Mouth Cancer: ఈ ఐదు అలవాట్ల వల్ల నోటి క్యాన్సర్ వచ్చే రిస్క్ పెరుగుతుంది! జాగ్రత్త
Mouth Cancer: కొన్ని అలవాట్ల వల్ల నోటి క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంటుంది. ఇవి అలాగే కొనసాగిస్తే ఈ రిస్క్ పెరుగుతూ పోతుంది. అలా అలవాట్లు ఏవో ఇక్కడ తెలుసుకొని జాగ్రత్త పడండి.
నోటి క్యాన్సర్ కేసులు ఆందోళనకర స్థాయిలో పెరుగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో ఈ క్యాన్సర్ బారిన పడుతున్న వారి సంఖ్య ప్రతీ సంవత్సరం అధికమవుతోంది. ఇండియాలోనూ నోటి క్యాన్సర్ కేసులు ఎక్కువవుతున్నాయి. పెదాలు, నాలుక, దవడలు, చెంపల లోపల సహా నోటిలో వచ్చే క్యాన్సర్‌ను నోటి క్యాన్సర్‌గా పరిగణిస్తారు. కొన్ని అలవాట్ల వల్లే ముఖ్యంగా చాలా మందిలో నోటి క్యాన్సర్ రిస్క్ పెరుగుతుంది. ఆ అలవాట్లు ఏవంటే..
ధూమపానం
సిగరెట్లు, బీడీలు తాగడం వల్ల నోటి క్యాన్సర్ రిస్క్ చాలా పెరుగుతుంది. ధూమపానం చేయడం నోటికి చాలా చేటు చేస్తుంది. ఈ అలవాటు లేని వారితో పోలిస్తే ధూమపానం చేసే వారికి నోటి క్యాన్సర్ రిస్క్ పది రెట్లు ఉంటుందని కొన్ని అధ్యయనాలు తేల్చాయి. అందుకే ఒకవేళ ధూమపానం చేస్తుంటే మానేయాలి. ఒకవేళ ధూమపానం కొనసాగిస్తే తరచూ వైద్యులను సంప్రదించి.. పరీక్షలు చేయించుకోవాలి.
మద్యపానం
మద్యం అతిగా తాగడం వల్ల నోటి క్యాన్సర్ ప్రమాదం పెరుగుతుంది. మద్యపానం వల్ల చాలా రకాల ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. అందులో నోటి క్యాన్సర్ కూడా ప్రధానమైనది. ధూమపానం, మద్యపానం రెండు అలవాట్లు ఎక్కువగా ఉన్న వారికి నోటి క్యాన్సర్ వచ్చే డేంజర్ మరింత అధికంగా ఉంటుంది.
పొగాకు నమలడం
పొగాకు నమిలే అలవాటు వల్ల కూడా నోటి క్యాన్సర్ ప్రమాదం చాలా పెరుగుతుంది. పొగలేకున్నా పొగాకు వాడకం వల్ల రిస్క్ ఎక్కువవుతుంది. పొగాకులో పోలోనియం, కాడ్మియం, నైట్రో సమైన్స్ సహా మరిన్ని హానికారకాలు ఉంటాయి. ఇవి ఆరోగ్యాన్ని చాలా దెబ్బ తీస్తాయి.
అసురక్షిత శృంగారం
అసురక్షిత శృంగారం వల్ల నోటి క్యాన్సర్ వ్యాప్తి చెందే రిస్క్ ఉంటుంది. ఎందుకంటే అసురక్షిత శృంగారం వల్ల పిల్లోమా వైరస్ (హెచ్‍వీపీ) ద్వారా ఈ క్యాన్సర్ ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది. శృంగారంలో ముద్దులు, ఓరల్ సెక్స్ చేసే సమయంలో ఇద్దరిలో ఎవరికైనా నోటి క్యాన్సర్ ఉంటే.. ఇది మరొకరికి సోకే రిస్క్ ఉంటుంది. అందుకే నోటి క్యాన్సర్ ఉంటే సురక్షిత శృంగారం మాత్రమే చేయాలి.
అనారోగ్యకరమైన ఆహారం
పోషకాలు లేని అనారోగ్యకరమైన ఆహారం వల్ల కూడా నోటి క్యాన్సర్ రిస్క్ పెరిగే అవకాశాలు ఉంటాయి. అందుకే పోషకాలు ఉండే కూరగాయలు, పండ్లను డైట్‍లో నిరంతరం తీసుకోవాలి. శరీరానికి అవసరమైన పోషకాలు అందేలా ఆహారం తీసుకోవాలి. ప్రతీ రోజు పండ్లు తినడం వల్ల నోటి క్యాన్సర్ రిస్క్ చాలా తగ్గుతుందని కొన్న అధ్యయనాలు వెల్లడించాయి.
నోటి లోపలి భాగాలు, పెదాల నుంచి రక్తస్రావం ఎక్కువగా వస్తూ.. వారం రోజుల వరకు ఇది తగ్గకపోతే అసలు నిర్లక్ష్యం చేయకూడదు. వెంటనే సంబంధిత నిపుణులను సంప్రదించాలి. ఇది నోటి క్యాన్సర్ లక్షణంగా ఉండొచ్చు. పెదాలు, నోటి భాగాల్లో పెద్దగా గరుకుగా మచ్చలు ఉండే కూడా నిపుణులను కలవాలి. ఆహారం నమలడంలో, మింగడంలో ఎక్కువ కాలంగా ఇబ్బందులు ఉంటే కూడా ఇది ఓ లక్షణం కావొచ్చు. సుదీర్ఘ కాలంగా నోటి నుంచి దుర్వాసన వస్తున్నా వైద్య నిపుణులను సంప్రదించాలి.
టాపిక్