Heart Attack: ఇవన్నీ గుండెపోటు సంకేతాలు, కానీ చాలామందికి తెలియక ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు
Heart Attack: గుండెపోటు వచ్చే ముందు కొన్ని రకాల సంకేతాలు కనబడతాయి. వాటిపై అవగాహన పెంచుకుంటే వెంటనే చికిత్సను తీసుకోవచ్చు. ఇక్కడ గుండెపోటు లక్షణాలు గురించి ఇచ్చాము.
గుండె పోటు ప్రాణాంతకమైనదే, కానీ సరైన సమయంలో ప్రమాదాన్ని గుర్తించి చికిత్స తీసుకుంటే ప్రాణాలతో బయటపడవచ్చు. భారతదేశంలో సహా ప్రపంచవ్యాప్తంగా గుండెపోటుతో మరణిస్తున్న వారి సంఖ్య పెరిగిపోతుంది. అనారోగ్యకరమైన జీవనశైలి, చెడు ఆహారపు అలవాట్లే గుండెపోటుకు కారణం అవుతున్నాయి. అయితే గుండెపోటు వచ్చే ముందు కొన్ని రకాల సంకేతాలు కనిపిస్తాయి. వాటి గురించి అవగాహన పెంచుకుంటే వెంటనే చికిత్స తీసుకోవడం ద్వారా ప్రమాదం నుంచి బయటపడవచ్చు. అయితే గుండెపోటు లక్షణాలు తెలియక కొంతమంది ఆ సంకేతాలను విస్మరిస్తున్నారు.
గుండెపోటు ఎందుకు వస్తుంది?
గుండెపోటు రావడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. ఎక్కువగా నూనె పదార్థాలు, తినేవారిలో వ్యాయామం చేయని వారిలో చెడు కొలెస్ట్రాల్ రక్తనాళాల్లో పేరుకుపోయిన వారిలో గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువ. ధమనుల్లో, సిరల్లో అడ్డంకులు ఏర్పడితే గుండె కొట్టుకునే వేగం మారిపోతుంది. చివరికి అది గుండెపోటుకు దారితీస్తుంది. అధిక రక్తపోటు అది ఉన్నవారిలో కూడా గుండెపోటు వచ్చే అవకాశం పెరుగుతుంది. కాబట్టి కొన్ని రకాల సంకేతాలను నిర్లక్ష్యం వహించకూడదు.
క్రమరహిత హృదయ స్పందన
గుండె కొట్టుకొనే వేగం ఎప్పుడూ ఒకేలా ఉండాలి. అది క్రమరహితంగా ఉంటే గుండె ఆపదలో ఉందని అర్థం. సిరలో లేదా గుండె చుట్టూ ఉన్న రక్తం గడ్డ కట్టడం జరిగితే హృదయ స్పందన సక్రమంగా ఉండదు. సాధారణంగా ఆరోగ్యకరమైన వ్యక్తి గుండె 70 నుంచి 72 సార్లు కొట్టుకుంటుంది. ఇది సక్రమంగా లేనప్పుడు ఎప్పుడైనా గుండెపోటు వచ్చే అవకాశం ఉందని అర్థం చేసుకోవాలి.
తీవ్రమైన అలసట
శారీరక శ్రమ అధికంగా చేసేవారిలో తీవ్రమైన అలసట కనిపిస్తుంది. కానీ ఏ పని చేయకపోయినా కూడా కొంతమంది తీవ్రంగా అలసిపోయినట్లు కనిపిస్తారు. ఇలా మీకు అనిపిస్తే శరీరంలో ఏదో అనారోగ్యం ఉందని అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా సిరల్లో అడ్డంకులు ఏర్పడినప్పుడు రక్తం శరీరంలోని అనేక భాగాలకు సరిగ్గా చేరుకోలేదు. దీని కారణంగా కూడా తగినంత శక్తి అందక ఆ మనిషి ఉత్సాహంగా కనిపించడు. నీరసంగా కనిపిస్తాడు. అలసిపోయినట్టు ఉంటాడు. కాబట్టి ఏ పనీ చేయకుండా తీవ్రంగా అలిసిపోతున్నారంటే కచ్చితంగా అనుమానించాల్సిందే.
ఛాతీ నొప్పి
ఛాతీ నొప్పికి ఎన్నో కారణాలు ఉంటాయి. పొట్టలో గ్యాస్ పెరిగినప్పుడు కూడా ఛాతీ నొప్పి వస్తుంది. అయితే ఛాతీ నొప్పి గుండె పోటుకు సంకేతం కావచ్చు. ఛాతీలో నొప్పి వచ్చి.. భుజాలు, చేతులు, వీపుకి కూడా ఆ నొప్పి అలా వ్యాపిస్తుంటే మీరు దాన్ని తక్కువగా అంచనా వేయకూడదు. వెంటనే ఆసుపత్రికి చేరుకొని తగిన చికిత్స తీసుకోవాలి. తగిన పరీక్షలు చేయించుకోవాలి. లేకుంటే పరిస్థితి చేయి దాటిపోయే అవకాశం ఉంటుంది.
(గమనిక: అధ్యయనాలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ కోసం ఇక్కడ అందిస్తున్నాం. ఇది కేవలం సమాచారం మాత్రమే. ఇది వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి సందేహాలుంటే వెంటనే వైద్యులను సంప్రదించండి.)
సంబంధిత కథనం
టాపిక్