Tata ACE EV | దేశంలోనే తొలి ఎలక్ట్రిక్ కార్గో వాహనంను విడుదల చేసిన టాటా మోటార్స్
టాటా మోటార్స్ కమర్షియల్ వెహికిల్ సెగ్మెంట్లో ఎలక్ట్రిక్ వాహనం టాటా ఏస్ EVని భారత మార్కెట్లో విడుదల చేసింది. దీనిలో ఫీచర్లు ఎలా ఉన్నాయి? ధర ఎంత? తదిదర విషయాలను ఇక్కడ తెలుసుకోండి..
కమర్షియల్ వాహనాల తయారీలో భారతదేశంలోనే అతిపెద్ద సంస్థగా ఉన్న టాటా మోటార్స్ తాజాగా తమ బ్రాండ్ నుంచి పాపులర్ కార్గో వాహనం అయిన 'టాటా ఏస్'లో ఎలక్ట్రిక్ వెర్షన్ ను విడుదల చేసింది. కమర్షియల్ వెహికల్ కేటగిరీలో ఒక భారతీయ కంపెనీ విడుదల చేసిన తొలి ఎలక్ట్రిక్ వాహనం ఇదే. ఈ సరికొత్త టాటా Ace EV డెలివరీలు ఈ ఏడాది మూడో త్రైమాసికంలో ప్రారంభించనున్నట్లు కంపెనీ తెలిపింది.
ఈ టాటా Ace EV కోసం ఇప్పటికే Amazon, BigBasket, Flipkart సహా దేశంలోని అనేక ఇతర ఇ-కామర్స్ కంపెనీలు, లాజిస్టిక్ సర్వీస్ ప్రొవైడర్లు టాటా మోటార్స్ సంస్థతో ఒక అవగాహన ఒప్పందాన్ని కూడా కుదుర్చుకున్నాయి. వీరందరికీ టాటా మోటార్స్ 39,000 యూనిట్ల Ace EVని డెలివరీ చేయనుంది.
Tata Ace EV ఫీచర్లు, స్పెసిఫికేషన్లు
Tata Ace EVలో టాటాకు చెందిన ప్రత్యేకమైన EVOGEN పవర్‌ట్రైన్‌ను కలిగి ఉంది. ఇది 21.3 kWh బ్యాటరీ ప్యాక్‌తో శక్తిని పొందుతుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 154 కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్‌ను అందిస్తుంది. దీని మోటార్ 36 బిహెచ్‌పి శక్తిని అలాగే 130 ఎన్ఎమ్ పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అంతేకాకుండా బ్యాటరీ వేడిని తగ్గించే శీతలీకరణ వ్యవస్థ, పునరుత్పత్తి శక్తిని అందించే బ్రేకింగ్ సిస్టమ్‌తో ఎలాంటి వాతావరణ పరిస్థితుల్లోనైనా సురక్షితమైన ప్రక్రియను అందిస్తుందని కంపెనీ పేర్కొంది.
ఈ కమర్షియల్ ఎలక్ట్రిక్ వాహనం రెగ్యులర్, ఫాస్ట్ ఛార్జింగ్ రెండు విధాల సిస్టమ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఇంటి వాతావరణంలో ప్రామాణిక 15A సాకెట్ ద్వారా EVని ఛార్జ్ చేయవచ్చు. సాధారణ ఛార్జర్‌ను ఉపయోగించి 6-7 గంటల్లో 20% నుండి 100% వరకు ఛార్జింగ్ పొందవచ్చు.
ఫాస్ట్ ఛార్జర్‌తో అయితే 105 నిమిషాల్లో 10% నుండి 80% వరకు ఛార్జ్ చేయవచ్చు. అలాగే వాటర్ రెసిస్టెంట్, డస్ట్ రెసిస్టెంట్ కోసం ప్రామాణికంగా చెప్పే IP67 రేటింగ్‌తో వస్తుంది.
ఇక క్యాబిన్ లోపల ఏరో డిఫ్లెక్టర్, బ్లూటూత్ కనెక్టివిటీ, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, వెనుక పార్కింగ్ కెమెరాతో పాటు 7-అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను అందిస్తున్నారు.
టాటా ఏస్ EV కార్గో స్పేస్
Tata Ace EV కార్గోలో సరుకు/సామాగ్రి లోడ్ చేయడానికి 208 క్యూబిక్ అడుగుల లేదా 3332.16 కిలోగ్రాములు/క్యూబిక్ మీటర్ల స్పేస్ కలిగి ఉందని కంపెనీ పేర్కొంది. దీని పేలోడ్ సామర్థ్యం 600 కిలోల వరకు ఉంటుంది. పూర్తిగా లోడ్ అయిన పరిస్థితులలోనూ సులభంగా అధిరోహణను అనుమతించే 22% గ్రేడ్-సామర్థ్యాన్ని కలిగి ఉంది.
టాటా ఏస్ EV ధర
టాటా ఏస్ EV ధర రూ. 6.50 లక్షలు (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతుంది. సాధారణ స్టాండర్డ్ టాటా ఏస్ ధర కంటే సుమారు రూ. 2 లక్షలు అధికం. ఇంధనంతో నడిచే టాటా ఏస్ ధరలు రూ. 4 లక్షల నుంచి మొదలై రూ. 5.5 లక్షల వరకు ఉన్నాయి.
సంబంధిత కథనం
టాపిక్