Healthy Junk Food: జంక్ ఫుడ్‌లా కనిపించే ఈ 5 ఆహారాలు చాలా ఆరోగ్యకరమైనవట! వీటిని తరచూ తినాలట!-these 5 foods that look like junk food are actually very healthy eat these often ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Healthy Junk Food: జంక్ ఫుడ్‌లా కనిపించే ఈ 5 ఆహారాలు చాలా ఆరోగ్యకరమైనవట! వీటిని తరచూ తినాలట!

Healthy Junk Food: జంక్ ఫుడ్‌లా కనిపించే ఈ 5 ఆహారాలు చాలా ఆరోగ్యకరమైనవట! వీటిని తరచూ తినాలట!

Ramya Sri Marka HT Telugu

Healthy Junk Food: జంక్ ఫుడ్ అనుకుని చాలా మంది తినడం మానేస్తున్న కొన్ని ఆహారాలు నిజానికి హానికరమైనవి కాదట. వాటిని తరచూ తినడం వల్ల ఆరోగ్యానికి మేలు కలుగుతుందట. అందరూ జంక్ ఫుడ్ అనుకునే ఆరోగ్యానికి మేలు చేసే ఆ 5 రకాల ఆహార పదార్జాలేంటో తెలుసుకుందాం రండి.

ఆరోగ్యకరమైన జంక్ ఫుడ్ (Shutterstock)

జంక్ ఫుడ్ లేదా ఫాస్ట్ ఫుడ్ తినడానికి ఎంత రుచికరంగా ఉంటుందో, ఆరోగ్య పరంగా అంతే హానికరం. అందుకే ప్రజలు జంక్ ఫుడ్ తినకూడదు అని ఫీలవుతారు. తప్పకపోతే అంటే తినాలనే కోరికను ఆపుకోలేకపోతే తక్కువగా తినాలని ఫిక్స్ అవుతారు. మీకు కూడా ఇలా చాలాసార్లు జరిగుంటుంది. వాస్తవానికి జంక్ ఫుడ్ కంటికి కనిపించిందంటే ఆకలి వేస్తుంది, వాసన వచ్చిందంటే నోరు ఊరుతుంది. కానీ ఆరోగ్యం గురించి ఆలోచించి తినకుండా వస్తుంది.

కానీ ఈసారి నుంచి మీరు అలా చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కొన్ని ఆహార ఎంపికలు ఉన్నాయి. అవి రుచిలో, రూపంలో జంక్ ఫుడ్ లాగానే ఉంటాయి. చాలా సార్లు ప్రజలు వీటిని జంక్ ఫుడ్ అని అనుకుని తినడం మానేస్తున్నారు. కానీ ఇవి ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. జంక్ ఫుడ్‌లా కనిపించే ఆరోగ్యకరమైన ఆహారాలేంటో తెలుసుకోండి.

1. డార్క్ చాక్లెట్ ప్రయోజనకరం

చాక్లెట్ తినడం దాదాపు అందరికీ ఇష్టం. అయితే చాక్లెట్ ఎక్కువ తినడం ఆరోగ్యానికి మంచిది కాదని కూడా అంటుంటారు. ఎందుకంటే దీనిలో చక్కెర పరిమాణం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇలాంటప్పుడు మీరు సాధారణ చాక్లెట్ బదులు డార్క్ చాక్లెట్ తినచ్చు. దీని వల్ల నష్టానికి బదులుగా ప్రయెజనం కలుగుతుంది. డార్క్ చాక్లెట్‌లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి హృదయ, మెదడు ఆరోగ్యం, బరువు నిర్వహణ, రక్తపోటు నిర్వహణకు కూడా చాలా ప్రయోజనకరంగా ఉంటాయి.

2. ఐస్ క్రీం కూడా ఆరోగ్యకరం

చల్లని ఐస్ క్రీం తినడం అంటే ఎవరికి నచ్చదు చెప్పండి. అదీ వేసవిలో మండుతున్న ఎండల మధ్య ఐస్ క్రీం తినాలనే కోరికను ఆపుకోవడం చాలా చాలా కష్టం. అయితే ఐస్ క్రీం ఎక్కువగా తినడం ఆరోగ్యానికి మంచిది కాదు. ఎందుకంటే వాస్తవానికి మార్కెట్లో దొరికే చాలా ఐస్ క్రీములు కృత్రిమ చక్కెర, రుచులు, రంగులతో నిండి ఉంటాయి. వీటి కారణంగా చాలా మంది ఆరోగ్య ప్రేమికులు వీటిని తినడానికి ఇష్టపడరు. కానీ మీరు ఇంట్లో చక్కెర లేకుండా సహజ ఐస్ క్రీం తయారు చేసుకుని తింటే, ఇది ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. దీనిలో కాల్షియం, ప్రోటీన్లతో పాటు విటమిన్ బి, ప్రోబయోటిక్స్ కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి చాలా మంచివి.

3. స్వీట్ పొటాటో ఫ్రై మేలు చేసేదే

ఆరోగ్యకరమైన, రుచికరమైన స్నాక్ కోసం వెతుకుతున్నారా? అయితే స్వీట్ పొటాటో ఫ్రైస్ మీకు అద్భుతమైన ఎంపిక. చాలా మందికి స్వీట్ పొటాటో బరువు పెంచుతుందని, ఆరోగ్యక్యానికి అంత మంచివి కాదని అనుకుంటారు. దీంట్లో ఎంత మాత్రం నిజం లేదని తెలుసుకోండి. నిజానికి స్వీట్ పొటాటో(చిలకడదుంప), వైట్ పొటాటో(బంగాళదుంప) కంటే చాలా ఆరోగ్యకరమైనవి. వీటిలో విటమిన్ ఎ, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఆరోగ్యకరమై నూనె, తక్కువ మసాలాలతో స్వీట్ పొటాటో ఫ్రైస్ ఇంట్లోనే తయారు చేసుకుని తినండి. ఇవి పొటాటో చిప్స్ కంటే రుచికరమైన, ఆరోగ్యకరమైన ఎంపిక.

4. పాప్ కార్న్ కూడా ప్రయోజనకరమే

పిల్లలతో ఆరోగ్యకరమైన ఆహారం తినిపించడం కొంచెం కష్టమే. కానీ పాప్ కార్న్ చూస్తే మాత్రం తినకుండా ఊరుకోరు. మీ పిల్లలు కూడా ఇలానే చేస్తుంటే సంతోషించండి. మంచి విషయం ఏమిటంటే పాప్ కార్న్ రుచిగా ఉండటంతో పాటు చాలా ఆరోగ్యకరమైనవి కూడా. అయితే మార్కెట్లో దొరికే పాప్ కార్న్ లో వెన్న, నూనె పరిమాణం ఎక్కువగా ఉండవచ్చు, అలాగే ఇవి నాణ్యమైనవి కూడా కాకపోవచ్చు. కాబట్టి వీటిని ఎల్లప్పుడూ ఇంట్లో తయారు చేసుకుని తినడానికి ప్రయత్నించండి. తక్కువ సమయంలో తయారయ్యే ఫర్ఫెక్ట్ హెల్తీ స్నాక్ పాప్ కార్న్.

5. మల్టీగ్రెయిన్ బ్రెడ్ కూడా మంచిదే

మైదాతో చేసిన బ్రెడ్ జంక్ ఫుడ్ విభాగంలోకి వస్తుంది. కానీ మల్టీగ్రెయిన్ బ్రెడ్ విషయానికి వస్తే ఇది చాలా ఆరోగ్యకరమైన ఎంపిక. వాస్తవానికి మల్టీగ్రెయిన్ బ్రెడ్ తయారు చేయడానికి వివిధ ధాన్యాలను ఉపయోగిస్తారు. వీటిని తినడం వల్ల రుచితో పాటు శరీరానికి ఆరోగ్యకరమైన పోషకాలను పొందవచ్చు. మల్టీగ్రెయిన్ బ్రెడ్ ఉపయోగించి మీరు ఆరోగ్యకరమైన సాండ్విచ్ తయారు చేసుకోవచ్చు. ఇది పిల్లల నుండి పెద్దల వరకు అందరికీ నచ్చుతుంది, ఆరోగ్యానికి మేలు చేస్తుంది.

Ramya Sri Marka

eMail
రమ్య శ్రీ మార్క హిందుస్థాన్ టైమ్స్‌లో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్. జర్నలిజంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉన్న ఆమె లైఫ్ స్టైల్, ఆస్ట్రాలజీ వార్తలు రాయడంలో ప్రత్యేకత కలిగి ఉంది. కాకాతీయ యూనివర్సిటీలో జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ పట్టా పొందారు. గతంలో ఈనాడు, టీన్యూస్, ఈటీవీ భారత్ వంటి సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు.లింక్డ్‌ఇన్‌లో ఆమెతో కనెక్ట్ అవ్వండి.

సంబంధిత కథనం