Motivation: గెలుపు కన్నా ఓటమి నేర్పే పాఠమే విలువైనది, ఓడిపోయి చూడండి మీ చుట్టూ ఉన్న ప్రపంచం ఎలాంటిదో తెలుస్తుంది-the lesson of defeat is more valuable than the lesson of victory motivation story ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Motivation: గెలుపు కన్నా ఓటమి నేర్పే పాఠమే విలువైనది, ఓడిపోయి చూడండి మీ చుట్టూ ఉన్న ప్రపంచం ఎలాంటిదో తెలుస్తుంది

Motivation: గెలుపు కన్నా ఓటమి నేర్పే పాఠమే విలువైనది, ఓడిపోయి చూడండి మీ చుట్టూ ఉన్న ప్రపంచం ఎలాంటిదో తెలుస్తుంది

Haritha Chappa HT Telugu

Tuesday Motivation: గెలిస్తే మీ చుట్టూ ఉన్నవారు మిమ్మల్ని పొగుడుతారు. మీరు ఆనందిస్తారు. అంతకుమించి మీకు ప్రపంచం పోకడ అర్థం కాదు. అదే ఓడిపోయి చూడండి. మీ చుట్టూ ఉన్నవారు మీ పట్ల ఎలా ప్రవర్తిస్తారో, ఎలా మాట్లాడతారో తెలుస్తుంది. ప్రతి ఓటమి ఒక అనుభవాన్ని ఇచ్చే తీరుతుంది.

మోటివేషనల్ స్టోరీ (Pixabay)

మనిషి జీవితంలో ఓటమిని తీసుకోలేడు. గెలుపు మాత్రమే కావాలనుకుంటాడు. నిజానికి ఈ ప్రపంచంలో బతకాలంటే మొదట చేయాల్సింది ఓడిపోవడమే. ఓడిపోయినప్పుడే మనం ఏంటో, మన వాళ్ళు ఎవరో అర్థమవుతుంది. గెలుపు చెప్పే పాఠం కన్నా ఓటమి నేర్పే గుణపాఠం జీవితాంతం గుర్తుంటుంది.

గెలుపు రుచి

ఓటమి తర్వాత గెలుపు చాలా ఘనంగా ఉంటుంది. సింహం రెండడుగులు వెనక్కి వేసి ముందుకు దూకి ఎంత గట్టిగా పంజా విసురుతుందో ఓసారి గుర్తుకుతెచ్చుకోండి. అదే రేంజ్ లో గెలుపు కూడా ఉంటుంది. దానికి ముందుగా మీరు ఓటమిని చవి చూడాలి. ఓటమి వద్దు అనుకుంటే గెలుపు రుచిని పూర్తిగా ఆస్వాదించలేరు.

పరాజయాలకు భయపడే వ్యక్తి ఎప్పటికీ విజేత కాలేడు. ఓటమి రుచి చూడకపోతే ఈ సమాజంలో జీవించడం మీకు ఎప్పటికీ రాదు. ఎన్నిసార్లు ఓడిపోతారో... మీరు అంతగా రాటు దేలుతారు. ఈ ప్రపంచంలో ఎలాంటి వారినే తోనైనా జీవించే సామర్థ్యం, పరిస్థితులను ఎదుర్కొనే సత్తా మీకు వస్తుంది.

బిల్ గేట్స్ ఎన్నో సార్లు ‘విజయం రాగానే ఆనందపడడం సంబరాలు చేసుకోవడం ముఖ్యమే కానీ ఓడిపోయినప్పుడు దాని నుంచి పాఠాలు నేర్చుకోవడం కూడా అంతే ముఖ్యం’ అని చెబుతూ ఉంటాడు. అతడు కూడా ఒక్కసారిగా గెలుపు వాకిట్లో నిల్చోలేదు. ఎన్నో ఓటములను, అవమానాలను, తట్టుకొని ఇప్పుడు ప్రపంచానికే తెలిసిన వ్యక్తిగా ఎదిగాడు.

తీపి రుచి తెలియాలంటే ముందుగా చేదు ఎలా ఉంటుందో తెలియాలి. నేరుగా తీపే తినే వ్యక్తికి అది తీయగా అనిపించదు. అందుకే జీవితంలో ఎన్నో పరాజయాలు, అవమానాలు, ఎదురు దెబ్బలు, గాయాలు, కష్టాలు పడిన వ్యక్తికి విజయం అందితే ఆ ఆనందమే వేరు. మానసికంగా, శారీరకంగా నలిగిన తర్వాత అందుకున్న విజయం అద్భుతంగా అనిపిస్తుంది. ఆ మజాయే వేరు. అంతెందుకు కోట్లు పెట్టి కొనే వజ్రం కూడా భూమిలోంచి తీసినప్పుడు గులకరాయిలాగే ఉంటుంది. అది ఎన్నో కోతలకు గురయ్యాకే వజ్రంగా మారుతుంది. విజయం అందుకోవాలని వ్యక్తి కూడా ముందుగా పరాజయాలను తట్టుకునే శక్తిని సంపాదించుకోవాలి.

జీవితం ముగిసిపోలేదు

ఓటములు వరుసగా వచ్చినంత మాత్రాన జీవితం ముగిసిపోయినట్టు కాదు. మీరు ఓడిపోతున్నారు అంటే ముందుగా ప్రయత్నిస్తున్నారని అర్థం చేసుకోవాలి. విజయానికి నాంది పలికేది ప్రయత్నమే. ఒక వ్యక్తి జీవితంలో ఓటమి లేదు గెలుపు లేదు అంటే అతను ప్రయత్నించడమే లేదని అర్థం. ఓటమి మొదట నిరాశకు గురి చేయవచ్చు కానీ ఆ ఓటమి నుంచి మీరు కచ్చితంగా మీ తప్పును తెలుసుకుంటారు. ఒక పాఠాన్ని నేర్చుకుంటారు. ఆ తప్పును రెండో ప్రయత్నంలో చేయరు. అందుకే ప్రతి ఓటమి ఒక అద్భుతమైన పాఠం అనేది చెప్పుకోవాలి. అది మిమ్మల్ని మరో తప్పు చేయకుండా ఆలోచింపజేస్తుంది.

గెలుపు మన కళ్ళను ఆనందంతో కప్పేస్తుంది. కానీ ఓటమి ఏ తప్పు చేశామో అవలోకనం చేసుకోమని చెబుతుంది. మీలో ఉన్న మీ తప్పులను సరి చేసుకోమని హెచ్చరిస్తుంది. విజేతగా నిలిచేందుకు మిమ్మల్ని సిద్ధం చేస్తుంది. అందుకే ఓటమిని కూడా ఒక పుస్తకమనే అనుకోండి. పూర్తిగా ఆ పుస్తకాన్ని చదివి అవలోకనం చేసుకోండి. ఓటమిని కూడా ఒక పాఠం అనుకోండి. ఆ పాఠాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి.

Haritha Chappa

TwittereMail
హరిత హిందూస్తాన్ టైమ్స్‌లో చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్లో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, తెలుగు సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్‌వర్క్‌లలో పని చేశారు. ప్రింట్, డిజిటల్ జర్నలిజంలో 17 ఏళ్ల అనుభవం ఉంది. 2023 డిసెంబరు నుంచి హిందూస్థాన్ టైమ్స్‌లో ఆస్ట్రాలజీ, లైఫ్‌స్టైల్ సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు. లింక్టిన్ లో కనెక్ట్ అవ్వండి https://www.linkedin.com/in/haritha-ch-288a581a8/

సంబంధిత కథనం