అంతర్జాతీయ కార్మిక దినోత్సవం పుట్టుక వెనుక రక్త చరిత్ర, ఆ రోజు ఏం జరిగిందంటే...-the bloody history behind the birth of international workers day what happened that day ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  అంతర్జాతీయ కార్మిక దినోత్సవం పుట్టుక వెనుక రక్త చరిత్ర, ఆ రోజు ఏం జరిగిందంటే...

అంతర్జాతీయ కార్మిక దినోత్సవం పుట్టుక వెనుక రక్త చరిత్ర, ఆ రోజు ఏం జరిగిందంటే...

Haritha Chappa HT Telugu

ప్రపంచవ్యాప్తంగా మే ఒకటో తారీఖున అంతర్జాతీయ కార్మిక దినోత్సవాన్ని నిర్వహించుకుంటారు. కష్టపడి పనిచేసే కార్మికుల గౌరవార్థం ఈ దినోత్సవం పుట్టుకొచ్చిందని చెప్పుకుంటారు.

అంతర్జాతీయ కార్మిక దినోత్సవం 2025 (Pixabay)

ప్రతి ఏడాది మే 1న అంతర్జాతీయ కార్మిక దినోత్సవం నిర్వహించుకుంటారు. దీన్నే మే డే అని పిలుస్తారు. ఈ రోజున కష్టపడి పని చేసే కార్మికుల అంకితభావం, స్వేదానికి గుర్తింపును, విలువను ఇస్తూ మే డే ను నిర్వహించుకుంటారు. వారి కృషిని గుర్తించి, వారి హక్కుల గురించి వారికి తెలియజెప్పడం కూడా ఈ అంతర్జాతీయ కార్మిక దినోత్సవం ఉద్దేశమే.

ఎలా పుట్టింది?

అంతర్జాతీయ కార్మిక దినోత్సవం మూలాలు 19వ శతాబ్దం చివరిలో అమెరికాలో కనిపిస్తాయి. 1886లో కార్మిక ఉద్యమం అమెరికాలో మొదలైంది. ఎక్కువ పని గంటల మూలంగా కార్మికులు అనారోగ్యం పాలయ్యేవారు. పనిగంటలను కుదించాలని కోరుతూ అమెరికాలో దేశవ్యాప్తంగా సమ్మెను నిర్వహించారు. ఆ సమ్మె ఫలితాలు సానుకూలంగా వచ్చాయి. 1886లో రోజుకి ఎనిమిది గంటల మాత్రమే పని దినాలుగా నిర్ణయించారు. దేశవ్యాప్తంగా జరిగిన ఈ సమ్మెను చరిత్రలో నిలిచిపోయేలా చేసేందుకు మే 1వ తేదీని ఎంపిక చేశారు. ఆ రోజునే అంతర్జాతీయ కార్మిక దినోత్సవంగా నిర్ణయించారు.

విషాదకర ఘటన

ఈ కార్మిక దినోత్సవ నిరసన విషాదకర సంఘటనకు కారణమైంది. 1886 మే 1న ఎనిమిది గంటల పని దినం కావాలని కోరుతూ కార్మికులంతా శాంతియుతంగా ప్రదర్శన చేశారు. వారంతా కూడా చికాగోలోని హేమార్కెట్ స్క్వేర్ అనే ప్రాంతంలో గుమిగూడారు. అక్కడ బాంబు పేలడంతో ఆ నిరసన హింసాత్మకంగా మారిపోయింది. దాదాపు అయిదుగురు పోలీసులు, నలుగురు పౌరులు మరణించారు. అందుకే విషాదకర ఘటనగా చరిత్రలో నిలిచిపోయింది.

కార్మిక దినోత్సవం ప్రపంచవ్యాప్తంగా ఆదరణను పొందింది. లక్షలాదిమంది ప్రజలు కవాతులు, ర్యాలీలు నిర్వహిస్తూ కార్మికుల గౌరవిస్తారు.

ఒక దేశ నిర్మాణంలో కార్మికుల కృషి అపరిమితమైనది. ఒక జాతి నిర్మాణానికి వారు ఎంతో సహాయపడతారు. కార్మికుల శ్రమను గుర్తించకుండా దోచుకున్న సంఘటనలు ఎన్నో ఉన్నాయి. కానీ ఇప్పుడు వారికి కొన్ని హక్కులు కల్పించడం ద్వార వారి జీవితాలకు భరోసాను ఇస్తోంది చట్టం.

కార్మిక ఉద్యమాలు సాధించిన విజయాలను ఓసారి తలుచుకోవడానికి మే ఒకటవ తారీఖున ప్రపంచవ్యాప్తంగా సెలవు దినాన్ని ప్రకటించారు. వారు చేసే పని, వృత్తి వంటి నేపథ్యంతో సంబంధం లేకుండా అందరికీ ఈ రోజున సెలవును ప్రకటించారు.

కేవలం మనదేశంలోనే కాదు దక్షిణాఫ్రికా, ట్యూనీషియ, జింబాబ్వే, అమెరికా, చైనా... ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో దేశాల్లో మే 1న ప్రభుత్వ సెలవు దినం. ఆ రోజున కార్మికులు ఎన్నో చోట్ల ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ర్యాలీలను కూడా చేస్తారు. పోస్టర్లు, బ్యానర్లు ఇలా ఎంతో హడావుడి ఉంటుంది.

హరిత హిందూస్తాన్ టైమ్స్‌లో చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్లో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, తెలుగు సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్‌వర్క్‌లలో పని చేశారు. ప్రింట్, డిజిటల్ జర్నలిజంలో 17 ఏళ్ల అనుభవం ఉంది. 2023 డిసెంబరు నుంచి హిందూస్థాన్ టైమ్స్‌లో ఆస్ట్రాలజీ, లైఫ్‌స్టైల్ సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు. లింక్టిన్ లో కనెక్ట్ అవ్వండి.