పండ్లు ప్రకృతి ప్రసాదించిన వరం. సహజసిద్ధమైన సుగుణాలతో నిండిన పండ్లు ఆరోగ్యానికి ఎంతో మంచిది. రుచికరమైన సిట్రస్ పండ్ల నుంచి తీపి నిండిన పండ్లను ఇంట్లోనే పెంచుకోవచ్చు. ఆ పండ్లను కొని తిన్ని తరువాత విత్తనాలను పడేయకండి. వాటిని ఇంట్లోని కుండీలు లేదా పెరట్లో పాతి ఎంచక్కా పెంచుకోవచ్చు. అన్ని రకాల విత్తనాలు సులువుగా మొలకెత్తవు. కొన్ని రకాల పండ్లకు చెందిన విత్తనాలు మాత్రం త్వరగా మొలకెత్తుతాయి. అవేంటో తెలుసుకుంటే మీరు వాటిని ఇంటి పెరట్లోనే పెంచుకోవచ్చు. కొంచెం జాగ్రత్తగా చూసుకుంటే ఇంట్లో సులభంగా మొలకెత్తే కొన్ని పండ్ల విత్తనాలు ఇక్కడ ఉన్నాయి.
సిట్రస్ ఫ్రూట్ నారింజలు తినకుండా ఎవరూ ఉండలేరు. దీనిలో విటమిన్ సి నిండి ఉంటుంది. నారింజ విత్తనాలు తీసి పడేసే వారు ఎంతో మంది. వాటిని జాగ్రత్తగా తీసి పక్కనపెట్టండి. వాటిని అరగంట పాటూ నీటిలో నానబెట్టండి. దూదిని తీసుకుని దానిపై దాల్చినచెక్క పొడిని చల్లండి. దానిపైన నారింజ విత్తనాలను పెట్టండి. దానిపైనా మరొక దూది పెట్టి కప్పండి. దీన్ని గాలి చొరబడని కంటైనర్లో నిల్వ చేయండి. చీకటిగా, వెచ్చగా ఉంచే ప్రదేశంలో ఉంచండి. వారం రోజుల తర్వాత విత్తనం మొలకెత్తుతుంది. తర్వాత దాన్ని మట్టిలో నాటండి. దీనికి అప్పుడప్పుడు నీరు పోయండి, ఇది తక్కువ సమయంలో మొలకెత్తుతుంది.
స్ట్రాబెర్రీలంటే పిల్లలకు చాలా ఇష్టం. దీన్ని ఇంటి కుండీల్లోనే చాలా సులువుగా పెంచుకోవచ్చు. స్ట్రాబెర్రీ పుల్లని ఫ్లేవర్ కలిగి ఉంటుంది. ఈ వింటర్ బెర్రీ యాంటీఆక్సిడెంట్లతో నిండి ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. స్ట్రాబెర్రీ విత్తనాలు బయటవైపే ఉంటాయి. కాబట్టి వాటిని జాగ్రత్తగా సేకరించాలి. వాటిని నేలపై చల్లాలి. పైన మళ్లీ మట్టిని చల్లుకోవాలి. అప్పుడప్పుడు నీళ్లు చల్లుకోవాలి. కొన్ని రోజుల్లోనే ఇవి మొలకెత్తుతాయి.
నిమ్మకాయ ప్రతి ఇంట్లోనూ కనిపిస్తుంది. ఈ మొక్కలను కూడా ఇంట్లోనే పెంచుకోవచ్చు. నిమ్మ గింజలను ఆరు గంటల పాటు నీటిలో నానబెట్టాలి. విత్తనం చివరను జాగ్రత్తగా కత్తిరించాలి. బయటి పొరను తీసేయాలి. విత్తనాన్ని మట్టిలో 1.2 అంగుళాల లోతులో నాటాలి. ఆపై నీరు పోయాలి. విత్తనం మొలకెత్తుతుంది. జాగ్రత్తగా పెంచితే కుండీల్లోనే నిమ్మకాయలను కాస్తుంది.
టమోటాలను అధికంగా వంటల్లో వాడతారు. ప్రపంచంలో ఎంతో మంది ఆహారంలో టమోటాలు భాగం అయిపోయాయి. టమోటాలలో విత్తనాలు అధికంగానే ఉంటాయి. పొటాషియం, విటమిన్లు పుష్కలంగా ఉన్న టమోటాలు చాలా సులభంగా పెరుగుతాయి. టమోటాలను సన్నని ముక్కలుగా కట్ చేసి ఆ ముక్కలను మట్టిలో వేయాలి. పైన మట్టిని చల్లాలి. వారం రోజుల్లో చిన్నచిన్న మొక్కలు మొలకెత్తడం ప్రారంభమవుతాయి.
వేసవిలో దొరికే పండ్లు మామిడి. ఇవి ఇంటి ముందు సులువుగా పెరుగుతాయి. మామిడి టెంకును గంట పాటూ నీటిలో నానబెట్టాలి. దాన్ని తీసి కుండీల్లో నాటాలి. అది మొలకెత్తి చిన్న మొక్కగా అయ్యాక తీసి ఇంటి ముందు లేదా ఇంటి వెనుక పెరడులో నాటుకోవాలి. ఇది చెట్టుగా ఎదుగుతుంది కాబట్టి ఖాళీ ప్రదేశం ఎక్కువగా ఉన్నచోట నాటుకోవడం మంచిది.
టాపిక్