Tea and Skin colour: ప్రతిరోజూ టీ అధికంగా తాగితే చర్మం రంగు నల్లబడే అవకాశం ఉందా?-tea and skin colour is it possible to have dark skin if you drink a lot of tea every day ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Tea And Skin Colour: ప్రతిరోజూ టీ అధికంగా తాగితే చర్మం రంగు నల్లబడే అవకాశం ఉందా?

Tea and Skin colour: ప్రతిరోజూ టీ అధికంగా తాగితే చర్మం రంగు నల్లబడే అవకాశం ఉందా?

Haritha Chappa HT Telugu
Feb 14, 2024 10:41 AM IST

Tea and Skin colour: టీ అంటే ఎంతో మందికి ప్రాణం. దీన్ని తాగడంతోనే తమ రోజును ప్రారంభించే వారి సంఖ్య ఎక్కువే. అయితే టీ అధికంగా తాగితే రంగు తగ్గిపోయే ప్రమాదం ఉందని ఒక వాదన ఉంది. ఇది ఎంతవరకు నిజమో చూద్దాం.

టీ తాగితే చర్మం నల్లబడుతుందా?
టీ తాగితే చర్మం నల్లబడుతుందా? (pixabay)

Tea and Skin colour: టీ తాగకపోతే ఏదో కోల్పోయినట్టు భావిస్తారు ఎంతోమంది. పొట్టలో టీ పడ్డాకే రోజును ప్రారంభించేవాళ్లు ఎక్కువ. లేకపోతే తలనొప్పిగా ఉందంటూ, ఏ పని చేయలేమంటూ కూర్చుండి పోతారు. టీ కి అంతగా బానిసలు అయిపోయిన వారు ఉన్నారు ఈ ప్రపంచంలో. రోజులో ఒకసారి కాదు నాలుగు సార్లు టీ తాగేవారు ఉన్నారు. అందుకే టీ కి సంబంధించి ఎన్నో అధ్యయనాలు, పరిశోధనలు జరుగుతూనే ఉంటాయి.

కొంతమందికి టీ అధికంగా తాగే వారిలో చర్మం రంగు తగ్గిపోయే అవకాశం ఉందనే అపోహ ఉంది. దీని గురించి శాస్త్రవేత్తలు ఏం చెబుతున్నారో తెలుసుకుందాం. చర్మం రంగుకు టీ తాగడానికి ఎలాంటి సంబంధం లేదని చెబుతున్నారు ప్రపంచ స్థాయి అధ్యయనకర్తలు. టీ తాగడం వల్ల చర్మం రంగు తగ్గుతుంది అనడానికి ఇంతవరకు ఎలాంటి ఆధారం లభించలేదని వివరిస్తున్నారు. అయితే టీ అధికంగా తాగడం వల్ల చర్మం లోని మెరుపు మాత్రం తగ్గుతుందని చెబుతున్నారు. చర్మం మెరుపు తగ్గడమే రంగు తగ్గడంగా ఎక్కువమంది భావిస్తూ ఉంటారు. నిజానికి టీ వల్ల రంగు తగ్గిపోవడం జరగదు.

టీ వల్ల చర్మం మెరుపు తగ్గుతుందా?

టీలో లేదా కాఫీలో కెఫిన్ అధికంగా ఉంటుంది. రోజుకు నాలుగు సార్లు టీ, కాఫీలు తాగడం వల్ల ఆ కెఫీన్ శరీరంలో చేరి ఏజింగ్ లక్షణాలను పెంచుతుంది. అంటే కెఫిన్ వల్ల చర్మంపై ముడతలు పడడం, గీతలు రావడం, పాలిపోయినట్టు అవ్వడం జరుగుతుంది. దీనివల్లే చర్మం రంగు తగ్గినట్టు కనిపిస్తుంది. ఎప్పుడైతే చర్మం తాజాగా ఉంటుందో అప్పుడే చర్మం మెరుస్తూ కనిపిస్తుంది. టీ కాఫీల వల్ల ఆ మెరుపు పోతుంది. కాబట్టి రంగు తగ్గుతున్నామని అనుకుంటారు ఎంతోమంది.

కెఫీన్ తో సమస్యే

రోజుకి ఒక టీ లేదా ఒక కాఫీ తో సర్దుకుపోవడం మంచిది అధికంగా కెఫిన్ శరీరంలో చేరడం మంచిది కాదు. అయితే ప్రతిరోజూ ఒకటి లేదా రెండు సార్లు టీ, కాఫీలను తాగడం వల్ల కొన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి క్యాన్సర్, గుండె సంబంధిత సమస్యలు రాకుండా అడ్డుకుంటాయి. అలాగే చురుకుదనాన్ని ఇస్తాయి. అయితే వీటిని అధికంగా తాగితే మాత్రం డీహైడ్రేషన్ సమస్య మొదలై చర్మమంతా ఎండిపోయినట్టు అవుతుంది. కాబట్టి టీని రోజులో ఒకసారి మాత్రమే తాగాలి.

టీ రోజుకు ఒకసారి లేదా రెండు సార్లు తాగితే కొన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇది అధికరక్తపోటును అదుపులో ఉంచుతుంది. రక్తం గడ్డ కట్టకుండా కాపాడుతుంది. జీర్ణాశయ పనితీరును మెరుగుపరుస్తుంది. టీలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. బరువు తగ్గాలనుకునే వారికి టీ మేలు చేస్తుంది. టీ తాగడం వల్ల ఆకలి వేయదు. దీని వల్ల ఆహారం తక్కువగా తింటారు. తద్వారా బరువు తగ్గవచ్చు. అలా అని రోజులో రెండు మూడు సార్లు టీ తాగి సన్నబడాలని మాత్రం ప్రయత్నించవద్దు.

Whats_app_banner