Tulsi Plant: ఇంట్లో తులసి మొక్క ఉండడం వల్ల మీకు కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే
Tulsi Plant: ఇంట్లో తులసి మొక్కను పెంచుకోవడం అనేది మతపరమైన అవసరంగా మారిపోయింది. నిజానికి తులసి మొక్కను పెరట్లో పెంచుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. తులసి మొక్కను పూజించినా, పూజించకపోయినా ఆ మొక్కలను ఇంట్లో పెంచడం వల్ల కలిగే ఆరోగ్య లాభాలు ఎన్నో.
హిందూ మతంలో తులసి మొక్కను లక్ష్మీదేవి రూపంగా ఆరాధిస్తారు. హిందూ మతాన్ని విశ్వసించే ప్రతి ఇంట్లో ఒక తులసి మొక్క కచ్చితంగా ఉంటుంది. ఇది మతపరమైన ప్రాముఖ్యతను మాత్రమే కాదు మీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇంట్లో తులసి మొక్కను పెంచడం వల్ల రోజువారీ జీవితానికి సంబంధించిన అనేక సమస్యలను తొలగించడంలో కూడా ఇది ప్రయోజనకరంగా ఉంటుంది. దీన్ని మతపరమైన కోణంలోనే చూడడం అలవాటుగా మారింది. నిజానికి దీన్ని ఆయుర్వేద ఔషధ మొక్కలగా చూస్తే ప్రతి ఒక్కరూ ఈ మొక్కను ఇంట్లో పెంచుకోవాల్సిందే. మనకు ఆరోగ్యాన్ని ఇవ్వడంలో ఈ మొక్కల ముందుంటుంది.
మీరు ఇంకా ఇంట్లో తులసి మొక్కను నాటకపోతే వెంటనే తెచ్చి నాటండి. అలాగని దానికి రోజూ పూజలు చేయాల్సిన అవసరం లేదు. గ్లాసుడు నీళ్లు పోెయండి చాలు. అది మీకు ఎంతో ఆరోగ్యాన్ని అందిస్తుంది.
తులసి మొక్కతో ఆరోగ్యం
మీ ఇంటి ఆవరణలో తులసి మొక్కను నాటడం వల్ల కలిగే ముఖ్యమైన ప్రయోజనం గాలిని శుద్ధి చేయడం. తులసి మొక్కకు గాలిని శుద్ధిచేసే గుణం అధికంగా ఉంటుంది. నిజానికి 24 గంటలూ ఆక్సిజన్ అందించే మొక్కల్లో తులసి మొక్క ఒకటి. కలుషితమైన గాలిని సహజంగా శుద్ధి చేసి తాజాగా ఉంచడానికి ఇది పనిచేస్తుంది. గాలిలో కరిగిన కార్బన్ డయాక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్, మోనాక్సైడ్ వంటి హానికరమైన వాయువులను గ్రహించడంలో తులసి మొక్క చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. వాటిని గ్రహించి ఆక్సిజన్ ను విడుదల చేస్తుంది.
తులసి మొక్కను ఎక్కడ నాటినా అక్కడ ఒక ప్రత్యేకమైన సువాసన వ్యాపిస్తుంది. ఇది వాతావరణంలో తాజాదనాన్ని నింపుతుంది. ఇది మానసిక స్థితిని కూడా తాజాగా ఉంచేందుకు, మనస్సును ఉత్సాహంగా ఉంచేందుకు సహాయపడుతుంది. అంతేకాకుండా తులసి ఆకుల కషాయాన్ని క్రమం తప్పకుండా తాగడం వల్ల మనసు ప్రశాంతంగా ఉండటమే కాకుండా శరీరంలోని అలసట కూడా తొలగిపోతుంది.
ఇంట్లో తులసి మొక్కను నాటడం వల్ల మీ ఆరోగ్యానికి మరెన్నో ప్రయోజనాలు లభిస్తాయి. తులసి లక్షణాలను ఆయుర్వేదంలో కూడా వివరించారు. తులసిలో ఔషధ గుణాలు పుష్కలంగా ఉంటాయి. మీ ఇంట్లో ఎవరికైనా దగ్గు, జలుబు వంటి సీజనల్ వ్యాధులు ఉంటే తులసి ఆకుల రసాన్ని తాగేందుకు ప్రయత్నించండి. చలికాలంలో ఎలాంటి అనారోగ్యం బారిన పడకుండా ఉండాలంటే రెండు తులసి ఆకులను ప్రతిరోజూ నమిలేందుకు ప్రయత్నించండి.
అలాగే తులసి ఆకులను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల క్యాన్సర్, గుండె సంబంధిత వ్యాధులు, శ్వాసకోశ సమస్యలు, చర్మ సంబంధిత వ్యాధులు రాకుండా రక్షణ లభిస్తుంది. వైరల్ ఫీవర్ విషయంలో తులసి ఆకుల కషాయాన్ని తాగడం వల్ల ఉపశమనం లభిస్తుంది.
తులసి మొక్కను ఇంట్లో నాటడం వల్ల స్వచ్ఛమైన గాలి అందడంతో పాటూ దోమల బెడద కూడా తగ్గుతుంది. దోమల కోసం రసాయన ఆధారిత హానికరమైన ఉత్పత్తులను ఉపయోగించే బదులు తులసి మొక్క సహాయం తీసుకోవచ్చు. తులసి ఆకుల్లో దోమల నివారిణి గుణాలు కనిపిస్తాయి. ఎక్కడ తులసి మొక్కలు ఉంటాయో అక్కడ దోమలు కనిపించవు. కాబట్టి మీ పెరట్లో తులసి మొక్కలకు ఎక్కువ ప్రాధానత్య ఇవ్వండి. వాటిని మతపరమైన మొక్కలుగా కాకుండా ఔషధ మొక్కలుగా చూడండి. వాటిని కూడా అధికంగా పెంచండి. ఇవి మీ ఆరోగ్యాన్ని కాపాడతాయి. గాలిని స్వచ్ఛంగా మారుస్తాయి.