క్షయ లేదా టీబీ వ్యాధి తీవ్రమైనది. కానీ దీని లక్షణాల గురించి మాత్రం చాలా తక్కువ మందికే అవగాహన ఉంది. దీని లక్షణాలు సకాలంలో గుర్తించకపోతే ప్రాణాంతకంగా మారిపోతుంది. అందుకే ఈ వ్యాధిపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రతి ఏటా మార్చి 24న ప్రపంచ క్షయవ్యాధి దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఈ వ్యాధికి సరైన సమయంలో చికిత్స ప్రారంభిస్తే రోగి త్వరగా కోలుకునే అవకాశం ఉంది. టీబీ సోకితే కనిపించే లక్షణాల గురించి ఇక్కడ ఇచ్చాము. ఇవి మీలో కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించడం మర్చిపోవద్దు.
క్షయ వ్యాధి కొందరిలో చురుకుగా ఉంటుంది, మరికొందరిలో క్రియా రహితంగా ఉంటుంది. క్రియారహితంగా టీబీ ఉన్న వారిలో లక్షణాలు చాలా అరుదుగా కనిపిస్తాయి. ఎలంటి బాహ్య లక్షణాలు కనిపించవు. అయినప్పటికీ స్క్రీనింగ్ పరీక్షలో క్షయ వ్యాధి బయపడుతుంది. ఇక టిబి కొందరిలో చురుకుగా ఉంటుంది. ఇది త్వరగా లక్షణాలను చూపిస్తుంది. ప్రధానంగా ఊపిరితిత్తులను ప్రభావితం చేస్తుంది. టీబీ సోకితే అది ఒకేసారి వేగంగా పెరగదు. కొన్ని వారాల పాటూ లేదా నెలల పాటూ పెరుగుతూ ఉంటుంది.
1) రాత్రి పూట అధికంగా చెమటలు పడతాయి. జ్వరం వస్తూ పోతూ ఉంటుంది.
2) బరువు చాలా వరకు తగ్గిపోయి సన్నగా కనిపిస్తారు. ఆకలి వేయదు.
3) నిరంతర అలసటగా అనిపిస్తుంది. బలహీనతగా ఉంటుంది.
4) శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా అనిపిస్తుంది. ఛాతీ నొప్పి కూడా ఉంటుంది.
5) రక్తం, శ్లేష్మంతో కూడి దగ్గు వస్తుంది. దగ్గు నిరంతర వస్తుంది.
టిబి ప్రారంభ లక్షణాలు నిరంతర దగ్గు, జ్వరం, రాత్రి చెమటలు, బరువు తగ్గడం మరియు అలసట. మీరు రెండు వారాల కంటే ఎక్కువ ఈ లక్షణాలను అనుభవిస్తే, మీ వైద్యుడిని సంప్రదించండి.
టిబికి సరైన యాంటీబయాటిక్స్ తో చికిత్స చేయవచ్చు. చికిత్స పూర్తయ్యే వరకు డాక్టర్ సూచించిన పూర్తి కోర్సు మందులు తీసుకోవడం అవసరం. అది అదుపులో ఉంటే సాధారణ జీవితం గడపవచ్చు.
టిబి ఇన్ఫెక్షన్ అనేది ఒక వ్యక్తి శరీరంలో టిబి బ్యాక్టీరియా ఉంటుంది. కానీ అతను అనారోగ్యంతో ఉండడు. అలాగే వ్యాధిని వ్యాప్తి చేయలేడు. టీబీ వ్యాధితో బాధపడుతున్న వ్యక్తి మాత్రం ఇతరులకు దాన్ని వ్యాప్తి చెందించగలడు.
హెచ్ఐవి ఉన్నవారిలో బలహీనమైన రోగనిరోధక శక్తి ఉంటుంది. ఇలా రోగనిరోధక శక్తి బలహీనంగా ఉన్నవారికి టిబి సోకే ప్రమాదం ఉంది. టిబి వ్యాధి ఉన్నవారితో కలిసి జీవించేవారికి కూడా వ్యాధి వచ్చే ప్రమాదం ఉంది. పిల్లలకు టిబి వచ్చే ప్రమాదం కూడా ఉంది. టీబీ రోగులకు పిల్లలను దూరంగా ఉంచాలి.
(గమనిక: అధ్యయనాలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ కోసం ఇక్కడ అందిస్తున్నాం. ఇది కేవలం సమాచారం మాత్రమే. ఇది వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి సందేహాలుంటే వెంటనే వైద్యులను సంప్రదించండి.)
సంబంధిత కథనం