Tuesday Motivation: మీ జీవితాన్ని మార్చే గౌతమ బుద్ధుడి బోధనలు ఇవి, పాటిస్తే ప్రశాంతమైన జీవితం మీదే
Tuesday Motivation: గౌతమ బుద్ధుడు భారతీయ తత్వవేత్త. ధ్యానానికి చిహ్నంగా మారాడు బుద్ధుడు. అతను చెప్పిన బోధనలను ఆకళింపు చేసుకుంటే జీవితం ప్రశాంతంగా సాగుతుంది.
Tuesday Motivation: సిద్ధార్థ గౌతమ అనే యువరాజే గౌతమ బుద్ధుడిగా మారాడు. అతను తన మార్గాన్ని మార్చుకోవడం కోసం ధ్యానాన్ని ఆశ్రయించాడు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎంతోమందికి బుద్ధుడు దేవుడు కాదు, ఒక నాయకుడు. అతని బోధనలు జీవితంలో సంపూర్ణతను అందిస్తాయి. ఎదుటివారిపై కరుణను కలిగేలా చేస్తాయి. నైతిక జీవనానికి పునాదులు వేస్తాయి. శాంతి, జ్ఞానోదయం వంటి వాటిని అందించే బోధనలు గౌతమ్ బుద్ధుడికే సాధ్యం.
రాజభోగాలను విడిచిపెట్టి ఆధ్యాత్మిక జ్ఞానోదయం కోసం అడవులు పట్టిన గౌతమ బుద్ధుడు... మనుషులకు ఎన్నో విషయాల్లో ఆదర్శవంతమైన వ్యక్తి. అతనిలో వచ్చిన పరివర్తన ఎంతోమందికి ఆచరణీయమైనది. గౌతమ బుద్ధుని బోధనలు మనసుకు ప్రశాంతతను ఇస్తాయి.
గౌతమ్ బుద్ధుడు చెప్పిన ప్రకారం అంతర్గత మానసిక శాంతి అనేది మనిషి తనకు తానే నిర్ణయించుకోవాలి. మీరు సంతోషంగా ఉండాలని మీపైన ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే మీ సంతోషానికి, దుఃఖానికి మీరే కారణం. సొంత కోరికలు, అనుబంధాల నుండే బాధలు పుడతాయి అన్నది బుద్ధుడి అభిప్రాయం. కాబట్టి అధిక కోరికలను విడిచిపెట్టడం ద్వారా మానసిక ప్రశాంతతను పొందవచ్చు. ఆనందం, శాంతి అన్ని మనలోనే ఉంటాయి. అత్యాశకు పోతే ఆ రెండూ దూరం అవ్వడం ఖాయం.
బుద్ధుడు చెప్పిన ప్రకారం కోరికలను ఎంత తగ్గించుకుంటే బాధలు కూడా అంతే తగ్గుతాయి. జీవితంలో గొప్ప శాంతిని పొందవచ్చు. ప్రతిరోజు ధ్యానాన్ని చేయడం అలవర్చుకోవాలి. ఇది ఏ విషయాన్ని అయినా స్పష్టంగా చూడగలిగే శక్తిని ఇస్తుంది. కోరికలు, భయాలు, భ్రమల నుండి విముక్తి కలిగిస్తుంది. సంతృప్తికరమైన జీవితాన్ని అందిస్తుంది. ధ్యానం వల్ల ఆలోచనలు భావోద్వేగాలు అదుపులో ఉంటాయి.
బుద్ధుడు చెప్పిన బోధనలో నైతిక జీవనం ఒకటి. జీవితాన్ని నీతివంతంగా బతకాలన్నది ఆయన ఉద్దేశం. ముఖ్యంగా దొంగిలించడం, లైంగికంగా ఇతరుల పట్ల చెడుగా ప్రవర్తించడం, అబద్దం చెప్పడం, మత్తుకు బానిసవ్వడం వంటివి చేస్తే జీవితాన్ని నాశనం చేసుకున్నట్టే. వాటిని చేయని వ్యక్తి జీవితంలో ప్రశాంతంగా బతుకుతాడు అన్నది బుద్ధుడి ఉద్దేశం. మనుషులు నైతికతకు కట్టుబడి జీవిస్తుంటే వారిలో విశ్వాసం, గౌరవం, కరుణా వంటివి కూడా పెరుగుతాయి.
ఏది జీవితంలో శాశ్వతంగా ఉండదనేది గౌతమ బుద్ధుడు చెప్పే ముఖ్యమైన బోధన. జీవితంలో మనకు లభించేవన్నీ అశాశ్వతమైనవి. వాటి కోసం ఎక్కువగా ఆలోచించడం, ఆరోగ్యాన్ని పాడు చేసుకోవడం మంచిది కాదన్నది ఆయన బోధనల సారం. కాబట్టి జీవితంలోని అశాశ్వత బంధాలను కోసం పూర్తి జీవితాన్ని కష్టాలపాలు చేసుకోకుండా ప్రశాంతంగా జీవించండి.