Friday Motivation: లోపాలు లేని మనిషి, లోటు లేని జీవితం ఎవరికీ ఉండదని చదవగానే అందరికీ గుర్తొచ్చేది అంబానీలే. వారికి ఏం తక్కువ? అని మీరు అనుకోవచ్చు. నిజమే వారికి సంపదకు ఎలాంటి లోటు లేదు... కానీ అనంత్ అంబానీ ఆరోగ్యం విషయంలో మాత్రం వారెప్పుడు ఆందోళన పడుతూనే ఉంటారు. కోట్ల రూపాయలు ఉన్నా చక్కని ఆరోగ్యాన్ని కొనుక్కోవడం కష్టమే. ఏసీ రూములో కూడా గంటపాటు నిద్రపోలేని పరిస్థితి అనంత్‌ది. వాతావరణం చల్లబడిందంటే అతని ఆరోగ్యం క్షీణించడం మొదలవుతుంది. విపరీతమైన ఆస్తమా సమస్యతో బాధపడుతున్న అనంత్ అంబానీ స్టెరాయిడ్స్ వాడడం వల్లే అంతగా లావెక్కిపోయారు. ఇప్పుడు చెప్పండి... అంబానీలకు ఎలాంటి లోటు లేదా? వారికి దేవుడు ఎలాంటి లోపం పెట్టలేదా? ప్రతి మనిషికి అంతో ఇంతో కష్టాన్ని ఇస్తూనే ఉంటాడు. దేవుడు వాటిని అధిగమించి ధైర్యవంతులుగా మారమని చెప్పడమే అతని ఉద్దేశం. కష్టం ఇచ్చాడని దేవుడిని తిట్టుకునే కన్నా... ఆ కష్టాన్ని ఎలా దాటాలో ఆలోచిస్తే మీరు సమర్థవంతులుగా, శక్తివంతులుగా మారుతారు.
ప్రతి మనిషికి ఏదో ఒక లోటు ఉండే ఉంటుంది. సాధ్యమైతే ఆ లోటును లేదా లోపాన్ని పూడ్చుకోవాలి. లేకపోతే ఆ లోటుతోనే బతకడం అలవాటు చేసుకోవాలి. అంతేగాని ప్రతిసారీ దాన్ని తలుచుకొని మనసుకు గాయం చేసుకోవడం మంచిది కాదు. కష్టాలు రాగానే కాలాన్ని తిట్టుకుంటూ కూర్చుంటే ఏమీ లాభం లేదు. ఆ ఉన్న కాలం కూడా కరిగిపోతుంది. నాకే ఎందుకు ఇలా అవుతుందని బాధపడే కన్నా... ఆ కష్టాన్ని దాటేందుకు ప్రయత్నించి చూడండి. కాలం మంచి ఆటగాడికే సవాలు విసురుతుంది. చేతగాని చవటలను పక్కన పెట్టేస్తుంది. కాలం విసిరిన సవాలును మీరు ఎదుర్కొని గెలుపు పొందండి. ఆ గెలుపు ఎంతో గొప్పగా ఉంటుంది. భవిష్యత్తుపై మీలో ఆశలను పెంచుతుంది.
నిజం చెప్పాలంటే జీవితంలో గెలిచిన సందర్భాల కన్నా, ఓడిపోయిన సందర్భాల నుంచి మనం ఎక్కువ నేర్చుకుంటాం. జీవితం ఎప్పుడూ పరిపూర్ణంగా ఉండదు. ఏదో ఒక లోపం ఉంటూనే ఉంటుంది. ఆకలితో ఉన్న పొట్ట, ఖాళీగా ఉన్న జేబు, ముక్కలైన మనసు... ఈ మూడూ జీవితంలో మనకు ఎన్నో గుణపాఠాలను నేర్పుతాయి. అందుకే జీవితంలో ఎదురైన ప్రతి కష్టం నుంచి ఏదో ఒక పాఠాన్ని నేర్చుకోండి.
జీవితమంటే పుట్టుక నుంచి మరణం వరకు జరిగే ఒక ప్రయాణం. ఆ ప్రయాణం నేషనల్ హైవేలా ఎలాంటి అవాంతరాలు లేకుండా ఉండాలంటే కుదరదు. గ్రామాలకు వెళ్లే డొంక దారుల్లా కూడా ఉంటుంది. ఒకప్పుడు నేషనల్ హైవేలు కూడా డొంక దారులే. కష్టపడి ఆ దారుల్లో రాళ్లు రప్పలు పోసి... తారును వేసి హైవేలుగా మార్చారు. మీరు కూడా రాళ్లు రప్పలమయంగా ఉన్న జీవితాన్ని పూలతో నింపుకోవాలి. నేను ఎందుకు అంబానీల కుటుంబంలో జన్మించలేదని బాధపడే కన్నా, మీరే అంబానీ అయ్యేందుకు, ఓ చరిత్రను సృష్టించేందుకు ప్రయత్నించండి. ఒక మూల కూర్చొని కుంగిపోవడం మానేయండి.