క్యాన్సర్‌తో బాధపడుతున్న వారి సంఖ్య ప్రతి ఏటా పెరుగుతుంది. కేవలం మనదేశంలోనే కాదు ప్రపంచంలోనే క్యాన్సర్ బారిన పడుతున్న వారు అధికంగా ఉన్నారు. మనదేశంలో కూడా క్యాన్సర్ రోగులు రెట్టింపు అవుతూ వస్తున్నారు. ఒక మనిషికి క్యాన్సర్ ఎందుకు వస్తుందో చెప్పడం చాలా కష్టం.
క్యాన్సర్ వారసత్వంగా కూడా రావచ్చు. అలాగే చెడు ఆహారపు అలవాట్ల వల్ల కూడా వచ్చే అవకాశం ఉంది. మీరు తినే ఆహారం అనేది మీ ఆరోగ్యాన్ని నిర్ణయిస్తుంది. మీరు తినే చెడు ఆహారాలు క్యాన్సర్ ను వచ్చే అవకాశాన్ని పెంచితే మరికొన్ని ఆహారాలు తినడం ద్వారా క్యాన్సర్ రాకను అడ్డుకోవచ్చు.
క్యాన్సర్ రాకుండా ఉండాలంటే ఎలాంటి ఆహారాన్ని తినాలో... అలాగే క్యాన్సర్ బారిన పడకుండా ఉండాలంటే ఎలాంటి ఆహారాలను దూరం పెట్టాలో తెలుసుకోండి.
బయట అమ్మే ఆహారాన్ని తినే వారి సంఖ్య అధికంగా ఉంది. ముఖ్యంగా ప్రాసెస్ చేసిన మాంసాలతో తయారుచేసే ఆహారాలను ఎక్కువ మంది ఇష్టపడుతున్నారు. ఎప్పుడైనా తాజా మాంసాన్ని ఇంట్లో వండుకుని తినడమే ఆరోగ్యకరం. అంతేకానీ బర్గర్లు, పిజ్జాలు, హాట్ డాగ్స్ వంటి రూపంలో ప్రాసెస్ చేసిన మాంసాలను తినడం ఏమాత్రం మంచి పద్ధతి కాదు. నూనెలో వేయించిన ఆహారాలు, బంగాళదుంప చిప్స్ వంటివి కూడా తినకూడదు. వాటిలో అధిక కొవ్వు ఉంటుంది. అలాగే క్యాన్సర్ కారకాలు కూడా ఉండే అవకాశం ఉంది.
పంచదారతో నిండిన స్వీట్లు ఎంత తగ్గించుకుంటే అంత మంచిది. శరీరంలో ఇన్ఫ్లమేషన్ పెరిగిపోయినా కూడా క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటాయి. చక్కెరతో నిండిన ఆహారాలు అధికంగా తింటే శరీరంలో ఇన్ఫ్లమేషన్ పెరిగిపోవచ్చు. అలాగే మద్యపానం అలవాటును కూడా వదిలేయాలి. మధ్యపానం వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం రెట్టింపు అవుతుంది.
క్యాన్సర్‌ను అడ్డుకోవడానికి మీరు తాజా ఆహారాన్ని ఇంటి దగ్గర వండిన ఆహారాన్ని తినడం మంచిది. అమెరికన్ క్యాన్సర్ సొసైటీ చెబుతున్న ప్రకారం ప్రతిరోజు మీరు మూడు వేర్వేరు రంగులలో ఉన్న పండ్లను, కూరగాయలను తినాలి. అలాగే బ్రౌన్ రైస్, ఓట్స్, మొక్కజొన్న, కిడ్నీ బీన్స్ వంటి కాయ దాన్యాలతో నిండిన ఆహారాన్ని ప్రతిరోజు తినాల్సిన అవసరం ఉంది.
అలాగే లీన్ ప్రోటీన్ కూడా మన శరీరానికి అత్యవసరం. లీన్ ప్రోటీన్ అనేది చికెన్, చేపలు వంటి వాటిలో ఉంటాయి. అలాగే ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు అధికంగా ఉండే ఆహారాన్ని కూడా తీసుకోవాలి. క్రూసిఫెరస్ జాతికి చెందిన ఆహారాలైన బ్రకోలి, క్యాబేజీ, కాలీఫ్లవర్ వంటివి క్యాన్సర్ నిరోధక లక్షణాలను కలిగి ఉంటాయి. ఎందుకంటే దీనిలో సల్ఫొరోఫెన్ అధికంగా ఉంటుంది. ఇది క్యాన్సర్‌ను అడ్డుకుంటుంది. కాబట్టి క్రూసిఫెరస్ కూరగాయల జాతికి చెందిన ఆహారాలను కూడా తినడం అలవాటు చేసుకోండి.
ఇక అవిసె గింజలను ప్రతిరోజు గుప్పెడు తింటే ఎంతో మంచిది. దీనిలో ఫైబర్, ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు అధికంగా ఉంటాయి. ఇవి మన శరీరంలో క్యాన్సర్ కణాలు పెరగకుండా అడ్డుకుంటాయి. ఇక సెలీనియం అధికంగా ఉండే రొయ్యలు కూడా క్యాన్సర్ నిరోధక లక్షణాలను కలిగి ఉంటాయి. కాబట్టి సెలీనియం పోషకాలు అధికంగా ఉండే ఆహారాలను కూడా ఎంపిక చేసుకొని తినాలి. కోడిగుడ్లు, అరటిపండ్లు, బ్రకోలి, పాలకూర, పచ్చి బఠానీలు, బీన్స్, జీడిపప్పులు, చికెన్, బ్రెజిల్ నట్స్ వంటివి తినాలి. టూనా, సాల్మన్, మాకెరెల్ వంటి చేపల్లో సెలీనియం అధికంగా ఉంటుంది.
క్యాన్సర్ బారిన పడకుండా ఉండాలంటే మీరు మీ ఎత్తుకు తగ్గ బరువును కలిగి ఉండాలి. బరువు పెరిగినా కూడా క్యాన్సర్ కణాలు పెరిగే అవకాశం ఉంటుంది. అలాగే అధిక వేడి దగ్గర కాల్చిన మాంసాన్ని తినకూడదు. ఉప్పుతో నిల్వచేసిన ఆహారాలను కూడా తగ్గించాలి. ఉప్పును కూడా ఎంత తగ్గిస్తే అంత మంచిది. వేడి వేడి పానీయాలు ఆహారాలు తినడం మానేయండి. ఇలా వేడి వేడి పానీయాలు శరీరంలోకి చేరితే అక్కడ గాయాలు చేసే అవకాశం ఉంది. ఆ గాయాలు మానకపోతే క్యాన్సర్ కణాలుగా మారుతాయి. అలాగే వ్యాయామం తరచూ చేయాల్సిన అవసరం ఉంది.
సంబంధిత కథనం