Tension Free Life: విద్యార్థి లోకమా.. ఒత్తిడిని జయించేందుకు మార్గాలు ఇవిగో!-tension free tips ways to decrease stress from studying ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Tension Free Tips Ways To Decrease Stress From Studying

Tension Free Life: విద్యార్థి లోకమా.. ఒత్తిడిని జయించేందుకు మార్గాలు ఇవిగో!

Rekulapally Saichand HT Telugu
Feb 28, 2022 04:46 PM IST

తల్లిదండ్రులు వారి ఆలోచనలు, ఆశయాలను పిల్లలపై రుద్దుతున్నారు. మరోవైపు చదువుకునే చోట అధ్యాపకుల నుంచి ఒత్తిడి, పరీక్షలపై ఆందోళన సగటు విద్యార్థిని కుంగుబాటుకు గురిచేస్తున్నాయి. ఈ నేపథ్యంలో పరిస్థితి చేయిదాటకుండా ఒత్తిడిని తగ్గించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

ఒత్తిడి
ఒత్తిడి

మనిషి జీవినశైలి మారిపోయింది. నిదానంగా ఏ పని చేయలేకపోతున్నాడు. ఉరుకుల పరుగుల జీవితంలో ఒత్తిడికి లోనై చిత్తవుతున్నాడు. ఈ ఒత్తిడి ప్రభావం చదువుకునే విద్యార్థులపైనా ఉంటుంది. తల్లిదండ్రులు వారి ఆలోచనలు, ఆశయాలను పిల్లలపై రుద్దుతున్నారు. మరోవైపు చదువుకునే చోట అధ్యాపకుల నుంచి ఒత్తిడి, పరీక్షలపై ఆందోళన సగటు విద్యార్థిని కుంగుబాటుకు గురిచేస్తున్నాయి. ఈ నేపథ్యంలో పరిస్థితి చేయిదాటకుండా ఒత్తిడిని తగ్గించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇందుకోసం వారు కొన్ని చిట్కాలు కూడా అందిస్తున్నారు. అవేంటంటే..

ఒత్తిడిని జయించేందుకు నిపుణుల చిట్కాలు:

వాతావరణం మార్పుకు అలవాటు పడటం

ఉన్నత చదువులు, నాణ్యమైన విద్య కోసం విద్యార్థులు దూర ప్రాంతాల నుంచి వచ్చి నగరాలకు వస్తుంటారు. క్యాంపస్‌లో చేరిన తర్వాత వారికంతా కొత్తగా అనిపిస్తుంది. పరిచయం లేని వారితో కొత్త వాతావరణంలో గడపాల్సి వస్తోంది. ముఖ్యంగా అమ్మాయిలకు మొహమాటం, బిడియం ఉంటాయి. కొత్త వాతావరణానికి అలవాటు పడడానికి వారికి చాలా సమయం పడుతుంది. ఒంటరితనం బాగా వేధిస్తుంది, కన్నవారు తరచుగా గుర్తుకు వస్తారు. అలా కాకుండా మీరు ఎందుకోసం ఇక్కడికి వచ్చారనేది మనసులో ఉంచుకోవాలి. కేవలం కొంతకాలం వరకే అక్కడ గడుపుతారని గుర్తుపెట్టుకోవాలి. తొందరగా అక్కడి పరిసరాలకు అలవాటు పడుతూ.. పరిచయాలను పెంచుకుంటే ఒత్తిడిని జయించవచ్చు.

ప్రణాళికాబద్ధంగా చదవడం

విద్యార్థులు పైతరగతులకు ప్రమోట్ అవుతున్న కొద్దీ వారిపై ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది. దీంతో పాటు అప్పటివరకు మాతృభాషలో ఎక్కువగా చదివినవారు ఒక్కసారిగా ఇంగ్లీష్‌ మాధ్యమంలో చేరితే, పాఠ్యంశాలను తొందరగా అర్థం చేసుకోలేరు. దీంతో చదువు అర్థంకాక ఒత్తిడిలోకి వెళుతుంటారు. ఈ సమయంలో విద్యార్థులు కాస్త నిదానంగా ఆలోచించాలి. పాఠాలు అర్థం కాకపోతే తోటి విద్యార్థుల సహయం తీసుకోవాలి లేదా అధ్యాపకులను అడిగి తెలుసుకోవాలి. ఒక ప్రణాళిక ప్రకారం పాఠ్యాంశాలను పూర్తి చేయడం ద్వారా ఒత్తిడి తగ్గుతుంది.

భవిష్యత్‌‌పై ఆలోచనలు వద్దు

నా భవిష్యత్ ఏంటో? అని బెంగ ఎప్పుడూ పెట్టుకోవద్దు. భవిష్యత్‌ను ఊహంచుకోవడం వల్ల ఎక్కువగా ఒత్తిడి పెరుగుతుంది. వాస్తవ పరిస్థితులు తగ్గట్టుగా ఆలోచనలు ఉండాలి. ఇతరులతో ఆరోగ్యకరమైన పోటీ మీ లోపల ఉండాలి కానీ, ఇంకొకరితో మిమ్మల్ని పోల్చుకోవద్దు. మీ శక్తి సామర్థ్యాలకు మీవే అని గ్రహించాలి. ఫలితం ఎలాగైనా ఉండనీ మీరు చేయాల్సిన పని నిజాయితీగా చేస్తూపోండి.

వీటితో పాటు అసలు మీరు ఎందుక ఆందోళనకు గురవుతున్నారు? మిమ్మల్ని ఒత్తిడిలోకి నెడుతున్న అంశాలను ఒకచోట రాసుకోండి. వాటి పరిష్కార మార్గాల కోసం స్నేహితులు, అధ్యాపకులు లేదా కుటుంబ సభ్యుల సహాకారం తీసుకోండి. అంతేగానీ మీకు మీరే ఏదో జరిగిపోయినట్లు కుంగిపోకండి. యోగా, ధ్యానం చేయడం, క్రీడలు ఆడటం ద్వారా మానసిక ఉల్లాసం లభించడమే కాక, మిమ్మల్ని శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉంచుతాయి

WhatsApp channel

సంబంధిత కథనం