Salt Related Cancer: ఉప్పు అధికంగా తినేవారికి వచ్చే క్యాన్సర్ ఇదే, జాగ్రత్త పడకపోతే అంతే సంగతులు
Salt Related Cancer: ఉప్పు అధికంగా తింటే హైబీపీ మాత్రమే వస్తుందనుకుంటారు. నిజానికి ఒక రకమైన క్యాన్సర్ కూడా అధికంగా వస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.

ఉప్పు అధికంగా తినడం వల్ల శరీరంలో హై బీపీ వస్తుందన్న సంగతి అందరికీ తెలిసిందే. అందుకే ఉప్పును తక్కువగా తినమని వైద్యులు సూచిస్తూ ఉంటారు. అయితే ఉప్పు అధికంగా తినడం వల్ల కేవలం హై బీపీ మాత్రమే కాదు. మీకు తెలియకుండానే ఒక ప్రమాదకరమైన క్యాన్సర్ బారిన పడే అవకాశం ఉంది. అదే పొట్ట క్యాన్సర్. ఉప్పు రుచి కోసం మాత్రమే తింటారు.
అలాగే ఉప్పులో ఉండే అయోడిన్ కూడా మన శరీరానికి అవసరం. దీనికోసం మీరు ఎక్కువ మొత్తంలో ఉప్పు తినాల్సిన అవసరం లేదు. అయోడిన్ ఇతర ఆహార పదార్థాలలో కూడా ఉంటుంది. ఉప్పులో ఉండే సోడియం శరీరానికి ఎంతో హాని చేస్తుంది.అందుకే వైద్యులు ఉప్పును తగ్గించమని చెబుతారు.
అధిక ఉప్పు రుచిని పాడు చేయడమే కాకుండా మన ఆరోగ్యం పై చెడు ప్రభావాన్ని చూపిస్తుంది. ఇది అనేక వ్యాధులకు దారితీస్తుంది. ముఖ్యంగా పొట్ట క్యాన్సర్ తో దీనికి అవినాభావ సంబంధం ఉంది.
ఉప్పుతో వచ్చే క్యాన్సర్ ఇదే
అధికంగా ఉప్పు తినడం వల్ల పొట్టలోని పొర దెబ్బతింటుంది. పొట్ట పొరల్లో ఇన్ఫ్లమేషన్ పెరుగుతుంది. దీనివల్ల అక్కడ క్యాన్సర్ కణితులు పెరిగే అవకాశం ఉంటుంది. పొట్ట క్యాన్సర్ తో ముడిపడి ఉన్న H.ఫైలోరి బ్యాక్టీరియా ప్రభావాన్ని కూడా ఉప్పు పెంచుతుంది. ఇది కడుపులో కణాల పెరుగుదలను కూడా పెంచే అవకాశం ఎక్కువ. ఇది కాలక్రమేణా ఆ కణాలు క్యాన్సర్ కణాలుగా మారుతాయి. కాబట్టి ఉప్పు ఎక్కువగా తీసుకోవడం మానేయాలి. చప్పగా ఉన్నా పరవాలేదు... ఉప్పు తక్కువగా తింటేనే అన్ని రకాలుగా ఆరోగ్యకరం.
ఉప్పు ఎంత తినాలి?
ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతున్న ప్రకారం ఒక వ్యక్తి ఐదు గ్రాములు కంటే తక్కువ ఉప్పు మాత్రమే రోజులో తీసుకోవాలి. అంతకుమించి ఉప్పు తీసుకునే వారిలో పొట్ట కాన్సర్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. అలాగే పొట్ట క్యాన్సర్ కుటుంబ చరిత్రలో ఎవరికైనా ఉంటే అది వారసత్వంగా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అలాంటి వారు ఉప్పుని ఎంత తక్కువగా తీసుకుంటే అంత మంచిది.
వీటిని తినకూడదు?
ఉప్పును తగ్గించడానికి కొన్ని రకాల ఆహారాలను కూడా తినడం తగ్గించాలి. ప్రాసెస్ చేసిన మాంసాలను తినడం చాలా వరకు తగ్గించాలి. బయట దొరికే పిజ్జాలు, బర్గర్లు, హాట్ డాగ్స్ వంటి వాటిలో ప్రాసెస్ చేసిన మాంసాలనే వినియోగిస్తారు. వీటిలో సోడియం అధికంగా ఉంటుంది. సోడియం అధికంగా ఉండడం వల్ల మాంసాలు ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి. కాబట్టి అలాంటి ఆహారాన్ని మానేయాలి. అలాగే చిప్స్, కుర్ కురే వంటి స్నాక్స్ ను కూడా ఎంత తక్కువగా తింటే అంత మంచిది. వాటిల్లో కూడా సోడియం అధికంగా ఉంటుంది.
బయట ఆహారం కన్నా ఇంట్లో వండుకున్న ఆహారానికే ప్రాధాన్యత ఇవ్వాలి. అలాగే ఉప్పు ఎంత వేస్తున్నారో కూడా చూసుకోవాలి. అధిక ఉప్పు తినడం వీలైనంతవరకు తగ్గించాలి.
కారం తినడం తగ్గిస్తే ఉప్పుపై కూడా ఆసక్తి పోతుంది. కారంగా ఉండే ఆహారాలు అధికంగా తినేవారిలో ఉప్పు కూడా తెలియకుండానే శరీరంలో అధికంగా చేరిపోతుంది. కాబట్టి కారంగా ఉండే ఆహారాలకు దూరంగా ఉండేందుకు ప్రయత్నించాలి.
(గమనిక: అధ్యయనాలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ కోసం ఇక్కడ అందిస్తున్నాం. ఇది కేవలం సమాచారం మాత్రమే. ఇది వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి సందేహాలుంటే వెంటనే వైద్యులను సంప్రదించండి.)
సంబంధిత కథనం