Monday Motivation: పిరికివానికి ఆపద కనిపిస్తుంది, ధైర్యవంతునికి అవకాశం కనిపిస్తుంది, మీ పిరికితనమే మీ మొదటి అపజయం
Monday Motivation: పిరికితనం వల్ల ఎల్లో కోల్పోతాం, కానీ ఏం కోల్పోయామని గుర్తించడానికి ఎంతో సమయం పడుతుంది. ప్రతిదానికి భయపడడం వల్ల విజయం దూరమైపోతుంది.
Monday Motivation: పిరికితనం మనిషిని నిర్వీర్యం చేస్తుంది, అదే ఆత్మవిశ్వాసం మనిషిని విజయంపథంలో నడిపిస్తుంది... ఇది చెప్పింది మేము కాదు. యువతకు మార్గదర్శకుడైన స్వామి వివేకానంద. పరిస్థితులకు తగ్గట్టు తగ్గి ఉండడం మంచిదే, అలా అని ప్రతి సందర్భంలోనూ అలా తగ్గే ఉంటే.. మీకు తెలియకుండా ఎంతో కోల్పోతారు.
కురుక్షేత్ర యుద్ధంలో శ్రీకృష్ణుడు కూడా అర్జునుడిలో ధైర్యాన్ని నింపేందుకు ఎంతో ప్రయత్నించాడు. అధైర్యాన్ని వదలాలని, పిరికితనం తగదని చెప్పాడు. నీచమైన హృదయాలకే ఇలాంటి పిరికితనం ఉంటుందని అన్నారు. గీతలోని సందేశం పిరికితనాన్ని వదిలిపెట్టి ధైర్యంగా అడుగు వేయాలని, పరిస్థితులు ఎదురైతే పోరాడాలి తప్ప పారిపోకూడదు. ఎంత కష్టమైనా లేచి నిలబడాలే తప్ప కూలబడి పోకూడదు. ఏదైనా పని చేసినప్పుడు పిరికితనాన్ని పూర్తిగా వదిలి చూడండి. మీకే తెలుస్తుంది, విజయం ఎంత వేగంగా మీ చేరువకు వస్తుందో.
కష్టాలను చూసి పారిపోవడం మొదలుపెడితే, ఆ కష్టం మీ వెంటే వస్తుంది. దానికి ఎదురెళ్లి చూడండి... అదే పారిపోతుంది. మిమ్మల్ని చూసి ఈర్ష పడే కళ్ళను చూసి భయపడకండి. ఆ భయం మీకు పిరికితనాన్ని నేర్పుతుంది. అదే ధైర్యంగా ఉండి చూడండి, మీకు గెలవడం అలవాటవుతుంది. భయం, పిరికితనాన్ని పక్కన పెట్టి ధైర్యాన్ని ఆయుధంగా చేసుకుని ముందుకు సాగండి... కష్టాలన్నీ దూది పింజెల్లా ఎగిరిపోయి జీవితం విజయం బాటలో సాగుతుంది.
కొంతమంది తాము పిరికివారిగా ఉండడమే కాదు, ఎదుటివారిని కూడా పిరికివారుగా మార్చేటట్టు మాట్లాడతారు. మన నుంచి వచ్చే ప్రతి ఆలోచన మరో మనిషికి వెలుగు చూపించేదిగా ఉండాలి, కానీ చీకట్లోకి నెట్టేసేదిగా ఉండకూడదు. ఎదుటివారితో ఎప్పుడూ పిరికి మాటలు మాట్లాడకండి. అలాగే వారు చెప్పే పిరికి మాటలు కూడా వినకండి. అవి మన జీవిత గమనానికి పెద్ద ఆటంకాలను కలిగిస్తాయి. ఎదుటివారికి పిరికితనం నూరిపోస్తే, మీరు పిరికిసంఘానికి నాయకులుగా మారిపోతారు. అంతకన్నా సాధించేది ఏం లేదు.
మీ పిరికితనం మీ అపజయానికి పునాది వేస్తుంది. మీ ధైర్యం మీ గెలుపుకు మొదటి మెట్టుగా మారుతుంది. మీ విజయం కోసం మొదటి అడుగు కాదు, చివరి అడుగు కూడా మీదే. అయితే అన్ని భయాలు, పిరికితనం అనుకోకూడదు. కొన్ని భయాల వెనక బాధ్యతలు కూడా ముడిపడి ఉంటాయి. ఆ బాధ్యతల కోసం ఓర్పుగా ఉండాల్సి వస్తుంది. కొన్నిసార్లు ఆ ఓర్పు పిరికితనంలా కనిపించవచ్చు. కానీ అలాంటి ఓర్పు, సహనం అవసరం కూడా. అలా అని పూర్తిగా పిరికిగా మారిపోకండి.