Friday Motivation: మీరు ఆనందంగా ఉండాలంటే మీ భాగస్వామితో ఆరోగ్యకరమైన అనుబంధాన్ని ఏర్పరచుకోవడం ఒక్కటే దారి
Friday Motivation: అన్ని విహారయాత్రలు చేసినా, బయట ఎంత తిరిగినా... చివరికి ఇంటికి వెళ్ళాకే మనసుకు సేద తీరినట్టు అనిపిస్తుంది. ఇల్లు ఆనందవనంలా ఉండాలంటే మీరు జీవిత భాగస్వామితో అనుబంధాన్ని ఏర్పరచుకోవాలి.
Friday Motivation: జీవిత భాగస్వామితో మీకు మంచి బంధం ఉంటే మీ ఇల్లు అందమైన తోటలా కనిపిస్తుంది. అదే మీకు, మీ పార్టనర్‌కు సరిపడకపోతే ఇల్లే ముళ్ల బాటలా అనిపిస్తుంది. కాబట్టి మీ ఇల్లు స్వర్గంలా ఉండాలంటే మీరు రెండు మెట్లు తగ్గి మీ జీవిత భాగస్వామితో మంచి బంధాన్ని పెంపొందించుకోవాలి. మీరు కలిసి వెళ్లే దారిని పూలవనంగా మార్చుకోవాలి. అప్పుడే మీ మానసిక ఆరోగ్యం, శారీరక ఆరోగ్యం బాగుంటుంది. ఒకరికొకరు సాయం గా ఉండడం, దయగా ఉండడం ఎంతో ముఖ్యం. అప్పుడే చిన్న చిన్న క్షణాలను కూడా ఆస్వాదించగలరు. ఎప్పుడూ కసురుకోవడం, తిట్టుకోవడం వంటి పనులు చేయడం వల్ల ఇద్దరి సంతోషం ఆవిరి అయిపోతుంది. ఇంటికి రావాలన్న కోరిక కూడా ఇద్దరికీ తగ్గిపోతుంది.
ఏదైనా అంశంలో భాగస్వామితో విభేదించాల్సి వస్తే పరుషమైన మాటలు మాట్లాడకండి. చాలా సున్నితంగానే ఆ విషయాన్ని చెప్పండి. వాదించుకోవడం మొదలుపెడితే అది తెగేదాకా సాగుతూనే ఉంటుంది. ప్రశాంతమైన నిద్ర కూడా ఉండదు. ఒకరి గౌరవానికి ఒకరు భంగం కలిగించుకోవాల్సి వస్తుంది. కాబట్టి మీ బంధం కోసం ఇద్దరిలో ఎవరో ఒకరు తగ్గితే ఎలాంటి ప్రమాదము లేదు. మీరు ఒకవేళ మీ జీవిత భాగస్వామితో ఏకీభవించలేకపోతే ఆ విషయాన్ని అక్కడితో వదిలేయండి. అంతేకానీ వారితో గొడవ పడకండి.
పెళ్లయిన కొత్తలోనే కాదు పెళ్లయి ఏళ్లు గడుస్తున్నా... మీ ప్రేమను మీ జీవిత భాగస్వామికి వ్యక్తీకరించడం చాలా ముఖ్యం. అది మీ మధ్య అనుబంధాన్ని పటిష్టంగా చేయడమే కాదు, తాజాగా ఉంచుతుంది. అలాగే మీ లైంగిక సంబంధాలు కూడా మెరుగ్గా ఉండాలంటే వారానికి ఒకసారి అయినా మీ ప్రేమను వ్యక్తీకరుస్తూ ఉండాలి. వారికి ఇష్టమైన భోజనాన్ని ఆర్డర్ చేయడం, మీ భాగస్వామిని ఆశ్చర్యపరచడం, రొమాంటిక్ సర్ ప్రైజ్‌లు ప్లాన్ చేయడం వంటివి చేస్తూ ఉండండి.
మీరు తప్పు చేసినట్లయితే మీ జీవిత భాగస్వామికి క్షమాపణ చెప్పేందుకు వెనుకాడకండి. ఇలా క్షమాపణ చెప్పడం వల్ల మీ స్థాయి తగ్గిపోదు. మీరు ప్రేమించిన వారి దగ్గర రెండు మెట్లు దిగి రావడం వల్ల ప్రేమ పెరుగుతుందే కానీ తరగదు. మీ సంబంధం మరింత బలంగా మారుతుంది. ప్రతి ఒక్కరూ తప్పులు చేస్తారు. ఆ తప్పుల వల్ల ఎదుటివారు బాధ పడకుండా చూసుకుంటేనే మానవత్వం ఉన్నట్టు.
చిన్న చిన్న అంశాలను, చిన్నచిన్న విజయాలను కూడా ఇద్దరూ కలిసి సెలెబ్రేట్ చేసుకోవడం అలవాటు చేసుకోండి. ఇది మీ మధ్య సాంగత్యాన్ని మరింతగా పెంచుతుంది. అలాగే ఒకరికి ఒకరు అండగా ఉండడం అలవాటు చేసుకోండి. జంటగా విజయాలను సాధిస్తే ఆ సంతోషమే వేరు.