RadhaKrishna Love Story: ప్రపంచంలోనే మొదటి లవ్ ఫెయిల్యూర్ స్టోరీ రాధాకృష్ణులదే, రాధా ఎందుకు మరణించింది-the worlds first love failure story is that of radhakrishna why did they break up why did radha die ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Radhakrishna Love Story: ప్రపంచంలోనే మొదటి లవ్ ఫెయిల్యూర్ స్టోరీ రాధాకృష్ణులదే, రాధా ఎందుకు మరణించింది

RadhaKrishna Love Story: ప్రపంచంలోనే మొదటి లవ్ ఫెయిల్యూర్ స్టోరీ రాధాకృష్ణులదే, రాధా ఎందుకు మరణించింది

Haritha Chappa HT Telugu
Aug 26, 2024 10:44 AM IST

Radha Krishna Love Story: ప్రేమికుల అనగానే మొదట గుర్తుకు వచ్చేది రాధాకృష్ణులే. వీరి ప్రేమ స్వచ్ఛమైనది. నిస్వార్ధమైనది. అజరామరమైనది. అలాగే విఫలమైనది కూడా. వీరి లవ్ స్టోరీ పెళ్లి వరకు ఎందుకు చేరుకోలేదు? రాధా ఎలా చనిపోయింది?

రాధాకృష్ణుల ప్రేమకథ
రాధాకృష్ణుల ప్రేమకథ (Disney+Hotstar)

Radha Krishna Love Story: ప్రాచీన హిందూ శాస్త్రాల్లో ప్రేమ అనగానే గుర్తుకు వచ్చే జంట రాధాకృష్ణులే. వారి ప్రేమ నిస్వార్థమైనది. ఎంతో మధురమైనది. వారిలో ఒకరి పట్ల ఒకరికి ఉన్నది ప్రేమకన్నా, ఆరాధన అని చెప్పుకోవచ్చు. వారి ప్రేమ కథ ఎంత విన్నా మధురంగా, ప్రశాంతంగా ఉంటుంది. కానీ చాలామందికి ఒక సందేహం ఉంది. కృష్ణుడు ఎందుకు రాధను పెళ్లి చేసుకోలేదు? వాళ్ళిద్దరూ ఎందుకు వేరువేరు పెళ్లిళ్లు చేసుకున్నారు? అని. శ్రీకృష్ణుడు ఎనిమిది మంది అమ్మాయిలను పెళ్లి చేసుకున్నాడు. కానీ రాధని మాత్రం చేసుకోలేదు. అసలు వీరి ప్రేమ కథ ఎందుకు విషాదాంతం అయిందో తెలుసుకోండి.

రాధ ఎవరు?

రాధ రేపల్లె అనే గ్రామంలో వృషభాను, కీర్తి దేవి అనే దంపతులకు జన్మించింది. ఆమెని లక్ష్మీదేవి అవతారం అని కూడా చెప్పుకుంటారు. కానీ దీనికి స్పష్టమైన సాక్ష్యం మాత్రం లేదు. బృందావనంలో రాధగా, మధురలో రుక్మిణిగా అవతరించింది లక్ష్మీదేవి అని, ఆ ఇద్దరూ ఒకటేనని ఎంతోమంది నమ్మకం.

కృష్ణుడు రాధని తొలిసారి తన ఎనిమిదో సంవత్సరంలో చూశాడని చెప్పుకుంటారు. అప్పటినుంచి వారిద్దరి ఆరాధనా మొదలైందని అంటారు. వారిది దైవైక ప్రేమగా చెప్పుకుంటారు. నల్లటి కృష్ణునికి పాల నురుగు లాంటి ఛాయతో మెరిసిపోయే రాధను చూస్తే ఎంతో ముచ్చట వేసేది. కృష్ణుడు వేణువు వాయిస్తే చాలు రాధా పరవశించిపోయేది. ఆ వేణువే రాధను కృష్ణునికి దగ్గర చేసిందని అంటారు. కృష్ణుడు రాధా అందానికి మైమరిచిపోతే, రాధా కృష్ణుడి వేణు గానానికి పరవశించిపోయింది. వారిద్దరి ఆత్మలు ఒక్కటి చేసింది నా వేణు నాదమే.

గోపికలతో పాటు రాధా, స్నేహితులతో పాటు కృష్ణుడు అడవిలో అల్లరి చేస్తూ తిరిగేవారు. అయితే కంసుడి గురించి కృష్ణుడికి తెలిశాక అతడిని చంపాలనే ఉద్దేశంతో శ్రీకృష్ణుడు మధురకు బయలుదేరాడు. అప్పుడే రాధాకృష్ణుల జంట విడిపోయిందని చెప్పకుంటారు. కానీ రాధ మనసు ఎప్పుడూ కృష్ణుడు గురించే ఆలోచించేది. కృష్ణుడు కూడా రాధను తలుచుకొని క్షణం లేదని చెప్పుకుంటారు.

రాధ ఎవరిని పెళ్లి చేసుకుంది?

కృష్ణుడు వెళ్లిపోయాక రాధా తన కుటుంబం కోసం అయాన్ అనే వ్యక్తిని వివాహం చేసుకుందని చెప్పకుంటారు. అయినా కూడా ఆమె తన వైవాహిక బాధ్యతలను నిర్వర్తించకుండా కృష్ణుడిని ఆరాధిస్తూ ఉండేదని అంటారు. రాధ పెళ్లి వార్త తెలుసుకొని కృష్ణుడు ఎంతో వేదనకు గురయ్యాడు. రాధ వైవాహిక జీవితం బావుండాలని, ఆమె సంతోషంగా ఉండాలని ఎంతో కోరుకుంటాడు కృష్ణుడు.

రాధా మరణం

మనసులో కృష్ణుడిని నింపుకున్న రాధా వైవాహిక జీవితాన్ని అనుభవించలేక పోతుంది. ఆమె సన్యాసిని కావాలని అనుకుంటుంది. అప్పటికే ఆమె ఆరోగ్యం క్షీణిస్తూ ఉంటుంది. ఆ విషయం తెలుసుకున్న కృష్ణుడు రాధను కలిసేందుకు వస్తాడు. ఆమె చివరి క్షణాలు కృష్ణుని ఒడిలోనే గడిచాయి. కృష్ణుని ఒడిలో తలపెట్టుకున్న రాధా తనకోసం వేణునాదాన్ని వినిపించమని కోరుతుంది. ఆ వేణు నాదం వింటూ రాధ చివరి శ్వాస తీసుకుంటుంది. రాధ మరణించిందని గ్రహించిన కృష్ణుడు ఇక తనకు వేణుకు అవసరం ఉండదని, దాన్ని విరగొట్టి విసిరేస్తాడు. రాధ మరణం అతన్ని హృదయాన్ని ఎంతగా వేధించిందో వీణ విరగ్గొట్టడం ద్వారానే అర్థమవుతుంది.

రాధా కుటుంబ బంధాలు ఆమెను కృష్ణుని చేరకుండా అడ్డుకుంటే, కృష్ణుడి కర్తవ్యాలు రాధను పెళ్లి చేసుకోకుండా ఆపాయి. అలా వీరిద్దరూ తమ ప్రేమను త్యాగం చేశారు. అందుకే ప్రపంచంలో తొలి బ్రేకప్ లవ్ స్టోరీ రాధాకృష్ణులుదేనని చెప్పుకోవాలి. కానీ వీరి ప్రేమలో ఎంతో స్వచ్ఛత వుంది. ఎంతో ఆరాధన ఉంది. ఎదుటివారు తమను కాదని వెళ్ళిపోయినా కూడా వారు బాగుండాలని కోరుకునే మంచి మనసు ఇద్దరికీ ఉంది. ఈ లక్షణాలను నేటి ప్రేమికులు కూడా అలవరచుకోవాలి. తమను కాదన్న ప్రేమికుడిని లేదా ప్రేమికురాలిని క్షమించే గుణం, వారు బాగుండాలని కోరుకునే లక్షణం మీలో ఉండాలి.

టాపిక్