ఇంటర్నెట్‌లో రోజూ పుట్టుకొస్తున్న కొత్త ట్రెండ్స్, వెల్‌నెస్ చిట్కాల వెనుక పరుగెత్తే ముందు, మన భారతీయ వంటశాలల్లో ఎప్పుడూ ఉండే సాంప్రదాయ సూపర్ ఫుడ్స్ గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఇవి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.
అట్మంటన్ వెల్‌నెస్ సెంటర్ వ్యవస్థాపక డైరెక్టర్, స్పోర్ట్స్ న్యూట్రిషనిస్ట్ నిఖిల్ కపూర్ HT లైఫ్‌స్టైల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలు పంచుకున్నారు. "సీ మాస్, అకై బెర్రీ వంటి విదేశీ పదార్థాలు ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందే చాలా కాలం ముందే, భారతీయ కుటుంబాలు తరతరాలుగా వస్తున్న జ్ఞానంతో, మన వంటింట్లో దొరికే సాధారణ సూపర్ ఫుడ్స్‌పై ఆధారపడ్డాయి" అని నిఖిల్ కపూర్ వివరించారు.
నిఖిల్ కపూర్ మన వంటశాలల్లో సులభంగా దొరికే 5 సూపర్ ఫుడ్స్ జాబితాను, అవి మీ ఆరోగ్యాన్ని ఎలా పెంచుతాయో వివరించారు
మన భారతీయ ఇళ్లలో ప్రతి వంటకంలో చిటికెడు పసుపు వేయడం ఆనవాయితీ. ఆధునిక ఆరోగ్య విజ్ఞానంలో కూడా పసుపు తన స్థానాన్ని నిలుపుకోవడం ఆసక్తికరం. పసుపులో ఉండే ముఖ్యమైన సమ్మేళనం కర్కుమిన్ కేవలం వాపులను తగ్గించడమే కాదు. ఇది మానసిక స్థితిని ప్రభావితం చేసే న్యూరోట్రాన్స్‌మిటర్లైన సెరోటోనిన్, డోపమైన్‌లను నియంత్రించడంలో సహాయపడుతుంది. అలాగే, మెదడు పనితీరును, ప్రేగులలోని సూక్ష్మజీవుల సమతుల్యతను కూడా మెరుగుపరుస్తుంది. భారతీయ వంటకాల్లో పసుపును వాడే పద్ధతి అనుకోకుండా ఏర్పడింది కాదు.. దాని శోషణను, ఔషధ గుణాలను పెంచడానికి ఇది ఒక పురాతన పద్ధతి.
ఆరోగ్యకరమైన కొవ్వుల గురించి మాట్లాడినప్పుడు నెయ్యిని తరచుగా పట్టించుకోరు. కానీ, ఇది మన ఆహారంలో చేర్చుకోగల అత్యంత పోషకమైన ఆహారాలలో ఒకటి. నెయ్యి ప్రేగుల ఆరోగ్యానికి, కొవ్వులో కరిగే పోషకాలను శరీరం గ్రహించడానికి సహాయపడుతుంది. స్థిరమైన శక్తిని అందిస్తుంది. నెయ్యి కండరాల రికవరీలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఇందులో ఉండే బ్యూట్రిక్ యాసిడ్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాల వల్ల, శారీరక శ్రమ తర్వాత లేదా నయం అయ్యే దశల్లో కణజాల మరమ్మత్తుకు నెయ్యి మద్దతు ఇస్తుంది.
మనకు అందుబాటులో ఉన్న అద్భుతమైన మొక్కలలో మునగ ఒకటి. మునగ రక్తంలో చక్కెర నియంత్రణ, కాలేయ ఆరోగ్యం, మానసిక స్పష్టతతో సహా వివిధ ఆరోగ్య అంశాలకు మద్దతు ఇస్తుంది. ఇది ఒక 'తెలివైన ఆకుపచ్చని ఆహారం' అని చెప్పొచ్చు. శరీరంలో, మెదడులో వాపును తగ్గించే అడాప్టోజెనిక్ ప్రయోజనాలను అందిస్తుంది. మనం ఎప్పుడూ మునగాకులను పప్పులు, సూప్‌లలో ఉపయోగిస్తాం. ఈ సాధారణ పద్ధతి రోజువారీ రోగనిరోధక శక్తికి ఎంత ప్రభావవంతంగా ఉంటుందో సైన్స్ ఇప్పుడు ధృవీకరిస్తుంది.
శతాబ్దాలుగా రోగనిరోధక శక్తిని పెంచడానికి ఉసిరిని ఉపయోగిస్తున్నారు. అయితే, దీని ప్రయోజనాలు చాలా లోతైనవి. ఇది జీర్ణక్రియను నియంత్రించడంలో, ప్రేగులలోని మైక్రోబయోటాను (సూక్ష్మజీవులను) ఆరోగ్యంగా ఉంచడంలో, మెదడులోని ఆక్సిడేటివ్ ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది. ఇవన్నీ గట్-బ్రెయిన్ యాక్సిస్ (ప్రేగు-మెదడు అనుసంధానం)కు కీలకమైన అంశాలు. పచ్చిగా, రసంగా లేదా చ్యవనప్రాష్ వంటి సాంప్రదాయ రూపాలలో నిరంతరం ఉసిరిని వాడటం వల్ల కాలక్రమేణా శక్తి, ఏకాగ్రత, రోగనిరోధక శక్తిలో ఒక రకమైన అంతర్గత బలం పెరుగుతుంది.
సాధారణంగా దొరికే ఆహారాలు ఎంత శక్తివంతమైనవో మనం మర్చిపోతుంటాం. అరటిపండు ఎల్లప్పుడూ శక్తికి నమ్మకమైన మూలం. అంతేకాకుండా, ఇది ప్రిబయోటిక్ ఫైబర్‌తో ప్రేగులకు పోషణను అందిస్తుంది. B6, పొటాషియం వంటి వాటితో నాడీ వ్యవస్థ పనితీరుకు మద్దతు ఇస్తుంది. ఇది మన శరీర అవసరాలకు అనుగుణంగా, సులభంగా అందుబాటులో ఉండే ఒక అద్భుతమైన ఆహారం. తక్కువ పండిన, పచ్చి అరటిపండులో రెసిస్టెంట్ స్టార్చ్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది ప్రయోజనకరమైన ప్రేగు బ్యాక్టీరియాకు ఆహారాన్ని అందించే శక్తివంతమైన ప్రిబయోటిక్. ఇది జీవక్రియ ఆరోగ్యాన్ని కూడా ప్రోత్సహిస్తుంది.
అరటిపండు పండిన కొద్దీ చక్కెర శాతం పెరుగుతుంది. అప్పుడు పసుపు రంగు అరటిపండు తక్షణ శక్తిని అందిస్తుంది. రెండు రకాల అరటిపండ్లకు వాటి ప్రత్యేక ప్రయోజనాలు ఉన్నాయి. పచ్చి అరటిపండ్లు ప్రేగు ఆరోగ్యానికి, రక్తంలో చక్కెర సమతుల్యతకు పనికొస్తే, పండిన అరటిపండ్లు సులభంగా జీర్ణమయ్యే శక్తికి ఉపయోగపడుతాయి.
(గమనిక: ఈ కథనం కేవలం సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహాకు ప్రత్యామ్నాయం కాదు. ఏదైనా ఆరోగ్య సమస్యల గురించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే ఎల్లప్పుడూ మీ డాక్టర్‌ను సంప్రదించండి.)
టాపిక్