Mayonnaise: పచ్చి గుడ్లతో చేసే మయోనైస్‌ను నిషేధించిన తెలంగాణ, మయోనైస్ అంత ప్రమాదకరమా?-telangana bans mayonnaise made from raw eggs is mayonnaise as dangerous ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Mayonnaise: పచ్చి గుడ్లతో చేసే మయోనైస్‌ను నిషేధించిన తెలంగాణ, మయోనైస్ అంత ప్రమాదకరమా?

Mayonnaise: పచ్చి గుడ్లతో చేసే మయోనైస్‌ను నిషేధించిన తెలంగాణ, మయోనైస్ అంత ప్రమాదకరమా?

Haritha Chappa HT Telugu
Nov 01, 2024 03:30 PM IST

Mayonnaise: ఇప్పుడు మయోనైస్ తెలియని యువత లేదు. పిజ్జా తిన్నా, బర్గర్ తిన్నా, ఫ్రెంచ్ ఫ్రైస్ తిన్నా, మోమోస్ తిన్నా కూడా పక్కన తెల్లని మయోనైస్ క్రీమ్ ఉండాల్సిందే. అయితే ఇది ఆరోగ్యానికి మంచిది కాదని చెబుతున్నారు పోషకాహార నిపుణులు.

మయోన్నైస్ సైడ్ ఎఫెక్టులు
మయోన్నైస్ సైడ్ ఎఫెక్టులు

ఆధునిక కాలంలో పుట్టుకొచ్చిన కొత్త ఆహార పదార్థం మయోన్నైస్. ఒకప్పుడు టమాటా కెచప్‌ను వాడేవారు, ఇప్పుడు టమోటా కెచప్‌తో పాటు మయోన్నైస్ కూడా పక్కన ఉంచుకొని రెండిట్లోనూ ఫ్రెంచ్ ఫ్రైస్, బర్గర్ వంటివి ముంచుకొని తింటున్నారు. అయితే ఈ మయోనైస్ కారణంగా ఒక మహిళ మరణించడంతో తెలంగాణలో దీనిపై నిషేధం విధించారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆహార భద్రత కోసం పచ్చి గుడ్లతో తయారుచేసిన మయోన్నైస్ ఏడాది పాటు నిషేధం విధిస్తున్నట్టు ప్రకటించింది. హైదరాబాదులో మయోన్నైస్‌ను ముంచుకొని మోమోస్ తిన్న ఒక మహిళ మృతి చెందింది. అలాగే మరో 15 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో మయోనైస్‌ను నిషేధించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. మయోనైస్ లో వెజ్, నాన్‌వెజ్ అని రెండు రకాలు ఉంటాయి. అందులో పచ్చి గుడ్లతో తయారు చేసే మయోన్నైస్ ఒకటి.

పచ్చిగుడ్లతో తయారుచేసిన మయోన్నైస్ తినడం వల్ల ఫుడ్ పాయిజన్ కేసులు పెరుగుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇలా పచ్చి గుడ్లతో తయారు చేసిన మయోన్నైస్‌ను ఉత్పత్తి చేయడం, నిల్వ చేయడం కూడా కొంత కష్టమే. అందుకే వీటి అమ్మకాలపై నిషేధం విధించింది తెలంగాణ గవర్నమెంట్.

మయోన్నైస్ తినడం వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్

మయోన్నైస్ క్రీము రుచిగా ఉంటుంది. నోట్లో పెట్టగానే ఉప్పగా తాకుతుంది. అందుకే షవర్మాలు, మోమోస్, ఫ్రెంచ్ ఫ్రైస్ లో ఎక్కువగా వీటిని మయోన్నైస్‌లో ముంచుకొని తింటూ ఉంటారు. దీని తయారీలో నూనెను అధికంగా ఉపయోగిస్తారు. అందుకే దీనిలో క్యాలరీలో అధికంగా ఉంటాయి. మయోనైస్ తరచూ తినేవారు అధిక బరువు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే దీనిలో ఉండే కొవ్వులు అనారోగ్యకరమైనవి. వీటిని ఎక్కువగా తింటే గుండె ఆరోగ్యానికి చేటు జరిగే అవకాశం ఉంది. మయోన్నైస్‌లో గుడ్లను అధికంగా ఉపయోగిస్తారు. కొంతమందికి ఇది అలెర్జీకి కారణం కావచ్చు. తిన్న వెంటనే కొన్ని రకాల అలెర్జీ లక్షణాలు కనిపిస్తాయి. అలా కనిపిస్తే మీరు గుడ్లతో చేసిన మయోన్నైస్‌కు దూరంగా ఉండాలని అర్థం.

సాల్మొనెల్లా బ్యాక్టిరియా

పచ్చి గుడ్లతో తయారు చేసే మయోన్నైస్ తయారీలో ఏమాత్రం తప్పు జరిగినా, నిల్వ చేసినప్పుడు సరిగా భద్రతా చర్యలు చేపట్టకపోయినా అందులో సాల్మొనెల్లా అనే బాక్టీరియా చేరుతుంది. ఈ సాల్మొనెల్లా బ్యాక్టీరియా వల్ల వచ్చే ఇన్ఫెక్షన్ ప్రాణాంతకంగా మారుతుంది. కాబట్టి ఇలా నిల్వచేసిన మయోనైస్ ను తినకపోవడమే మంచిది. నిజానికి మయోన్నైస్ తినడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదు. ఒకప్పుడు ఇలాంటి పదార్థమే మన ప్రపంచంలో లేదు. ఇప్పుడు సరికొత్తగా వీటిని తినాల్సిన అవసరం లేదనే చెబుతున్నారు.

పోషకాహార నిపుణులు క్రీము ఎక్కువ కాలం తాజాగా ఉండాలని ఉప్పును అధికంగా కలుపుతున్నారు. ఇలా ఉప్పగా ఉండే పదార్థాలు తింటే త్వరగా అధిక రక్తపోటు బారిన పడతారు. హైబీపీకి, గుండె జబ్బులకు దగ్గర సంబంధం ఉంటుంది. కాబట్టి ఆ జీవితాంతం ఆరోగ్యంగా ఉండాలంటే మీ పిల్లలకు కూడా మయో నైస్ ను పెట్టకపోవడమే ఉత్తమం. మయోనైస్ ఎక్కువ మొత్తంలో తీసుకుంటే పొట్ట ఉబ్బరం, అతిసారం వంటి సమస్యలు కనిపిస్తాయి. జీర్ణ సమస్యలు ఎక్కువ అవుతాయి. మయోనైస్ తిన్నాక మీకు జీర్ణ వ్యవస్థలో అసౌకర్యంగా అనిపిస్తే జాగ్రత్తపడండి. మయోన్నైస్‌లో అనేక రకాల రసాయనాలు కూడా కలిపి నిల్వ చేసేందుకు ప్రయత్నిస్తారు. ఇలాంటివి శరీరంలో చేరడం వల్ల దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడే అవకాశం ఎక్కువ. కాబట్టి వీలైనంత వరకు క్రీములకు దూరంగా ఉండి ఇంట్లో చేసుకున్న ఆహారాన్ని తినడం ఉత్తమం.

Whats_app_banner