ఫుడ్ తిని ఊబకాయం బారిన పడుతున్న పిల్లలు అధికంగానే ఉన్నారు. ఊబకాయం వల్ల గుండెపై ఎక్కువ ఒత్తిడి పడుతుంది. అలాగే అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్ వంటి సమస్యలు కూడా వస్తాయి. ఇవన్నీ కూడా చివరికి గుండె జబ్బులకు కారణం అవుతాయి. కాబట్టి మీ పిల్లలు ఊబకాయం బారిన పడకుండా కాపాడుకోండి. జంక్ ఫుడ్ ను తగ్గించి వారు ఎత్తుకు తగ్గ బరువే ఉండేలా చూసుకోండి.
కొన్ని రకాల వైరస్లు గుండె కండరాలను ఎంతో ప్రభావితం చేస్తాయి. దీనివల్ల గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉంది. ఆ వైరస్ ల బారిన పడకుండా పిల్లలను సురక్షితమైన ప్రాంతాలలో ఉంచాలి. ఇంటిని పరిశుభ్రంగా ఉంచి పిల్లల్ని పెంచడం ముఖ్యం.
ధూమపానం చేసే చోట పిల్లలును ఉంచడం మంచి పద్ధతి కాదు. ఆ పొగను వారు తమకు తెలియకుండానే పీల్చేస్తారు. ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది. చిన్నపిల్లల ఊపిరితిత్తులు పొగ ప్రభావాలను ఏమాత్రం తట్టుకోలేవు. అలాగే గుండె కూడా ఆ పొగను తట్టుకోలేదు.
గర్భధారణ సమయంలో తల్లి అధిక రక్తపోటు, డయాబెటిస్ వంటి వ్యాధులతో బాధపడుతుంటే ఆ ప్రభావం గర్భస్థ శిశువుపై పడే అవకాశం ఉంటుంది. ప్రసవం అయ్యాక బిడ్డల్లో గుండె జబ్బులు వచ్చే అవకాశాన్ని పెంచేస్తుంది.
పిల్లల గుండెను కాపాడుకోవడం కోసం ఆరోగ్య పరీక్షలు ఎప్పటికప్పుడు చేయించండి. అలాగే వారికి మంచి ఆహారాన్ని ఇవ్వండి. ప్రతిరోజు నడక వంటి చిన్న చిన్న వ్యాయామాలు చేయించేందుకు ప్రయత్నించండి. వారు శ్వాస ఆడక ఇబ్బంది పడుతున్నా, తీవ్రంగా అలసిపోతున్న వెంటనే వైద్యులను కలిసి తగిన పరీక్షలు చేయించండి. పిల్లలను కలుషిత వాతావరణంలోను, సిగరెట్ పొగలకు దూరంగా ఉంచడం చాలా మంచిది.
(గమనిక: అధ్యయనాలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ కోసం ఇక్కడ అందిస్తున్నాం. ఇది కేవలం సమాచారం మాత్రమే. ఇది వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి సందేహాలుంటే వెంటనే వైద్యులను సంప్రదించండి.)
టాపిక్