Wednesday Motivation: విజయానికి షార్ట్‌కట్ ఒక్కటే కష్టపడి పనిచేయడం, కష్టపడితే సక్సెస్ మీ వెంటే
Wednesday Motivation: జీవితంలో ఏది సాధించాలన్నా ముందు కష్టపడాలి. ఎలాంటి కష్టం పడకుండా సక్సెస్ దక్కాలని మాత్రం కోరుకోవద్దు. కష్టపడ్డాక వచ్చే ఫలితం చాలా తీయగా ఉంటుంది.
Wednesday Motivation: కష్టపడకుండా విజయం కావాలని కోరుకుంటున్నారా? అది అసాధ్యం. సక్సెస్ మీ వెంట రావాలంటే ఖచ్చితంగా మీరు కష్టపడి తీరాలి. విజయానికి దగ్గర దారి ఏదైనా ఉందంటే అది కష్టపడడమే. కొంతమంది ఎలాంటి కష్టం లేకుండానే విజేతగా నిలవాలని కోరుకుంటారు. అలాంటి వారికి దక్కేది ఏమీ ఉండదు.
విజయం దక్కాలంటే ప్రతి మనిషిలో ఉండాల్సింది కృషి, పట్టుదల. అలాగే జీవితంలో ఏదైనా సాధించాలనే తపన. ఈ మూడే మనల్ని విజయతీరాలకు చేరుస్తాయి. విజయమంటే ఏదో ఒకటి సాధించడం కాదు, మీరు కావాలనుకున్నది, మీ జీవితంలో విలువైనదిగా భావించేది గెలిచి చూపించండి. అప్పుడే మీ మనసు సంతృప్తిని పొందుతుంది.
చాలామందికి విజయం సాధించడం అంటే ధనవంతులుగా మారడమేనని అనుకుంటారు. మరికొందరు విలాసవంతమైన జీవితాన్ని గడపడం అనుకుంటారు. విజయం అంటే మిమ్మల్ని పదిమందిలో ప్రత్యేకంగా నిలబెట్టేది మీ కష్ట ఫలితం.
మీరు విజయం సాధించే ప్రయాణంలో ఎన్నో ఆటంకాలు ఎదుర్కొంటారు. అలాగే కొన్ని తప్పులు కూడా చేస్తారు. మీ వల్ల తప్పు జరిగినప్పుడు వాటిని అంగీకరించే స్వభావం రావాలి. ఆ తప్పును దిద్దుకోవాలి. విజయ తీరాలకు చేరేవరకు సహనంగా ఉండాలి. మీ పనిలోనే నిబద్ధతగా ఉండాలి. అంకిత భావాన్ని చూపించాలి. ఇలాంటి లక్షణాలు ఉన్న వారిని కచ్చితంగా విజయం వరిస్తుంది. ఇప్పటికే ఎన్నో రంగాల్లో రాణిస్తున్న వారిని ఒకసారి చూడండి. వారి జీవితాన్ని దగ్గరగా చూసే వాళ్ళతో మాట్లాడండి. వారి జీవితంలో విజయం సాధించడానికి కారణమైన వాటిలో కొన్ని లక్షణాలు అయినా మీరు పొందండి.
విజయాన్ని సాధించాలంటే ముందుగా లక్ష్యాన్ని పెట్టుకోవాలి. కొంతమంది రోజుకో లక్ష్యాన్ని పెట్టుకుంటారు. అలా రోజుకో లక్ష్యం, గమ్యాన్ని పెట్టుకునేవారు ఏదీ సాధించలేరు. ఒక లక్ష్యాన్ని పెట్టుకొని ఆ గమ్యాన్ని చేరుకోవడానికి ప్రయత్నించండి.
మీరు విజయం సాధించాలంటే మనస్ఫూర్తిగా పనిచేయండి. మనస్ఫూర్తిగా పనిచేయని వారు... వారి జీవితంలో ఏదీ సాధించలేరు. ఈ విషయాన్ని మేము కాదు అబ్దుల్ కలాం చెప్పారు. ఆయన ఏ పని చేసినా ఇష్టంగా, మనస్ఫూర్తిగా చేసేవారు. అందుకే ఆయన చేపట్టిన ప్రాజెక్టులన్నీ విజయవంతం అయ్యాయి. మీరు కూడా మీరు అనుకున్న లక్ష్యాలు చేరుకునేందుకు తప్పొప్పులను మనస్పూర్తిగా స్వీకరిస్తూ ముందుకు సాగండి. కచ్చితంగా ఏదో ఒక రోజు సక్సెస్ దక్కి తీరుతుంది.