Kajal: రోజంతా కళ్ళకు కాటుక ఉంచడం వల్ల వచ్చే సమస్యలు ఎన్నో, మేకప్‌లాగే కాటుకను తొలగించాల్సిందే-there are a lot of problems that come with kajal all day long and the makeup needs to be removed ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Kajal: రోజంతా కళ్ళకు కాటుక ఉంచడం వల్ల వచ్చే సమస్యలు ఎన్నో, మేకప్‌లాగే కాటుకను తొలగించాల్సిందే

Kajal: రోజంతా కళ్ళకు కాటుక ఉంచడం వల్ల వచ్చే సమస్యలు ఎన్నో, మేకప్‌లాగే కాటుకను తొలగించాల్సిందే

Haritha Chappa HT Telugu
Apr 09, 2024 02:30 PM IST

Kajal: కళ్లకు కాటుక పెడితేనే అందం. కొంతమంది దీన్ని కాజల్ అని, మరికొందరు కోల్ అని పిలుస్తారు. మేకప్ రిమూవ్ చేసేటప్పుడు కాటుకను కూడా కచ్చితంగా తొలగించుకోవాల్సిందే.

కాటుకతో సమస్యలు
కాటుకతో సమస్యలు (Pixabay)

Kajal: చెంపకు చేరడేసి కళ్ళు.. ఆ కళ్ళకు కాటుక పెడితే ఆ అందమే వేరు. అమ్మాయిల అందాన్ని పెంచేది కళ్ళే. ఆ కళ్ళకు కాటుక, ఐలైనర్ వంటి కాస్మోటిక్స్‌ను వాడేవారు ఎంతోమంది. అయితే రోజంతా కాటుకతోనే కళ్ళను ఉంచడం మంచిది కాదు. దీర్ఘకాలంలో కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంది. బయట నుంచి ఇంటికి వచ్చాక కాటుకను తొలగించుకోవడం చాలా ముఖ్యం. ఎంతోమంది మేకప్ రిమూవ్ చేసేటప్పుడు కేవలం చెంపలకు, నుదుటి దగ్గర ఉన్న మేకప్ ను మాత్రమే తొలగించుకుంటారు. కాటుక జోలికి పోరు. కాటుకను రోజంతా ఉంచుకోవడం వల్ల దీర్ఘకాలంలో వచ్చే కొన్ని సమస్యలు ఉన్నాయి. అవేంటో తెలుసుకోండి.

కాటుకతో సమస్యలు

కాటుకను ఎక్కువ సేపు ధరించడం వల్ల కళ్ళు చికాకుగా అవుతాయి. కొన్నిసార్లు ఎరుపెక్కుతాయి. అసౌకర్యంగా అనిపిస్తాయి. కాటుకలో వాడిన కొన్ని రకాల పదార్థాల వల్ల ఇలా జరుగుతుంది. ఆ పదార్థాలు కళ్ళలోకి ప్రవేశించడం వల్ల కళ్ళు ఎరుపెక్కడం, అసౌకర్యంగా ఉండడం, మంట పెట్టడం వంటివి జరుగుతాయి.

కొంతమందికి కాటుకలో వాడే పదార్థాలు సరిపడవు. ఇవి అలెర్జీకి కారణం అవుతాయి. ఇలాంటి వారికి వెంటనే అలెర్జీ కనిపించదు. దీర్ఘకాలంలో దురద పెట్టడం, కళ్ళ చుట్టూ వాపు రావడం, దద్దుర్లు రావడం వంటివి జరుగుతాయి. అలాంటి వారికి కాటుక పడడం లేదని అర్థం చేసుకోవాలి.

పొడి కళ్లు

కాటుకను రోజంతా ఉంచడం వల్ల కొన్నిసార్లు కళ్ళు పొడిబారుతాయి. కాటుకలో వాడిన కొన్ని పదార్థాలే దీనికి కారణం. కనురెప్పలపై లేదా కంటి కింద ప్యాచెస్ లా కూడా ఏర్పడతాయి. కాబట్టి రోజులో కాసేపు మాత్రమే కాటుకను కంటికి ఉంచుకోండి.

కాటుక పెన్సిల్ లేదా ఐలైనర్ పెట్టే బ్రెష్ వంటివి శుభ్రంగా ఉంచుకోవాలి. వాటి మీద దుమ్మూ ధూళీ పడితే కలుషితం అవుతాయి. దీనివల్ల బ్యాక్టీరియా, ఫంగల్ ఇన్ఫెక్షన్లు కంటిలో చేరే ప్రమాదం ఉంది. దీనివల్ల కండ్ల కలక వంటివి రావచ్చు. కనుక ఎప్పటికప్పుడు వాటిని శానిటైజ్ చేసుకోవడం చాలా ముఖ్యం.

కాటుకను రోజంతా ఉంచుకోవడం వల్ల అది కంటి కింద చర్మం వరకు పాకుతుంది. దీన్నే స్మడ్జింగ్ అని అంటారు. వేడి వాతావరణం లేదా తేమ కూడిన వాతావరణంలో ఇలా ఎక్కువగా కాటుక కరిగి కంటి కింద ఉన్న చర్మానికి కూడా పాకుతుంది. ఇది అందాన్ని పెంచడం కాదు, తగ్గిస్తుంది. కాబట్టి వీలైనంత సమయం మాత్రమే కాటుకను ఉంచుకుని తర్వాత తొలగించుకోవడమే మంచిది

కొన్ని సందర్భాల్లో కాటుకలోని రసాయనాలు కళ్ళల్లో చేరి... కంటిచూపును కూడా ప్రభావితం చేస్తాయి. కళ్ళు మసకబారడం, దృష్టి తాత్కాలికంగా తగ్గడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే కాటుక వాడడం మానేయాలి. వైద్యుల వద్దకు వెళ్లాలి.

కాటుకను ఇప్పుడు ఎక్కువమంది పెన్సిల్‌తో పెట్టుకుంటున్నారు. ఒక్కొక్కసారి పెన్సిల్ సరిగా పట్టుకోకపోతే కంటి లోపల కార్నియా పై గీతలు పడే అవకాశం ఉంటుంది. అలాగే కొందరు చూపుడు వేలుతో కాటుకను పెట్టుకుంటారు. ఆ వేలికి గోర్లు లేకుండా చూసుకోవడం చాలా ముఖ్యం. కార్నియా చాలా సున్నితమైనది. ఏమాత్రం దెబ్బతిన్నా కంటిచూపు తగ్గుతుంది.

రోజంతా కాటుకను ఉంచుకోవడం వల్ల దీర్ఘకాలంలో కొంతమంది వ్యక్తుల్లో కన్నీటి ఉత్పత్తి పెరుగుతుంది. కళ్ళల్లోంచి నీరు కారడం వంటివి జరుగుతాయి. ఈ పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి కాటుకను రోజులో కొంతసేపు మాత్రమే ఉంచి మిగతా సమయంలో తొలగించడమే మంచిది.

WhatsApp channel

టాపిక్