అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్ కు ప్రొస్టేట్ క్యాన్సర్ ఉన్నట్లు ఆయన కార్యాలయ అధికారులు ఆదివారం ప్రకటించారు. కొన్ని వైద్య పరీక్షలు చేసిన తర్వాత అతనికి ఈ వ్యాధి ఉన్నట్టు బయటపడింది. ప్రొస్టేట్ క్యాన్సర్ ఎంతోమంది మగవారికి వస్తోంది. అయితే వచ్చిన క్యాన్సర్ ఎంత ప్రమాదకరమైనదో అతని గ్లీసన్ స్కోరు చెబుతోంది.
మూత్ర విసర్జన సమయంలో కొన్ని రకాల లక్షణాలు కనిపించడంతో జో బైడెన్ క్యాన్సర్ పరీక్షలు చేయించుకున్నారు. ఆ పరీక్షల్లో అతడికి క్యాన్సర్ ఉన్నట్టు నిర్ధారణ అయింది. అయితే ఆ క్యాన్సర్ ఏ స్థాయిలో ఉందో తెలుసుకోవడానికి కూడా పరీక్షలు చేశారు. అందులో బైడెన్ కి వచ్చిన క్యాన్సర్ గ్లిసన్ స్కోరు 9 ఉన్నట్టు చూపించింది.
గ్లీసన్ స్కోరు ఉపయోగించి ప్రొస్టేట్ క్యాన్సర్ ఎంత దూకుడుగా ఉందో అంచనా వేస్తారు. అంటే ఈ క్యాన్సర్ ఆ ప్రాంతం నుంచి ఇతర అవయవాలకు ఎంత వేగంగా వ్యాపించే అవకాశం ఉందో కూడా దీని ద్వారా తెలుస్తుంది. ఈ స్కోరును ఒకటి నుండి పది వరకు అంచనా వేస్తారు. అయితే జో బైడెన్ కు ఉన్న క్యాన్సర్ గ్లీసన్ స్కోరు తొమ్మిదిగా తెలిసింది. అంటే అతని క్యాన్సర్ చాలా దూకుడుగా ఉందని ఈ స్కోరు సూచిస్తోంది.
క్యాన్సర్ శరీరంలోని ఇతర భాగాలకు వ్యాపించినప్పుడు అది ఎముకలకు కూడా వ్యాపిస్తుంది. ఇలా ఎముకలకు కూడా క్యాన్సర్ వ్యాపిస్తే చికిత్స చేయడం చాలా కష్టంగా మారిపోతుంది. ఎందుకంటే మందులు శరీరంలోని అన్ని కణితులను చేరుకోవడం చాలా కష్టం. ఎముకలకు కూడా క్యాన్సర్ వ్యాప్తి చెందడంతో అతని ఆయుష్షు తక్కువేనని వారు అంచనా వేస్తున్నారు.
ప్రొస్టేట్ క్యాన్సర్ అనేది పురుషుల్లో ప్రత్యేక గ్రంధిలో వచ్చే క్యాన్సర్. ఇది మూత్రశయం కింద పురీష నాళానికి ముందు వైపుగా ఉంటుంది. ఈ గ్రంధిలోనే వీర్యం ఉత్పత్తి జరుగుతుంది. ఇక్కడ ప్రొస్టేట్ కణాలు అసాధారణంగా పెరగడం ప్రారంభించినప్పుడు అది క్యాన్సర్ కణితిగా మారుతుంది. మొదటిలో ఇది ఎలాంటి లక్షణాలను చూపించకపోవచ్చు. తర్వాత మాత్రం కొన్ని రకాల లక్షణాల ద్వారా ఇది బయటపడుతుంది.
మూత్ర విసర్జన సరిగ్గా జరగదు. అవరోధాలు ఏర్పడతాయి. మూత్ర విసర్జన సమయంలో రక్తస్రావం జరుగుతుంది. అలాగే నొప్పి కూడా వస్తుంది. లైంగిక సమస్యలు కూడా వస్తాయి. ప్రొస్టేట్ క్యాన్సర్ ఇప్పుడు ప్రపంచంలో ఎక్కువమంది మగవారిని ఇబ్బంది పెడుతున్న క్యాన్సర్లలో ఒకటిగా మారింది. 50 ఏళ్ల వయసు దాటిన పురుషులలో ఈ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. అలాగే వారసత్వంగా కూడా ఇది రావచ్చు. ఈ క్యాన్సర్ వచ్చిందో లేదో తెలుసుకునేందుకు డిజిటల్ పరీక్ష అలాగే రక్త పరీక్షలు చేస్తారు.
ప్రొస్టేట్ క్యాన్సర్ కు అనేక విధాలుగా చికిత్సను అందించవచ్చు. ఈ వ్యాధిని క్రమం తప్పకుండా పర్యవేక్షించడం ఎంతో అవసరం. అలాగే అవసరమైనప్పుడు శస్త్ర చికిత్స కూడా చేస్తారు. రేడియో థెరపీ, హార్మోన్ థెరపీ, కీమోథెరపీ వంటివి కూడా చేస్తారు. క్యాన్సర్ దశపై ఏ చికిత్స చేయాలన్నది ఆధారపడి ఉంటుంది. ఈ వ్యాధి ప్రారంభ దశలోనే గుర్తిస్తే కోలుకునే అవకాశాలు చాలా ఎక్కువ.
టాపిక్