Molangur Doodh Well: ఈ బావిలో నీళ్లు తెల్లగా ఉంటాయి, అందుకే దూద్ బావిగా మారింది, దీని వెనుక ఎన్ని కథలో
Molangur Doodh Well: తెలంగాణలో ఉన్నవారికి ఈ దూద్ బావి గురించి తెలుసు, కానీ మిగతా ప్రాంతాల్లో ఉన్న వారికి ఈ బావి గురించి తెలిసింది చాలా తక్కువ. తెల్లని పాలలా ఉండే ఈ బావిలో నీళ్ళకు ఎంతో శక్తి ఉందని చెప్పుకుంటారు.
Molangur Doodh Well: ప్రపంచంలో ఎన్నో అంతుచిక్కని రహస్యాలు దాగి ఉన్నాయి. చుట్టూ ఉండే పచ్చని ప్రకృతి కూడా నిగూఢమైనది. దానిలో ఎన్నో రహస్యాలను దాచుకుంటుంది. అలాంటి రహస్యాలలో తెలంగాణలో ఉన్న ఒక బావి కూడా ఉంది. దీన్ని దూద్ బావి అంటారు. ఈ బావిలో నీళ్లు తెల్లగా ఉంటాయి. ఇలా ఎందుకు ఉంటాయో మాత్రం ఇంతవరకు ఎవరూ కనిపెట్టలేకపోయారు.
దూద్ బావి ఎక్కడుంది?
ఈ దూద్ బావిని చూస్తే ఎవరో ప్రత్యేకంగా తవ్వి దాన్ని అందంగా కట్టినట్టు ఉంటుంది. దీనిని నిర్మాణ నిర్మాణ శైలిని చూస్తుంటే అలనాటి రాజులు తవ్వించి ఉంటారని అర్థం అయిపోతుంది. ఈ దూద్ బావి తెలంగాణలోని కరీంనగర్ జిల్లా మొలంగూర్‌లో ఉంది. ఈ బావిని కాకతీయ రాజైన ప్రతాపరుద్రుడి కాలంలో కట్టించారని చెప్పుకుంటారు.
ప్రతాపరుద్రుడి కోటకు ప్రవేశద్వారం దగ్గర ఈ బావిని ఏర్పాటు చేశారు. అయితే ఎవరికీ అర్థం కాని విషయం ఏమంటే... చుట్టుపక్కల సెలయేళ్లు, జలపాతాలు ఏమీ లేవు. కానీ ఈ దూద్ బావిలోని నీరు మాత్రం తెల్లగా పాల మాదిరిగా కనిపిస్తుంది. అందుకే ఈ బావికి దూద్ బావి అని పేరు వచ్చింది. దూద్ అంటే పాలు. ఆ బావిలోని నీళ్ళకు ఆ రంగు రావడానికి కారణం ఏంటో కనిపెట్టేందుకు ఎంతో మంది ప్రయత్నించారు. కానీ ఇంతవరకు చెప్పలేకపోయారు.
చుట్టుపక్కల ఉన్న స్థానిక ప్రజలు దూద్ బావిలో నీరు తెల్లగా ఉండేందుకు కారణమేమిటో పూర్వీకులు కూడా చెప్పలేదని అంటారు. చరిత్రకారులు దీనిపై ప్రయోగాలు చేశారు. కానీ దీనిలో నీళ్లు ఎలా ఊరుతున్నాయో మాత్రం తెలియడం లేదు.
ఈ దూద్ బావిని చూసేందుకు ఎంతోమంది పర్యాటకులు కూడా వస్తూ ఉంటారు. ఆ నీరు తెల్లగా ఉంటుంది. కాబట్టి అవి స్వచ్ఛమైనవి కాదని అనుకుంటూ ఉంటారు. నిజానికి అవి చాలా స్వచ్ఛమైన నీరు. వాటిని తాగేందుకు మాత్రం బయటి ప్రజలు భయపడుతూ ఉంటారు. కానీ స్థానిక ప్రజలు చెప్పిన ప్రకారం ఈ బావిలోని నీటిని తాగితే రోగాలు రాకుండా ఉంటాయని, ఎలాంటి రుగ్మతలైనా పోతాయని చెబుతారు. అది ఎంతవరకు నిజమో మాత్రం నిరూపణ కాలేదు.
మొలంగూరులోని కోటకు ఎదురుగానే దూద్ బావిని నిర్మించారు. ఈ పరిసరాలను, పర్యాటకంగా అందంగా మార్చేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.
ఈ నీటిని తాగవచ్చు
దూద్ బావి నీటిని తాగితే ఏమవుతుందోనని ఎంతోమంది భయపడుతూ ఉంటారు. నిజానికి ఈ దూద్ బావి నీటిని చక్కగా తాగవచ్చు. ఈ నీటి స్వచ్ఛతను తెలుసుకునేందుకు అధికారులు ఎన్నో పరీక్షలు జరిపారు. ప్రకృతి సిద్ధంగా ఊరే ఈ నీరు ఎంతో స్వచ్ఛమైనవని ఆ పరీక్షల్లో తేలాయి. భూగర్భ జల శాఖ అధికారులు ఈ నీరు ఎంతో స్వచ్ఛమైనదని, తాగవచ్చని చెప్పారు.
స్థానికంగా ఉన్న కొంతమంది పెద్దవారు ఈ నీరు తాగేందుకు ఇష్టం చూపిస్తూ ఉంటారు. అయితే నేటి యువత మాత్రం దూద్ బావిలోని నీటి రంగును చూసి తాగేందుకు భయపడుతున్నారు. ఇప్పటికీ బావిలో నీరు ఊరి కొంతవరకూ చేరుకోగానే వాటిని తోడుకునేందుకు ప్రజలు రాత్రీ, పగలు వేచి ఉంటారు. ఎప్పుడైనా మొలంగూరు చుట్టుపక్కల ప్రాంతానికి మీరు వెళ్లాల్సి వస్తే ఖచ్చితంగా ఈ దూద్ బావిని చూసి రండి. కాకతీయుల నాటి ఈ బావి మీకు చరిత్రను గుర్తుచేస్తుంది.
టాపిక్