Friday Motivation: ఓ మనిషీ... చీమను చూసి నేర్చుకో పద్ధతిగా, క్రమశిక్షణగా ఎలా బతకాలో
Friday Motivation: చిట్టి చీమను చూసి ఆరడుగుల మనిషి నేర్చుకోవాల్సిన గుణపాఠాలు ఎన్నో ఉన్నాయి. చీమను చూసి నేర్చుకోమని ఎంతోమంది పెద్దలు చెబుతూ ఉంటారు.
Friday Motivation: ప్రపంచంలో బతుకుతున్న జీవుల్లో చీమలను మనిషి చాలా చులకనగా చూస్తాడు. కనిపిస్తే నలిపి పారేస్తాడు. నిజానికి చీమకు ఉన్న గొప్ప గుణాలు ఏవీ మనిషికి లేవు. మన పెద్దవారు కూడా చీమలను చూసి నేర్చుకోమని చెబుతూ ఉంటారు. చీమ దగ్గర్నుంచి ప్రతి ఒక్కరూ నేర్చుకోవాల్సింది... క్రమశిక్షణ, ముందు చూపు. చీమ ఈరోజు కోసం, ఈ క్షణం కోసం బతకదు. తమ భవిష్యత్తు తరాలను కాపాడుకోవడం కోసం, రేపటి గురించి శ్రమిస్తుంది. అలా శ్రమించే ప్రయాణంలో అడ్డదారులు తొక్కదు. ఒకే పద్ధతిలో అన్ని చీమలు నడుస్తూ వెళతాయి. మళ్లీ అదే వరుసలో వెనక్కి వస్తాయి. ఇంత ఐకమత్యం చీమలకు ఎలా వచ్చిందో.. ఇప్పటికీ అంతుపట్టని ప్రశ్న.
చీమల కాలనీలో ఆ రోజుకి సరిపడా ఆహారం మాత్రమే కాదు... వచ్చే నెల రోజులకు సరిపడా ఆహారాన్ని అవి దాచుకుంటాయి. అందుకే అవి నిత్యం పనిచేస్తూనే ఉంటాయి. భవిష్యత్ తరాలు ఇబ్బంది పడకూడదని ఆహారాన్ని వెతికే పనిలో ఎప్పుడూ నిమగ్నమై ఉంటాయి. ఖాళీగా కూర్చున్న చీమను చూడడం చాలా కష్టం. ఆ ప్రయత్నంలో చీమలు ఒకదానికొకటి కమ్యూనికేట్ చేసుకుంటూ సహకరించుకుంటూ ఉంటాయి.
ప్రతి ఒక్క మనిషి చీమల్లాగే ఐకమత్యం, టీమ వర్క్ నేర్చుకుంటే వారు అనుకున్న పనులు వెంటనే సాధ్యమవుతాయి. చీమ ఎప్పుడూ ఒంటరిగా కనిపించదు. గుంపులోనే ఉంటుంది. ఆ గుంపు కూడా ఎలా పడితే అలా ఉండదు. ఒక క్రమ పద్ధతిలో సాగుతుంది. ఏ చీమ కూడా తనకోసం ఆహారాన్ని దాచుకోదు. తమ కాలనీలో నివసించే అన్ని చీమల కోసం దాస్తుంది. కానీ మనిషి స్వార్థం ఎక్కువ. కేవలం తన కోసం, తన ఇంట్లోనే దాచుకుంటాడు అందుకే మనిషికన్నా చీమే నయం.
క్రమశిక్షణ విషయంలో చీమ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ట్రాఫిక్ లో ఐదు నిమిషాలు నిల్చోడానికే అష్ట కష్టాలు పడుతూ ఉంటారు. సిగ్నల్ జంపింగ్ లు చేస్తారు. కానీ ఏ చీమ కూడా తన ముందు ఉన్న చీమను ఓవర్ టేక్ చేసి ప్రయాణం చేయదు. అలా క్రమ పద్ధతిలోనే వెళతాయి. ఆలస్యమైనా ఆగితే అన్ని చీమలు ఆగిపోతాయి. వెళితే అన్ని పరుగులు తీస్తాయి. చీమల నుంచి ఆ గుణాన్ని నేర్చుకుంటే మన రోడ్లపై యాక్సిడెంట్ లే జరగవు.
సామాజిక జీవితం విషయంలో కూడా చీమలు చాలా గొప్పవి. అవి ఒంటరిగా జీవించడానికి ఇష్టపడవు. వందలాది చీమలు కలిసి గుంపుగా జీవిస్తాయి. అవన్నీ కలిపి ఇల్లు కట్టుకుంటాయి. అన్నీ కలిపే ఆహారాన్ని దాచుకుంటాయి. ఒక చీమకు ఒకరు సహకరించుకుంటాయి. అపాయం ఉందనిపిస్తే ఒకదానితో ఒకటి కమ్యూనికేట్ చేసుకుంటాయి. చీమలు కొట్లాడుకోవడం అనేది జరగదు. ఒకదానితో ఒక చీమ పోట్లాడుకోవడం వంటివి వాటి జీవితంలో ఉండవు. అందుకే చీమ నుంచి మనిషి కూడా ఈ లక్షణాన్ని నేర్చుకోవాలి. ఎదుటి మనుషులతో గొడవలు పడడం వారిని ఏదో చేయాలన్న కసి పెంచుకోవడం మానేయాలి. చీమలా జీవిస్తే మనిషి బతుకు ప్రశాంతంగా సాగిపోతుంది.