Fictional gadgets: బటన్ నొక్కితే వంట రెడీ, ఊహిస్తే డ్రెస్సు రెడీ! టెకీలు.. ఈ గ్యాడ్జెట్లు కనిపెట్టండి ప్లీజ్!
Fictional gadgets: టెక్నాలజీ ఎంతగా అబివృద్ధి చెందిందో కదా.. అయినా మనకు లోటును మిగిల్చే గ్యాడ్జెట్లు, టెక్నాలజీని కొన్నింటిని ఇంకా కనుక్కోనే లేదు. ఇవి గనక కనిపెడితే రోజూవారీ సమస్యలలు తీరడంతో పాటే, ప్రతి ఒక్కరూ సూపర్ మ్యాన్ లాగా ఫీలయిపోతారు. మీరు కూడా ఈ గ్యాడ్జెట్లు చూసి ఏది కోరుకుంటారో చూడండి.
ప్రతి ఒక్కరికి ఒక ఊహాలోక ప్రపంచం ఉంటుంది. అందులో తీరని కోరికలుంటాయి. కొందరికి సూపర్ మ్యాన్ లాగా మారాలనుకుంటే, మరికొందరికి వంట చేసే బాధ లేని లోకముంటే బాగుండు అనిపిస్తుంది. ఇలా మన నెరవేరని కోరికల్ని తీర్చే కొన్ని గ్యాడ్జెట్లు ఇంకా ఎవ్వరూ కనిపెట్టనే లేదు. టెక్నాలజీ ఇంత పెరిగినప్పుడు వాటినీ కనిపెట్టి మమ్మల్ని సంతోష పర్చొచ్చుకదా అంటారు ఈ ఇమాజినరీ వరల్డ్ జనాలు. అలాంటి వింతకోరికలు, అవి తీర్చే ఫిక్షనల్ గ్యాడ్జెట్లు చూడండి.
అవుట్‌ఫిట్ మ్యాచింగ్ సాఫ్ట్‌వేర్:
మనం వేసుకోవాల్సిన డ్రెస్ గురించి సలహాలిచ్చే సాఫ్ట్‌వేర్ ఉంటే ఎంత బాగుంటుందో కదా. ప్రతిసారీ ఎవరినీ మన డ్రెస్ ఎలాగుందో అడగక్కర్లేదిక. ఏ డ్రెస్‌కు ఎలాంటి యాక్సెసరీలు, స్కర్ట్, ప్యాంట్, షూ నప్పుతాయే ఆ సాఫ్ట్‌వేర్‌ను అడిగితే చెప్పేయాలి. ఆర్టిఫిషియల్ ఇంటిలీజెన్స్ వాడి ట్రెండింగ్ లుక్స్ ఇప్పటికే సృష్టిస్తున్నారు. అలా కాకుండా మన దగ్గర ఉన్న దుస్తులనే ట్రెండీగా మార్చే సాఫ్ట్‌వేర్ కావాలి మాకు.
స్మార్ట్ షూ:
షూలో కాలు పెట్టగానే దానికదే లేసులు కట్టుకుంటే ఎంత బాగుంటుందో కదా. సూపర్ మ్యాన్ లాగా ఫీలయిపోతాం ఇక. వాటికవే లేసులు ఊడదీసుకుని మన కాళ్ల నుంచి విడిపోవాలి. ఇక షూలతో ఉండే సౌకర్యం వందింతలు అవుతుంది. కొన్ని బ్రాండ్లు ఇప్పటికే స్మార్ట్ షూలు విడుదల చేసినా వాటి ధర మాత్రం చాలా ఎక్కువ.
ఎక్స్-రే అద్దాలు:
కొన్ని ఫిక్షనల్ సినిమాల్లో కళ్లకు అద్దాలు తగిలించుకుని ఏ గోడ చాటున ఎవరు దాక్కున్నారు, దయ్యాలు ఎక్కడున్నాయి, ఎక్కడైనా చాటున ఆయుధాలు దాచి పెట్టారా అని వీటితో కనిపెట్టేస్తారు. ఇలాంటివి నిజ జీవితంలో ఉంటే చెడు పనులకే వాడతారు. కానీ ఇలాంటిదొకటి నిజంగా కనిపెడితే మాత్రం బాగుంటుంది కదూ. ఇలాంటి కళ్లద్దాలు దొరికితే మీరు దేనికోసం వాడతారు?
ఫుడ్ మెషీన్:
కొన్ని రకాల కార్టూన్లలో అలా బటన్ నొక్కగానే రకరకాల వంటకాలు రెడీ అయిపోయి పొగలు గక్కుతూ ముందుకొస్తాయి. తినడానికే సమయంలేని రోజులు గడుపుతున్నాం కదా. ఇక వంటకు సాయం చేసే ఈ ఫుడ్ మెషీన్ తయారు చేశారంటే ఎంత ఖరీదైనా అందరూ కొనేసుకుంటారు. అలా ఒక బటన్ నొక్కగానే వేడిగా కర్రీలు, చపాతీలు, పీజ్జాలు.. ఏది కావాలంటే అది వచ్చి మన ముందుంటాయనే ఊహ ఎంత బాగుందో.
టైమ్ బెండింగ్ వాకీ-టాకీ:
భవిష్యత్తులో ఉన్న మనుషులు పూర్వీకులతో మాట్లాడే అవకాశం, లేదంటే మన భవిష్యత్తు రూపంతో మనమే మాట్లాడుకునే అవకాశం కావాలనే ఊహాజనిత కోరిక ఇది. మన గడిచిపోయిన వయసులో ఉన్న మన రూపంతోనే మనం మాట్లాడుకుని అప్పుడు చేసిన లోపాలు సరిదిద్దుకునే అవకాశం ఉంటే మాత్రం బాగుంటుంది. అలా మాట్లాడే అవకాశం వస్తే మీతో మీరు ఏం చెప్పుకుంటారు? ఏం మార్చుకుంటారు? ఇంకో చిన్న కోరిక🤗.. ఏ స్టాక్స్‌లో ఇన్వెస్ట చేస్తే లాభాలు వస్తాయో తెల్సుకోడానికి భవిష్యత్తు మనుషులతోనూ మాట్లాడే అవకాశం ఉండాలి. అప్పుడుకానీ మార్కెట్ కుప్పకూలిపోదు అంటారా? అయితే మీ ఇష్టం.
మెమోరీ ఎరేజర్:
మన జ్ఞాపకాలలోని కొన్ని విషయాలు నిరంతరం బాధను కలగజేస్తాయి. మనకు నచ్చని మనుషులు, వాళ్ల గుర్తులు, బాధ పెట్టే విషయాల్ని మెదడు నుంచి శాశ్వతంగా తుడిచేసే మెమోరీ ఎరేజర్ ఉంటే ఎలా ఉంటుంది? అలా మనకు నచ్చని విషయాల్ని తుడిచేసుకుంటూ పోతే నిజంగా మనం ఏ బాధలు లేకుండా ఆనందంగా ఉండగలం అంటారా?
హాలోగ్రాఫిక్ ఫ్యాషన్:
ఆన్‌లైన్ షాపింగ్ లోనో, బయట దుకాణంలోనో ఒక డ్రెస్ చూస్తాం. కానీ తీరా కొనుక్కున్నాక అది అస్సలు సూటవ్వదు అనిపిస్తుంది. అలాకాకుండా ఈ హాలోగ్రాఫిక్ ఫ్యాషన్ టెక్నాలజీ వచ్చిందనుకోండీ.. ఒక డ్రెస్ సెలెక్ట్ చేసుకోగానే దాంట్లో మనం ఎలా ఉంటామో ఫొటో వచ్చేస్తుంది. ఫిట్టింగ్‌తో సహా చూయిస్తుంది. ఇది మాత్రం మన సమస్యను తీర్చే బెస్ట్ టెక్నాలజీ అవుతుంది.
టాపిక్