Vegetables: ఫ్రిజ్‌లో పెట్టకూడని కూరగాయలు ఇవి, వీటిని ఎలా నిల్వ చేయాలంటే
Vegetables: కూరగాయలను ఎక్కువ రోజులు తాజాగా ఉంచడానికి ఫ్రిజ్ లో నిల్వ చేస్తూ ఉంటాము. అయితే ఫ్రిజ్ లో నిల్వ చేయకూడని కూరగాయలు కొన్ని ఉన్నాయి. ఈ విషయం తెలియక ఎంతో మంది వీటిని ఫ్రిజ్ లో పెడతారు.
చలికాలం అయినా, ఎండాకాలం ఫ్రిజ్ మాత్రం ఇంట్లో పనిచేయాల్సిందే. ఆహార పదార్థాలను ఎక్కువ కాలం పాటూ తాజాగా ఉంచడానికి ఫ్రిజ్ చాలా అవసరం. మార్కెట్ నుంచి తెచ్చిన కూరగాయలను ఫ్రిజ్ లో భద్రపరచి రోజుల తరబడి వాడుతూ ఉంటారు. అయితే, కొన్ని కూరగాయలను ఫ్రిజ్ నిల్వ చేయకూడదు. కానీ ఆ విషయం తెలియక ఎన్నో కూరగాయలను ఫ్రిజ్ లోనే ఉంచుతున్నాం. దీనివల్ల ఎన్నో రకాలుగా నష్టాలు ఎదురయ్యే అవకాశం ఉంది.
ఆకుపచ్చ కూరగాయలు
శీతాకాలంలో వివిధ రకాల ఆకుకూరలు తింటారు. ఆ కాలంలోనే అవి అధికంగా పండుతాయి. ఆకుపచ్చ కూరగాయలను ఫ్రిజ్ లో భద్రపరిచేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఆకుకూరలను శుభ్రంగా కడిగిన తర్వాత 12 గంటల పాటు ఫ్రిజ్ లో ఉంచవచ్చు. ఈ ఆకుకూరలను ఎక్కువ కాలం నిల్వ చేయడం వల్ల వాటి సహజ రుచి, ఆకృతి మారిపోతుంది. అలాగే వాటిలోని పోషకాలపై ప్రతికూల ప్రభావం చూపుతుంది.
వెల్లుల్లి, ఉల్లి
ఉల్లిపాయలు, వెల్లుల్లి వంటివి కూడా ఇంట్లో అత్యవసరమైనవి. ఇవి లేకుండా ఏ కూరా పూర్తి కాదు. వెల్లుల్లి, ఉల్లిపాయలు వంటివి అధిక మొత్తంలో కొని రెండు మూడు వారాల పాటూ నిల్వ చేసుకుంటారు. వీటిని ఎప్పుడూ ఫ్రిజ్ లో నిల్వ చేయకూడదు. నిజానికి వెల్లుల్లి, ఉల్లిపాయలను ఫ్రిజ్ లో భద్రపరచడం వల్ల అవి మొలకెత్తేస్తాయి. దీనివల్ల వాటి రుచి చెడిపోతుంది. అందువల్ల, వాటిని ఎల్లప్పుడూ చల్లని, పొడి ప్రదేశంలో నిల్వ చేయాలి.
అల్లం
అల్లం ప్రతి ఇంట్లో కచ్చితంగా ఉంటుంది. చలికాలంలో అల్లాన్ని ఎక్కువగా ఉపయోగిస్తారు. ఇది ఆహార రుచిని పెంచడానికి మాత్రమే కాకుండా సహజ ఔషధంగా కూడా ఉపయోగపడుతుంది. చాలా మంది అల్లాన్ని ఫ్రిజ్ లో భద్రపరుస్తారు. అల్లాన్ని ఫ్రిజ్ లో నిల్వ చేయకూడదు. అల్లాన్ని ఫ్రిజ్ లో ఉంచడం వల్ల కూడా త్వరగా బూజు వచ్చి చెడిపోతుంది. దాన్ని తింటే మూత్రపిండాలు, కాలేయానికి హానికరంగా మారుతుంది.
బంగాళాదుంపలు
చలికాలం అయినా, వేసవి కాలం అయినా బంగాళాదుంపలను ఫ్రిజ్ లో పెట్టకూడదు. ఇది ఆరోగ్యానికి ఎంతమాత్రం మంచిది కాదు. నిజానికి బంగాళాదుంపలను ఫ్రిజ్ లో ఉంచడం వల్ల అవి మొలకెత్తడమే కాదు, బంగాళాదుంపలో ఉండే పిండి పదార్థం చక్కెరగా మారుతుంది. ఈ కారణంగా, ఇది డయాబెటిస్ రోగులతో పాటు, డయాబెటిస్ లేని వారికి కూడా రోగాలను తెచ్చిపెడుతుంది.
టమోటాలు
టమోటాలు కచ్చితంగా కూరల్లో పడాల్సిందే. ఇగురు కూరలు కావాలంటే టమోటాలు వేయాలి. ప్రతి ఇంట్లో ఉండేవి టమోటాలే. అందుకే రెండు మూడు కిలోల టమోటాలను ఇంట్లోకి తీసుకువచ్చి నిల్వ చేస్తారు. చాలా మంది వాటిని కుళ్లిపోకుండా ఉండేందుకు ఫ్రిజ్ లో భద్రపరుస్తారు. టమోటాలను ఫ్రిజ్‌లో నిల్వ చేయడం ద్వారా, వాటి రుచి, ఆకృతి రెండూ మారిపోతాయి. అలాగే టమోటాల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు కూడా నశిస్తాయి.
(గమనిక: అధ్యయనాలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ కోసం ఇక్కడ అందిస్తున్నాం. ఇది కేవలం సమాచారం మాత్రమే. ఇది వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి సందేహాలుంటే వెంటనే వైద్యులను సంప్రదించండి.)