ప్రపంచవ్యాప్తంగా రోజురోజుకూ క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయి. వైద్య రంగంలో ఎన్నో మార్పులు, పురోగతులు వచ్చినా క్యాన్సర్ అనగానే అందరిలో కలిగే భయం మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు. ఇది ప్రాణాంతక వ్యాధని, దీని నుంచి బయటపడటం కష్టమనే భావన నుంచి ఇంకా ప్రపంచం బయటికి రాలేకపోతుంది. అయితే చాలా మంది క్యాన్సర్‌ను శారీరక వ్యాధిగా మాత్రమే చూస్తారు. కానీ నిజానికి ఇది మనస్సు మీద కూడా తీవ్ర ప్రభావం చూపే వ్యాధి. శరీరంలోని భాగాలను మాత్రమే కాకుండా వ్యక్తి మనసులోని భావోద్వేగాలకు, ఆత్మవిశ్వాసానికి, జీవన విధానానికి కూడా ఇది చాలా ప్రమాదకారిగా మారుతుంది.
క్యాన్సర్ అనగానే మనకు వెంటనే శరీర సంబంధిత విషయాలే గుర్తుకువస్తాయి. ఈ వ్యాధి చికిత్సలు, దుష్ప్రభావాలు, బలం కోల్పోవడం, జుట్టు రాలడం వంటివి. కానీ కొందరికి శరీర సంబంధిత బాధలకంటే మానసికంగా ఎదురవుతున్న బాధే ఎక్కువగా ఉంటుంది. క్యాన్సర్ మానసిక ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపుతుంది? మనం దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? అలాగే అటువంటి స్థితిలో మనసును మనం ఎలా అదుపులో ఉంచుకోవాలి వంటి విషయాలను తెలుసుకుందాం రండి.
క్యాన్సర్ అనే విషయం తెలియగానే చాలా మంది పేషెంట్లలో కలిగే ఫీలింగ్ భయం. ఇక నేను చనిపోతానా, ఇంక నా జీవితం అయిపోయినట్టేనా? అని. ఈ ప్రశ్నలు వారి మనసుల్లో ఎల్లప్పుడూ మెదులుతూ ఉంటాయి. ఇవి వారిలో అనిశ్చితికి కారణమవుతాయి. దీని వల్ల వారు సరిగ్గా నిద్ర కూడా పోలేరు. ఉదయం లేవగానే వారిలో అసహనంగా కనిపిస్తుంది. దీని నుంచి బయటపడకపోతే అది దీర్ఘకాల ఆందోళన (chronic anxiety) గా మారుతుంది.
క్యాన్సర్ పేషెంట్స్‌లో సగానికి పైగా ప్రజల్లో నిరుత్సాహం, ఆనందాన్ని కోల్పోవడం, జీవితంపై ఆసక్తి లేకపోవడం కనిపిస్తుంది.వారి ముఖంలో నవ్వు అనేది కనిపించదు. మనసులో ఎప్పుడూ కలవరపడిపోతుంటారు. క్యాన్సర్ బాధితులు ఇలా ఉండటం చాలా ప్రమాదకరమని తెలుసుకోండి. డిప్రెషన్ వలన రోగ నిరోధక శక్తి కూడా తగ్గే ప్రమాదం ఉంది.వ్యాధిని ఎదుర్కునే శక్తిని కోల్పేతారు.
క్యాన్సర్ చికిత్సల్లో భాగంగా జుట్టు రాలిపోవడం, శరీర భాగాన్ని పాక్షికంగా తొలగించటం వంటివి జరుగుతాయి. (ఉదా: బ్రెస్ట్ సర్జరీ). అలాగే చర్మం రంగు మారడం వంటివి కూడా జరుగుతాయి. వీటి వల్ల కొందరు అత్మవిశ్వాసం పూర్తిగా కోల్పోతారు, జనాల్లోకి రావడం మానేస్తారు, బయట కనిపించడానికి భయపడతారు, అసహనంగా జీవిస్తుంటారు. తమను తాము తక్కువగా చూసుకోవడం మొదలు పెడతారు.
క్యాన్సర్ రావడంతో కుటుంబంలోని వ్యక్తుల స్వభావాలు మారిపోతాయి. కొన్ని సార్లు దంపతుల మధ్య సంబంధం కూడా తెగిపోవచ్చు. పిల్లలకి తల్లిదండ్రుల వైపు గమనశీలత తగ్గిపోవచ్చు. కేర్ తీసుకునే వారు కూడా మానసికంగా నలిగిపోతారు. వారి బాధను పేషెంట్ అర్థం చేసుకోకపోవచ్చు. దీనివల్ల ఇద్దరిలోనూ నిరుత్సాహం, నిరాసక్తత వస్తుంది.
క్యాన్సర్ వ్యాధిని జయించి దాని నుంచి బయటపడ్డాక కూడా దాని తాలూకా భయం మాత్రం మనసులో మిగిలిపోయి ఉంటుంది. మళ్లీ వస్తుందేమో, ఇంకా నా జీవితం ఇంతేనేమో అనే ఫీలింగ్ లోనే ఉంటారు. దీన్ని Survivor’s Guilt అని అంటారు. ఇతరులు క్యాన్సర్‌తో పోరాడి మరణిస్తే, తామే బ్రతికి ఉన్నామనే గిల్టీ ఫీలింగ్‌తో బాధపడతారు.
మీరు అనుభవిస్తున్న భావాలు సహజమైనవే. కానీ వాటిని నెగ్లెక్ట్ చేయకంటి.వాటిని అంగీకరించి వాటి నుంచి బయటపడేందుకు ప్రయత్నించండి. నేను భయపడుతున్నాను, నాకు బాధగా ఉంది అని తెలుసుకోండి. దీని నుంచి బయటపడండి.
సైకాలజిస్టులు, కౌన్సిలర్లు అనుభవాన్ని తెలుసుకుని వారి సలహాల అనుగుణంగా సరైన దిశగా నడవండి. అవసరమైతే సైకియాట్రిస్ట్ సలహా తీసుకుని మందులు కూడా ఉపయోగించవచ్చు.
క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న వారితో కలసి మాట్లాడండి, వారి అనుభవాలను పంచుకోండి, వారితో స్నేహంగా, సంతోషంగా మెలగడం వల్ల ఒంటరితనం నుంచి బయటపడచ్చు. దీని వల్ల మీరు మళ్లీ నవ్వడం, మరింత బలంగా ఉండటం, ఆశపడటం నేర్చుకుంటారు.
మానసిక భావోద్వేగాల నుంచి తప్పించుకోవాలంటే ధ్యానం,యోగా, శ్వాసక్రియలు వంటివి చేయడం అలవాటు చేసుకోండి. ఇవి మానసికంగా శాంతి ఇస్తాయి, ఒత్తిడిని తగ్గిస్తాయి. ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు. రోజుకు 15 నిమిషాలు చాలు.
ఉదయాన్నే లేవగానే ఆ రోజు కోసం ఒక చిన్న లక్ష్యాన్ని ఏర్పరుచుకోండి. ఆ పని చేయాలి అని మైండ్‌కి చెప్తే, మనసు వ్యాధిపూ కాకుండా మీరు చేయాల్సిన పనిపై దృష్టిపెడుతుంది.ఇది మనసుకు ప్రశాంతంగా చురుగ్గా ఉంచుతుంది.
మంచి ఆహారం, సరైన నిద్ర, తగిన వ్యాయామం కూడా మన మనసు పట్ల ప్రభావం చూపుతాయి. బాడీ బలంగా ఉంటే మనం మానసికంగా కూడా స్టేబుల్‌గా ఉంటుంది.
ఆక్యుపంక్చర్, మసాజ్, మ్యూజిక్ థెరపీ, ఆర్ట్ థెరపీ వంటివి కూడా మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.
మొత్తం మీద వ్యాధిని తగ్గించుకునే ప్రయత్నాలతో పాటు వ్యాధి తాలూకా భయం, బాధ, ఆందోళనలను తగ్గించుకోవడం చాలా అవసరమని గుర్తుంచుకోండి. మీరు ఒంటరిగా లేరు, బలహీనులు కారు, మీకు సహాయం అందుబాటులో ఉంది అని అనుకోండి. మనసుకు శాంతి కలిగించే మార్గాలను అన్వేషించండి. ధైర్యంగా ఈ వ్యాధిని జయించండి.
సంబంధిత కథనం