Sweet roti: పిల్లలకు నచ్చేలా స్వీట్ రోటి ఇలా చేసి పెట్టేయండి, ఇష్టంగా తింటారు
Sweet roti: పిల్లల కోసం ఏదైనా ప్రత్యేకమైన బ్రేక్ ఫాస్ట్ చేయాలనుకుంటున్నారా? ఇక్కడ మేము స్వీట్ రోటి రెసిపీ ఇచ్చాము. దీన్ని పిల్లలు చాలా ఇష్టంగా తింటారు.
ఉదయం తినే బ్రేక్ ఫాస్ట్‌లో ఎక్కువ పోషకాలు ఉండాలని చెబుతారు పోషకాహార నిపుణులు. కానీ పిల్లలు మనం పెట్టిన ఆహారాన్ని తినేందుకు ఇష్టపడరు. అందుకే వారి కోసం ప్రత్యేకంగా వండాల్సి వస్తుంది. ఒక్కోసారి వారికి తీపి పదార్థాలు తినాలన్న కోరిక కూడా పుడుతుంది. తీపి పదార్థాలనే పోషకాహారంగా ఎలా మార్చాలో తల్లులు ఆలోచించాలి. ఇక్కడ మేము స్వీట్ రోటి లేదా స్వీట్ చపాతీ రెసిపీ ఇచ్చాము. ఈ చపాతీ తినడానికి ఎలాంటి పచ్చళ్ళు అవసరం లేదు. కాబట్టి వారు ఇష్టంగా ఈ చపాతీని తింటారు. పైగా ఇది ఎంతో రుచిగా కూడా ఉంటుంది. తల్లులకు దీని చేయడం చాలా సులువు. కాబట్టి అప్పుడప్పుడు పిల్లలకి ఇది చేసి పెట్టండి. బ్రేక్ ఫాస్ట్‌లో తింటే మధ్యాహ్నం లంచ్ తినే వరకు ఆకలి వేయదు.
స్వీట్ రోటి రెసిపీకి కావలసిన పదార్థాలు
గోధుమపిండి - పావు కిలో
అరటిపండ్లు - రెండు
పాలు - రెండు స్పూన్లు
నెయ్యి - రెండు స్పూన్లు
పంచదార - నాలుగు స్పూన్లు
స్వీట్ రోటి రెసిపీ
1. స్వీట్ రోటీ చేసేందుకు బాగా పండిన అరటి పండ్లను తీసుకోవాలి.
2. వాటిని గిన్నెలో వేసి చేతితోనే బాగా మెదుపుకోవాలి.
3. ఆ అరటిపండ్లలోనే గోధుమ పిండిని కూడా వేసి బాగా కలపాలి.
4. అలాగే కాచి చల్లార్చిన రెండు స్పూన్ల పాలను కూడా వేయాలి.
5. అందులోనే పంచదార పొడి, నెయ్యి కూడా వేసి బాగా కలుపుకోవాలి.
6. దీన్ని చపాతీ పిండిలాగా గట్టిగా వచ్చేలా కలుపుకోవాలి.
7. ఇప్పుడు దీని నుంచి చిన్న ముద్దను తీసి చపాతీలాగా వత్తుకొని పెనంపై వేసి రెండు వైపులా కాల్చుకోవాలి.
8. అంతే టేస్టీ స్వీట్ రోటి రెడీ అయినట్టే.
9. ఇందులో మనము అరటిపండు, గోధుమపిండి వాడాము కాబట్టి పిల్లలకు శక్తి వెంటనే అందుతుంది.
10. ముఖ్యంగా పిల్లలతో ప్రయాణాలు ఉన్నప్పుడు వీటిని పట్టుకోవడం వల్ల వారి ఆహారం గురించి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు.
స్వీట్ రోటీ పిల్లలకే కాదు పెద్దలకు కూడా ఇది నచ్చడం ఖాయం. పంచదార వాడడం ఇష్టం లేనివారు బెల్లాన్ని ఇందులో వాడవచ్చు. బెల్లం కూడా రుచిగానే ఉంటుంది. పైగా ఇది పొట్టను నిండుగా ఉంచుతుంది. కాబట్టి త్వరగా ఆకలి వేయదు.