మూడేళ్ల బాలిక వియానా జైన్. ఆమెకు ఆరు నెలల క్రితం బ్రెయిన్ ట్యూమర్ ఉన్నట్లు తేలింది. ఆమె తల్లిదండ్రులు అన్ని రకాల శస్త్ర చికిత్సలు చేయించారు. కానీ ఆమె మరణం తథ్యమని చెప్పేశారు వైద్యులు.
ఏం చేయాలో తెలియక ఆ బాలిక తల్లిదండ్రులు తమ జైన మతాచారాన్ని పాటించారు. కూతురు చేత సంతారా ప్రతిజ్ఞ చేయించారు. ఇలా జరిగిన కొన్ని నిమిషాల తర్వాత వియానా జైన్ ప్రాణాలు కోల్పోయింది.
జైన మతంలో సంతారా ఎంతో ముఖ్యమైనది. జైనమత విశ్వాసాల ప్రకారం వ్యక్తి మరణానికి దగ్గరవుతున్నప్పుడు సంతారా ఆచారాన్ని స్వీకరించవచ్చు. ఈ ఆచారం ప్రకారం స్వీయ శుద్ధి, మోక్షాన్ని పొందే మార్గం ఇది. ఈ ఆచారంలో ఆ వ్యక్తి ఆహారం, నీటిని పూర్తిగా వదులుకుంటారు. స్వీయ ధ్యానంలో ఉంటారు. సంతారా కర్మను జైన సన్యాసులు చుట్టూ ఉండి జరిపిస్తారు. మరణం సంభవించే వరకు ఆహారాన్ని, నీటిని తీసుకోకుండా అలాగే ఉండి ప్రాణాలు కోల్పోతారు.
జైన మతంలో ఏ వ్యక్తి అయినా కూడా సంతారాన్ని స్వీకరించవచ్చు. వృద్ధాప్యంలో ఉన్నవారు చిన్న వయసులో ఉన్నవారు కూడా సంతారా తీసుకోవచ్చని నమ్ముతారు. అయితే జైనమత నాయకుడు మాత్రమే ముందుగా సంతారా ఆచారాన్ని పాటించడానికి ఆ వ్యక్తికి అనుమతి ఇవ్వాలి.
ఆ అనుమతి ఇచ్చిన తర్వాతే ఆ వ్యక్తి ఆహారాన్ని, నీటిని వదిలేయాలి. సంతారా ఆచారం తీసుకున్న తర్వాత ఆ వ్యక్తి జుట్టు మతపరమైన గ్రంథాలు పెట్టి చదువుతూ ఉంటారు. ఉపన్యాసాలు ఇస్తారు. అలాగే ఆ వ్యక్తి ఆశీర్వాదాలు తీసుకోవడానికి కూడా ఎంతోమంది వస్తారు. సంతారా ఆచారంలో మరణించిన వ్యక్తి మరణాన్ని సల్లేఖన అని పిలుస్తారు.
జైన సమాజంలో సంతారా పద్ధతిలో శరీరాన్ని త్యాగం చేయడం అనేది ఎంతో పవిత్రమైన కార్యం. ఈ సమయంలో వ్యక్తి తన ఆలోచనలను, భావోద్వేగాలను నియంత్రించుకోవాలి. ధ్యానం ప్రార్థనలోనే మునిగిపోవాలి.
సంతారాను ఎక్కువమంది మరణానికి దగ్గరగా ఉన్నప్పుడు లేదా వృద్ధాప్యంలో ఉన్నప్పుడు స్వీకరిస్తూ ఉంటారు. ఇక్కడ వియానా జైన్ కూడా నయం కానీ రోగంతో బాధపడుతోంది. ఆమెకు మరణం తధ్యమని వైద్యులు కూడా నిర్ధారించారు. అందుకే తమ మతాచారాల ప్రకారం సంతారా పద్ధతిలో తమ కూతురు చివరి క్షణాలు ముగించాలని ఆమె తల్లిదండ్రులు కోరుకున్నారు.
జైన ఆచారం ప్రకారం సంతారా ప్రతిజ్ఞ చేసిన అతి చిన్న వయస్కురాలు వియానా. అందుకే గోల్డెన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో కూడా ఆమె పేరు నమోదయింది.
సంతారా పద్ధతిని ఎంతోమంది విమర్శిస్తారు. అది ఆత్మహత్యతో సమానం అని చెబుతారు. రాజస్థాన్ హైకోర్టు కూడా సంతారా అనేది ఆత్మహత్యతో సమానమని తీర్పు చెప్పింది. స్వచ్ఛందంగా ప్రాణాన్ని తీసుకోవాలని అనుకోవడం స్వీయ హాని కలిగించుకోవడమేనని హైకోర్టు వివరించింది. మతపరమైన ఆచారమే అయిన ఇలాంటి పనులను సమర్ధించలేమని చెప్పింది. అయినా జైన సమాజంలో సంతారాపై ఎంతో గౌరవం మర్యాదలు ఉన్నాయి.