Fathers Diet: తండ్రి ఆహారపు అలవాట్లు పుట్టబోయే బిడ్డపై ప్రభావం, వారిలో రాబోయే ఆరోగ్య సమస్యలు ఇవే-the impact of the fathers eating habits on the unborn child and the future health problems in them ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Fathers Diet: తండ్రి ఆహారపు అలవాట్లు పుట్టబోయే బిడ్డపై ప్రభావం, వారిలో రాబోయే ఆరోగ్య సమస్యలు ఇవే

Fathers Diet: తండ్రి ఆహారపు అలవాట్లు పుట్టబోయే బిడ్డపై ప్రభావం, వారిలో రాబోయే ఆరోగ్య సమస్యలు ఇవే

Haritha Chappa HT Telugu

Fathers Diet: పుట్టబోయే బిడ్డపై తల్లి ఆరోగ్య ప్రభావమే కాదు, తండ్రి ఆహారపు అలవాట్లు కూడా ఎంతో ప్రభావం చూపిస్తాయని ఒక కొత్త అధ్యయనం తేల్చింది. బిడ్డ పుట్టాక వారు పెరుగుతున్న కొద్దీ తండ్రి ఆహారపు అలవాట్లు వారిపై ఎంతో ప్రభావాన్ని చూపిస్తాయి.

తండ్రి ఆహారంతో పిల్లలపై ప్రభావం (Unsplash)

గర్భధారణ సమయంలో తల్లి ఆహారం, జీవనశైలి శిశువు ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయని అందరికీ తెలుసు. కానీ ఇందులో తండ్రి పాత్ర గురించి ఎవరూ చర్చించరు. కొత్త అధ్యయనం ప్రకారం పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంపై తండ్రి ప్రభావం కూడా చాలా ఉంటుంది. తండ్రి ఆహారపు అలవాట్లు బిడ్డ ఆరోగ్యంతో ముడిపడి ఉన్నాయని అధ్యయనం చెబుతోంది.

పుణెలోని లుల్లానగర్లోని మదర్హుడ్ హాస్పిటల్ కన్సల్టెంట్- డైటీషియన్ డిటి ఇన్షారా మహేద్వి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పిన ప్రకారం తండ్రి ప్రోటీన్ తక్కువగా, కార్బోహైడ్రేట్లు అధికంగా ఉన్న ఆహారాన్ని తింటే వారికి పుట్టే పిల్లల ఆరోగ్యం విషయంలో కొన్ని రకాల లక్షణాలు కనిపిస్తాయి. తల్లి తీసుకునే ఆహారం పిల్లల ఆరోగ్యంపై ప్రభావం చూపినట్టే, తండ్రి ఆహారపు అలవాట్లు కూడా అంతే ప్రభావాన్ని చూపిస్తుంది.

తండ్రి జీవనశైలి, ఆహార విధానం… వారికి పుట్టే పిల్లల ఆరోగ్యంపై ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. గర్భధారణ సమయంలో తల్లి తినే ఆహారం పిల్లల ఆరోగ్యంపై ఎలా ప్రభావం చూపిస్తుందో… గర్భం ధరించడానికి ముందే తండ్రి ఆహార పద్ధతులు భవిష్యత్తులో పుట్టబోయే బిడ్డపై కచ్చితంగా ప్రభావం చూపిస్తుంది. తండ్రి తినే ఆహారం సమతులంగా లేకపోతే అది పిల్లవాడు పెరిగేకొద్దీ సమస్యలు తెచ్చిపెడుతుంది.

పిల్లల ఆరోగ్యంపై తండ్రి ప్రభావం

  • తండ్రి తినే ఆహారం పోషకాలతో నిండి ఉండాలి. వారు తినే ఆహారమే వారిలో స్పెర్మ్ కణాల అభివృద్ధిని ప్రభావితం చేస్తుంది. సరైన ఆహారం తినకపోతే డిఎన్ఎ మారనప్పటికీ… జన్యువులపై మాత్రం చాలా ప్రభావం పడుతుంది. శరీరంలో అధిక కొవ్వు శాతం ఉన్న తండ్రులకు జన్మించిన ఆడపిల్లలు పెరిగేకొద్దీ ఊబకాయం బారిన పడే అవకాశం ఉంది.
  • తండ్రి సరైన ఆహారం తినకపోతే ఈ కూతుళ్లలో మధుమేహం వంటి జీవక్రియ వ్యాధుల లక్షణాలను ప్రదర్శిస్తారు. ఇవి ప్రాణాంతక కాలేయం, గుండె, మూత్రపిండాలు, పిత్తాశయ సమస్యలతో ముడిపడి ఉంటాయి.
  • తండ్రులకు సరైన ఆహారపు అలవాట్లు లేకపోతే పుట్టబోయే పిల్లల్లో కనిపించే మరో సమస్య ఊబకాయం. ఈ పరిస్థితులు పిల్లల ఆరోగ్యంపై దీర్ఘకాలిక పరిణామాలను కలిగిస్తాయి, వారి జీవన నాణ్యతను తగ్గిస్తాయి.
  • ప్రోటీన్ తక్కువగా, కార్బోహైడ్రేట్లు అధికంగా ఉన్న ఆహారాన్ని తినే తండ్రులకు పుట్టే పిల్లలలో మానసిక సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువ.

తండ్రులు ప్రోటీన్లు, కొవ్వులు, కార్బోహైడ్రేట్లతో కూడిన మైక్రోన్యూట్రియెంట్లతో కూడిన ఆహారాన్ని తీసుకోవాలి. సమతుల ఆహారాన్ని తీసుకునే తండ్రులకు పుట్టే పిల్లల్లో ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం తక్కు. గుండె సమస్యలు కూడా వీరిలో తక్కువగా వస్తాయి. తండ్రి ఆహారంలో ప్రోటీన్, కొవ్వు, పిండి పదార్థాలు కూడా ఉండాలి. తల్లిదండ్రులు వారి ఆహారంపై శ్రద్ధ వహించాలి. గర్భధారణకు ముందు అన్ని ముఖ్యమైన పోషకాలతో నిండిన ఆహారాన్ని ఎంచుకోవాలని నిర్ధారించుకోవాలి. దీని వల్ల భవిష్యత్ తరం ఆరోగ్యంగా ఉండేలా తల్లిదండ్రులు చూసుకోవచ్చు. బిడ్డలు కనేందుకు ప్లాన్ చేస్తున్న భార్యా భర్తలు ఇద్దరూ మూడు నెలల ముందు నుంచే డైటీషియన్ ను కలిసి తగిన డైట్ ను ఎంపిక చేసుకోవాలి.