Children Sleeping : ఈ ఆహారాలు పిల్లలు బాగా నిద్రపోయేందుకు ఉపయోగపడతాయి
Children Sleeping Foods : ఎదిగే పిల్లలకు నిద్ర అవసరం. సరైన నిద్ర ఉంటే ఆరోగ్యం కూడా బాగుంటుంది. అందుకే పిల్లలు సరైన నిద్రపోయేందుకు మంచి ఆహారం ఇవ్వాలి. అందుకోసం ఈ కింది లిస్ట్ ఫాలో అవ్వండి.
పిల్లల మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి పౌష్టికాహారంతో పాటు తగినంత నిద్ర చాలా ముఖ్యం. శక్తి, నరాల పనితీరు, మానసిక స్థితి, శారీరక, మానసిక అభివృద్ధిలో తగినంత నిద్ర ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది. ప్రస్తుత జీవనశైలిలో చాలా మంది పిల్లలలో సరైన నిద్ర లేకుండా ఉండటం గమనించవచ్చు. ఇది పిల్లల ఆరోగ్యానికి మంచిది కాదు. తల్లిదండ్రులు కూడా పిల్లలను నిద్రలోకి జారుకునే వరకు ఓ యుద్ధమే చేయాల్సి వస్తుంది. అందుకే మీ పిల్లలు సరిగా నిద్రపోయేందుకు కొన్ని ఆహారాలు ఇవ్వాలి.
గుడ్లు ప్రోటీన్, పోషకాలతో సమృద్ధిగా ఉంటుంది. అవి ట్రిప్టోఫాన్, ఒక రకమైన అమైనో ఆమ్లం యొక్క సహజ మూలం. గుడ్లలో ఉండే ఈ అమినో యాసిడ్ సెరోటోనిన్ ఉత్పత్తిలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఇది నిద్ర చక్రాన్ని నియంత్రించడంలో సాయపడుతుంది.
పడుకునే ముందు రెండు కివిలను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల నిద్రను మెరుగుపరుస్తుంది. పరిశోధన ప్రకారం, పడుకునే ముందు రెండు కివీలు తిన్న వారు 42 శాతం వేగంగా నిద్రపోతారు. ఈ అధ్యయనం పెద్దలపై జరిగింది, పిల్లలపై కాదు. కానీ రెండు కాకుంటే ఒకటి అయిన ఇస్తే ఉపయోగం ఉంటుంది.
ఒక గ్లాసు వెచ్చని పాలు రాత్రి నిద్ర పొందడానికి అత్యంత ప్రభావవంతమైన మార్గం. పాలలో సెరోటోనిన్, మెలటోనిన్ ఉత్పత్తికి అవసరమైన ట్రిప్టోఫాన్ అనే అమినో యాసిడ్ ఉంటుంది. పాలు మంచి నిద్రకు తోడ్పడతాయి. చాలా మంది ఈ అలవాటును ఫాలో అవుతారు.
మీ బిడ్డ ఏదైనా తీపిని కోరుకుంటే ఖర్జూరాలు ఉత్తమ ఎంపిక. మంచి నిద్రకు ఖర్జూరాలు బాగా ఉపయోగపడతాయి. ఖర్జూరంలో విటమిన్-బి6, పొటాషియం ఉంటాయి. ఇవి నిద్రలో ముఖ్యమైన పాత్రను పోషిస్తాయి.
చిక్‌పీస్‌లో అమైనో యాసిడ్ ట్రిప్టోఫాన్ పుష్కలంగా దొరుకుతుంది. ఇది మెలటోనిన్ ఉత్పత్తిలో ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది. చిక్‌పీస్‌లో విటమిన్ B6 కూడా ఉంటుంది. ఇది సెరోటోనిన్ ఉత్పత్తికి చాలా అవసరం. మెలటోనిన్, సెరోటోనిన్ రెండూ మంచి నిద్రకు పనికి వస్తాయి.
వాల్‌నట్‌లు మెలటోనిన్ అనే హార్మోన్ అద్భుతమైన మూలం. ఇది నిద్రను నియంత్రించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఇది ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్, మొక్కల ఆధారిత ప్రోటీన్లను కలిగి ఉంటుంది. ఇది మంచి నిద్ర కోసం ఉపయోగపడుతుంది. పిల్లల ఆహారంలో కచ్చితంగా వాల్ నట్స్ ఇవ్వండి.
అరటిపండ్లు ట్రిప్టోఫాన్, మెగ్నిషియం మూలం. అవి మంచి నిద్రకు సహాయపడతాయి. మెగ్నీషియం లోపం నిద్ర సమస్యలను కలిగిస్తుందని చెబుతుంటారు. మీ బిడ్డ అరటిపండ్లను ఇష్టపడకపోతే మెగ్నీషియం యొక్క ఇతర వనరులను ఇవ్వాలి. వివిధ రకాల గింజలు, బచ్చలికూరలాంటివి ఇవ్వొచ్చు.