Telugu Riddles: ఈ పొడుపు కథలకు సమాధానాలు చెప్పండి చూద్దాం.. మీఎన్ని గుర్తున్నాయో?
Telugu Riddles: పొడుపు కథలు విప్పడమంటే సరదాగా ఉంటుంది. అందుకే కొన్ని సరదా పొడుపు కథలు మీకోసం ఇస్తున్నాం. సరదాగా వాటి జవాబుల కోసం ప్రయత్నించండి.
చిన్నప్పుడు ఆరు బయట మంచం వేస్కొని అందరు కూర్చున్నాక.. అమ్మమ్మలు తాతలు పొడుపు కథలు చెప్పేవారు. ఎవరు జవాబు చెబుతారా అని ఒక పోటీలా ఫీలయ్యే వాళ్లం. ఈ మధ్య అలాంటివేం కనిపించట్లేదు. అందుకే ఒకసారి ఈ పొడుపు కథలు చూడండి. మీ పాత రోజులు గుర్తొస్తాయి. జవాబులూ గుర్తు తెచ్చుకోండి. ఎన్నిటికి జవాబు చెప్పగలరో లెక్క పెట్టుకోండి. ప్రతి 5 ప్రశ్నల తర్వాత వాటి జవాబులున్నాయి. చూడండి..
1. తలనుండి పొగ చిమ్ముతుండు భూతం కాదు, కన్ను లెర్రగా ఉండు రాకాసి కాదు, పాకి పోవు చుండు పాము కాదు, నేను ఎవరిని ?
2. ఇంటికి కాపలా కాస్తుంది కానీ కుక్క కాదు. పట్టుకుని వేలాడుతూ ఉంది కానీ పడుకోదు.
3. ఎన్ని రేట్లు పెరిగినా ఎప్పుడూ పది పైసలకు రెండు వచ్చేవి, ఏమిటవి ?
4. ముక్కు మీద కెక్కు. ముంద చెవులు నొక్కు. టక్కు నొక్కుల సోకు. జారిందంటే పుటుక్కు.
5. అడవిలో పుట్టింది, మేదరింట్లో మెలిగింది, ఒంటినిండా గాయాలు, కడుపు నిండా రాగాలు, నేను ఎవరిని ?
1-5 జవాబులు:
1. రైలు
2. తాళం
3. అయిదు పైసల బిల్లలు
4. కళ్లద్దాలు
5. మురళి
6. నామము ఉంది గాని పూజారిని కాదు, తోక ఉంటుంది కానీ కోతిని కాను, నేను ఎవర్ని
7. అంగుళం ఆకు, అడుగున్నర కాయ, నేను ఎవరిని ?
8. అరచేతి పట్నాన అరవై రంధ్రాలు, నేను ఎవరిని ?
9. చారెడు కుండలో మానెడు పగడాలు, నేను ఎవరిని ?
10. మొదట చప్పన, నడుమ పుల్లన, కొస కమ్మన, ఏమిటి అది ?
6- 10 జవాబులు:
6. ఉడత
7. మునక్కాయ
8. జల్లెడ
9. దానిమ్మ పండు
10. పాలు, పెరుగు, నెయ్యి
11. మూత తెరిస్తే, ముత్యాల పేరు,ఏమిటి అది ?
12. పెద్ద ఇంటిలో పొట్టివాన్ని నిలబెడితే నిండా నేనే, నేను ఎవరిని ?
13. తెలిసేలా పూస్తుంది, తెలియకుండా కాస్తుంది!! అదేమిటి?
14. నన్ను వాడాలంటే నేను పగలాల్సిందే. నేనెవర్ని
15. ఎర్రటి పండు మీద ఈగైనా వాలదు.
11-15 జవాబులు:
11. దంతాలు
12. దీపం
13. వేరుశనగ కాయ
14. గుడ్డు
15. నిప్పు
16. దాని పువ్వు పూజకు రాదు. దాని ఆకు డొప్పకు రాదు, దాని పండు అందరు కోరు?
17. కొమ్ములుంటాయి కానీ ఎద్దు కాదు. అంబారీ ఉంటుంది కానీ ఏనుగు కాదు?
18. పైన చూస్తే పండు, పగుల గొడితే బొచ్చు?
19. దేహమెల్ల కళ్లు, దేవేంద్రుడు కాదు. నరవాహనము లేక నడిచిపోలేదు. తనకు జీవం లేదు కానీ జీవుల్ని చంపు.
20. పొట్టలో వేలు, నెత్తి మీద రాయి.
16- 20 జవాబులు:
16. చింతపండు
17. నత్త
18. పత్తి కాయ
19. వల
20. ఉంగరం
21. ఆ వీధిరాజుకి కొప్పుంది. జుట్టులేదు. కళ్లున్నాయి చూపులేదు
22. నీళ్లలో పుడుతుంది. నీళ్లలో పడితే చస్తుంది.
23. సంతలన్నీ తిరుగుతాడు. సమానంగా పంచుతాడు.
24. నాగస్వరానికి లొంగని త్రాచు. నిప్పంటిచగానే తాడెత్తు లేస్తుంది.
25. ఈనదు, పొర్లదు, బంధం వేస్తే బిందెల పాలిస్తుంది?
21-25 జవాబులు:
21. కొబ్బరి కాయ
22. ఉప్పు
23. త్రాసు
24. చిచ్చు బుడ్డి
25. తాడిచెట్టు
ఇంతకీ మీకెన్ని మార్కులొచ్చాయ్?
టాపిక్