Causes Of Yellow Teeth: మీ పసుపు రంగు దంతాలకు కారణం మీకున్న ఈ 5 అలవాట్లే! వెంటనే వీటిని మానుకోండి!-these 5 habits are the reason why your teeth turn yellow if you are doing these things stop immediately ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Causes Of Yellow Teeth: మీ పసుపు రంగు దంతాలకు కారణం మీకున్న ఈ 5 అలవాట్లే! వెంటనే వీటిని మానుకోండి!

Causes Of Yellow Teeth: మీ పసుపు రంగు దంతాలకు కారణం మీకున్న ఈ 5 అలవాట్లే! వెంటనే వీటిని మానుకోండి!

Ramya Sri Marka HT Telugu

Causes Of Yellow Teeth: మీ పళ్ళు పసుపు పచ్చగా మారి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయా? వాటి తప్పేం లేదు. మీ పసుపు రంగు దంతాలకు కారణం మీకున్న కొన్ని రోజూవారీ అలవాట్లే. అవును.. తెలియకుండా మీరు చేసే చిన్న చిన్న పొరపాట్లే మీ అందమైన నవ్వును చెదరగొడుతున్నాయి. అవేంటో తెలుసుకుని మానేసే ప్రయత్నంలో పడండి.

Home remedies for yellow teeth (shutterstock)

అందం అంటే అసలైన అర్థం చిరునవ్వు. చూడగానే మనిషిని ఆకర్షించేది కూడా నవ్వే. అలాంటి నవ్వును చెదరగొడతాయి పసుపు పచ్చ దంతాలు. అందమైన తెల్లని దంతాలు మీ నవ్వును మెరుపరుస్తాయి. అందరిలోనూ ఆత్మవిశ్వాసంతో నిలబడేలా చేస్తాయి. అంతేకాదు.. తెల్లని దంతాలు మంచి ఆరోగ్యానికి సంకేతంగా కూడా చెబుతారు. కానీ చాలా మంది పళ్లు పసుపు పచ్చ రంగులోకి మారి ఇబ్బంది పెడుతున్నాయి. వీటి కారణంగా మనస్పూర్తిగా నవ్వలేకపోతున్నార వారు ఎందరో ఉన్నారు. మీరూ అలాంటి వారే అయితే మీరు కొన్ని ముఖ్యమైన విషయాలను తెలుసుకోవాలి.

దంతాలు పసుపు రంగులోకి మారడానికి కారణం ప్రతి సారి జన్యుపరమైనది మాతమ్రే కాకపోవచ్చు. దంతవైద్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. పళ్లు పసుపు రంగులోకి మారడానికి కారణంగా ఎక్కువ శాతం వ్యక్తులకున్న రోజూవారీ చెడు అలవాట్లేనట. మీకు తెలియకుండానే మీరు చేసే చిన్న చిన్న పొరపాట్లు కొన్ని మీ దంతాల అందాన్ని దెబ్బతీసి వాటిని పసుపు రంగులోకి మార్చేస్తాయి. దంతాల పసుపు రంగుకు కారణమయ్యే 5 రోజువారీ చెడు అలవాట్ల గురించి తెలుసుకుందాం రండి.

పళ్లు పసుపు రంగులోకి మారడం..

1. బాగా బ్రష్ చేయకపోవడం

బ్రష్ చేయడం అంటే పేస్టు పెట్టుకుని అటు ఇటు తిప్పి కడిగేసుకునే వారు కొందరైతే. బ్రష్ నోట్లో పెట్టుకొని గంటల తరబడి వేరు వేరు పనులు చేసుకునే వారు ఇంకొందరు. ఇవి రెండు మీరు చేస్తున్న పొరపాట్లే. బ్రషింగ్ ఎప్పుడూ ఎక్కువ సేపు చేయకూడదు.. అలాగని ఒకే నిమిషంలో పైపైన చేసుకుని కడిగేసుకొవద్దు. సరైన పద్ధతిలో ఉదయం, రాత్రి బ్రష్ చేయాలి. లేదంటే ఆహార కణాలు, బ్యాక్టీరియా దంతాలపై చేరి ప్లాక్‌ను ఏర్పరుస్తాయి. దీనివల్ల దంతాలు పసుపు రంగులోకి మారతాయి.

2. కార్బోనేటెడ్ పానీయాలు

కార్బోనేటెడ్ పానీయాలు అంట సోడా, కోల్డ్ డ్రింక్స్ వంటివి ఎక్కువగా తాగడం కూడా దంతాలను పసుపు రంగులోకి మార్చవచ్చు. ఎందుకంటే వీటిలో ఉన్న ఆమ్లాలు దంతాల ఎనామెల్‌ను నెమ్మదిగా నాశనం చేస్తాయి, దీనివల్ల దంతాల ఉపరితలం బలహీనపడి పసుపు రంగులో కనిపిస్తాయి. పళ్లు త్వరగా విరిగిపోవడం లాంటి సమస్యలు కూడా రావచ్చు.

3. ధూమపానం

మీరు గమనించారో లేదో ధూమపానం చేసేవారి దంతాలు, పెదవులు పసుపు రంగులో కనిపిస్తాయి. ఎందుకంటే పొగాకు ఉత్పత్తులలో ఉండే నికోటిన్, టార్ నెమ్మదిగా దంతాలు, పెదవుల రంగును మారుస్తాయి, దీనివల్ల కాలక్రమేణా అవి పసుపు లేదా గోధుమ రంగులోకి మారుతాయి. ఈ పదార్థాలు లాలాజల ఉత్పత్తిని కూడా తగ్గిస్తాయి. దీనివల్ల దంతాలు, చిగుళ్ళపై ప్లాక్, బ్యాక్టీరియా వంటివి సులభంగా చేరి నోరు, దంతాల ఆరోగ్యాన్ని అందాన్ని దెబ్బతీస్తాయి.

4. పళ్లు కొరకడం

కోపం వస్తే చాలా మంది పళ్లు కొరుకుతుంటారు. మీకు ఆ అలవాటు ఉంటే వెంటనే మానేయండి. ఎందుకంటే ఇది మీ దంతాలను పసుపు రంగులోకి మారడానికి కారణంగా నిలుస్తుంది. దంతాలను గట్టిగా రుద్దడం వల్ల వాటి ఎనామెల్ దెబ్బతింటుంది. పళ్ల మధ్య రాపిడి జరగడం వల్ల టూత్ ఎనామెల్ సన్నబడిపోతుంది. దీని వల్ల దంతాలు సులభంగా ఫ్లాక్, బ్యాక్టీరియా బారిన పడతాయి. ఫలితంగా పళ్లు పచ్చబడటం మాత్రమే కాకుండా పూర్తి దంత ఆరోగ్యం దెబ్బతింటుంది.

5. చాయ్, కాఫీ అధికంగా తీసుకోవడం

చాయ్, కాఫీ వంటి వాటిని అధికంగా తీసుకోవడం వల్ల కూడా దంతాలపై మలినాలు చేరి పసుపు రంగు వస్తుంది. ఈ వస్తువులలో టానిన్ అనే పదార్థం ఉంటుంది. ఇది దంతాల బాహ్య పొర (ఎనామెల్) పై చేరి మచ్చలను ఏర్పరుస్తుంది. దీర్ఠకాలికంగా మీ నవ్వును చెదరొగట్టి మీ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుంది.

దంతాల పసుపు రంగును తొలగించే ఇంటి చిట్కాలు..

-నారింజ నూనె లేదా కొబ్బరి నూనెతో రోజూ ఆయిల్ పుల్లింగ్ చేయడం వల్ల దంతాల పసుపు రంగు తొలగిపోతుంది, తెల్లగా మారుతాయి.

-ఉప్పు, నిమ్మరసం కలిపి వారానికి 2 సార్లు దంతాలను తోమడం వల్ల కూడా దంతాలు తెల్లగా మారుతాయి.

-బేకింగ్ సోడాతో దంతాలను శుభ్రం చేయడం వల్ల కూడా పసుపు రంగు నుండి ఉపశమనం లభిస్తుంది.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల అభిప్రాలయను క్రోడీకరించి మాత్రమే ఈ సూచనలు అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

Ramya Sri Marka

eMail
రమ్య శ్రీ మార్క హిందుస్థాన్ టైమ్స్‌లో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్. జర్నలిజంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉన్న ఆమె లైఫ్ స్టైల్, ఆస్ట్రాలజీ వార్తలు రాయడంలో ప్రత్యేకత కలిగి ఉంది. కాకాతీయ యూనివర్సిటీలో జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ పట్టా పొందారు. గతంలో ఈనాడు, టీన్యూస్, ఈటీవీ భారత్ వంటి సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు.లింక్డ్‌ఇన్‌లో ఆమెతో కనెక్ట్ అవ్వండి.

సంబంధిత కథనం