మదర్స్ డేకి మీ అమ్మ కోసం తియ్యటి, నోరూరించే స్వీట్ చేయాలనుకుంటున్నారా? రొటీన్ కేక్‌లు, ఐస్‌క్రీమ్‌లు కాకుండా ప్రత్యేకమైన స్వీట్ అయితే బాగుంటుంది అని ఫీలవుతున్నారా? అయితే క్రీమీ రస్క్ పుడ్డింగ్ డెజర్ట్ ను ట్రై చేయండి. నోట్లో వేసుకోగానే కరిగిపోయే క్రీమీ రుచి, మలాయి కేక్ మృదుత్వం, ఐస్‌క్రీమ్ చల్లదనం, రసమలై తియ్యదనం... అన్నీ కలగలిపి ఒకేదానిలో ఉండే ప్రత్యేకమైన, అమొఘమైన స్వీట్ ఈ క్రీమీ రస్క్ పుడ్డింగ్. దీన్ని తయారు చేయడం కూడా చాలా సులువు.
ఇంట్లో ఉండే కొన్ని పదార్థాలతోనే, క్షణాల్లో దీన్ని తయారు చేయండి. ఈ ఈ మదర్స్ మే 11, 2025 డేకి మీ అమ్మ మీద మీకున్న ప్రేమను రుచిగా చూపించండి. ఈ క్రీమీ రస్క్ పుడ్డింగ్ ఆమెకు ఒక మధురమైన జ్ఞాపకంగా మిగిలిపోతుంది. ఆలస్యం చేయకుండా రెసిపీలోకి వెళిపొదాం పదండి.
1. రస్క్ పుడ్డింగ్ తయారు చేసుకోవడం కోసం ముందుగా పాకాన్ని తయారు చేసుకోవాలి. ఇందుకోసం ఒక గిన్నెలో ఒక కప్పు నీరు పోసి, అదే కప్పుతో దాదాపు అర కప్పు చక్కెర వేయండి.
2. మంచి ఫ్లేవర్ కోసం ఇందులోనే యాలకుల పొడిని వేసి రెండు మూడు నిమిషాల పాటు నీటిని బాగా మరిగించండి. ఇది కాస్త చిక్కబడి పాకంలా తయారైన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కకు పెట్టుకోండి.
3. ఇప్పుడు మరొక గిన్నెలో రెండు కప్పుల పాలు పోసి అందులో 3 స్పూన్ల చక్కెర వేసి కాసేపు మరిగించండి.
4. పాలు మరుగుతున్న సమయంలో ఒక చిన్న గిన్నెలో 5 స్పూన్ల చల్లటి పాలు, ఒక స్పూన్ కస్టర్డ్ పౌడర్, 1 స్పూన్ కార్న్ ఫ్లోర్ వేసి ఉండలు లేకుండా బాగా కలపండి.
5. పాలు మరుగుతున్న సమయంలో మంటను తగ్గించి ఈ కస్టర్డ్ మిశ్రమాన్ని కొద్దికొద్దిగా పాలలో వేస్తూ కలుపుతూ ఉండండి.
6. ఇలా కస్టర్డ్ బాగా చిక్కగా అయ్యాక అందులో ఫ్రెష్ పాల మీగడను వేసి మరో రెండు మూడు నిమిషాల పాటు కలుపుతూ ఉడికించండి. క్రీమీ కస్టర్డ్ రెడీ కాగానే పక్కకు పెట్టుకోండి.
7. ఇప్పుడు ఒక పెద్ద వెడల్పాటి గిన్నె తీసుకోండి. అందులో రస్క్‌లను ఒక వరుసలో అమర్చండి.
8. ఈ రస్క్‌ల మీద కొద్దిగా వేడి పాకాన్ని సమానంగా పోయండి. తర్వాత, తయారుచేసిన కస్టర్డ్‌ను ఒక పొరలాగా వేయండి.
9. మళ్లీ దీనిపై రస్క్‌లను ఒక పొరలాగా అమర్చండి. ఆపైన మరోసారి పాకం, కస్టర్డ్‌తో ఇంకో పొర వేయండి. మీకు కావాలంటే మరిన్ని పొరలు కూడా వేసుకోవచ్చు.
10. చివరగా, పైన మీకు ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ లేదా తురిమిన ఎండు కొబ్బరితో గార్నిష్ చేయండి.
11. ఈ పుడ్డింగ్‌ను ఫ్రిజ్‌లో దాదాపు రెండు మూడు గంటలు పెట్టి ఉంచారంటే.. మీ రుచికరమైన క్రీమీ రస్క్ పుడ్డింగ్ రెడీ.
ఇది మలాయి కేక్, ఐస్‌క్రీమ్, రసమలై, కస్టర్డ్ రుచుల కలయికతో అద్భుతంగా ఉంటుంది. దీన్ని మదర్స్ డే రోజున మీ అమ్మకు మీరే స్వయంగా చేసి తినిపించారంటే ఆమె ఆనందంతో ఉబ్బితబ్బిబ్బు అయిపోతారు.