Stealing Disorder : దొంగతనం చేయించే రోగం.. కనీసం చీపురుపుల్లను అయినా లేపేస్తేనే తృప్తి!-the stealing disorder kleptomania symptoms know how to control it ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Stealing Disorder : దొంగతనం చేయించే రోగం.. కనీసం చీపురుపుల్లను అయినా లేపేస్తేనే తృప్తి!

Stealing Disorder : దొంగతనం చేయించే రోగం.. కనీసం చీపురుపుల్లను అయినా లేపేస్తేనే తృప్తి!

Anand Sai HT Telugu
Jun 01, 2024 09:30 AM IST

Kleptomania In Telugu : దొంగతనం చేయడం అంటే చాలా డేర్ కావాలి. అయితే కొందరికి మాత్రం దొంగతనం చేయడమే రోగంగా ఉంటుంది. కనీసం వేరే వాళ్ల ఇంటి దగ్గర చీపురు పుల్లను అయినా లేపేయాలి అనిపిస్తుంది.

క్లెప్టోమేనియా లక్షణాలు
క్లెప్టోమేనియా లక్షణాలు

చిన్నప్పుడు స్కూలులో పెన్సిల్స్, పెన్నులు.. దొంగిలించినవారు చాలామంది. ఇదేదో చిన్న వయసులో జరిగిపోతుంది. తర్వాత దొరికితే ఇంట్లో బడితేపూజ ఫిక్స్. స్కూల్ల్ టీచర్‌తోనూ దెబ్బలు తప్పవు. ఇదంతా తెలిసి తెలియని వయసులో జరిగిపోతుంది. కానీ కొందరికి పెద్ద అయినా కూడా దొంగతనం చేయాలనే కొరిక మాత్రం అలాగే ఉంటుంది. ఏదో ఒకటి చోరీ చేస్తేనే తృప్తి కలుగుతుంది. అది ఓ రోగం కారణంగానే జరుగుతుంది.

దొంగతనం ఒక కళ అని తెలుగులో ఒక సామెత ఉంది. కానీ దొంగతనం ఒక రోగం కూడా. దొంగిలించాలనే అదుపులేని కోరిక మానసిక ఆరోగ్య సమస్య. దీనిని క్లెప్టోమేనియా అంటారు. అవసరం లేకపోయినా దాన్ని సంపాదించాలనే తపన అని చెప్పవచ్చు. ఈ వ్యాధికి కారణం స్వీయ నియంత్రణలో భావోద్వేగ, ప్రవర్తనా లోపాలు. చాలా అరుదైన వ్యాధి అయినప్పటికీ, ఈ వ్యాధి నిజమైనది. విచారకరమైన విషయం ఏమిటంటే క్లెప్టోమేనియాకు చికిత్స చేయడం సాధ్యం కాదు. కానీ మందులు, చికిత్సతో పరిస్థితిని నియంత్రించవచ్చు.

క్లెప్టోమేనియా అనేది మనకు అవసరం లేకపోయినా తక్కువ లేదా విలువ లేని వస్తువును పొందాలనే కోరికగా ఉంటుంది. ఏదో ఒక వస్తువును లేపేస్తేనే తృప్తి కలుగుతుంది. లేదంటే మానసికంగా ఏదేదో ఆలోచిస్తుంటారు. ఏదైనా వస్తువును డబ్బులు పెట్టి కొనడం కంటే.. దాన్ని దొంగతనం చేస్తేనే వారికి మజా ఉంటుంది. దొంగతనం చేసి తెచ్చుకున్నాకే తృప్తి. ఇది స్వీయ నియంత్రణకు సంబంధించిన రుగ్మత. సాధారణంగా, ఇటువంటి రుగ్మతలను ఇంపల్స్ కంట్రోల్ డిజార్డర్స్ అంటారు.

ఈ రుగ్మతలతో బాధపడుతున్న వ్యక్తులు తమకు లేదా ఇతరులకు హాని కలిగించే పనులను చేయడానికి అనియంత్రిత కోరికను కలిగి ఉంటారు. ఎంత ప్రయత్నించినా ఆ ప్రేరణను నియంత్రించలేరు. అమెరికన్ సైకియాట్రిక్ అసోసియేషన్ ఇది చాలా తక్కువ శాతం మందిని మాత్రమే ప్రభావితం చేసే మానసిక సమస్య అని ధృవీకరిస్తుంది.

క్లెప్టోమేనియా లక్షణాలు

అవసరం లేకపోయినా వస్తువులను దొంగిలించాలనే అదుపులేని కోరిక.

టెన్షన్, ఆందోళన దొంగతనానికి దారి తీస్తుంది.

దొంగతనం ద్వారా ఆనందం, సంతృప్తి.

అపరాధం, అవమానం, పట్టుబడతామనే భయం.

కారణాలు

ఒక వ్యక్తి క్లెప్టోమేనియాకు ఎందుకు బానిస అవుతాడో వైద్య ప్రపంచం ఇంకా అర్థం చేసుకోలేదు. కానీ న్యూరోట్రాన్స్మిటర్ సెరోటోనిన్‌తో దీనికి సంబంధం ఉందని భావిస్తున్నారు. సెరోటోనిన్ అనేది మానసిక స్థితి, భావోద్వేగాలను నియంత్రించడంలో సహాయపడే న్యూరోట్రాన్స్మిటర్. వ్యసన రుగ్మతలు కూడా క్లెప్టోమానియాకు కారణం కావచ్చు. ఎందుకంటే క్లెప్టోమేనియా సాధారణంగా వ్యసనాలు, డిప్రెషన్, వ్యక్తిత్వ లోపాలు ఉన్నవారిలో సంభవిస్తుంది.

చికిత్స

ఈ వ్యాధిని పూర్తిగా నయం చేయడం అసాధ్యం. అదే సమయంలో స్కిల్-బిల్డింగ్ థెరపీ, మందుల ద్వారా నియంత్రించేందుకు ప్రయత్నించవచ్చు. క్లెప్టోమేనియా అనేది చాలా అరుదైన మానసిక రుగ్మత. కానీ దీని చిక్కులు చాలా పెద్దవి.

WhatsApp channel