Sweet Rice: పిల్లలకు నచ్చేలా ఇలా స్వీట్ రైస్ చేసేయండి, ఎంతో ఇష్టంగా తింటారు
Sweet Rice: స్వీట్ రైస్ పేరు చెబితేనే మీకు అర్థమయ్యే ఉంటుంది. ఇది తియ్యగా ఉండే వంట అని. పిల్లలకు ఇది రుచిగా ఉండటమే కాదు, ఆరోగ్యాన్ని అందిస్తుంది.
పిల్లలకు నచ్చేలా వండితేనే వారు తినేందుకు ఇష్టపడతారు. ఇక్కడ మేము స్వీట్ రైస్ రెసిపీ ఇచ్చాము. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. స్వీట్ రైస్ అనగానే మీకు అర్థమైపోయి ఉంటుంది ఇది తీపిగా ఉండే అన్నమని. ఇందులో మనం పంచదారతో పాటు కొబ్బరిని కూడా కలుపుతాము. కాబట్టి ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది. పంచదారను తక్కువ పరిమాణంలోనే వేసి కొబ్బరిని ఎక్కువ వేస్తాము. కేరళ వాళ్ళు ఎంతో ఇష్టంగా తినే వంటకం ఇది. చాలా తక్కువ సమయంలో పూర్తయిపోతుంది. డ్రైఫ్రూట్స్ వేసి ఈ రెసిపీని వండితే పిల్లలకు ఎంతో బలం కూడా వస్తుంది. ఇక స్వీట్ రైస్ రెసిపీ ఎలాగో తెలుసుకోండి.
స్వీట్ రైస్ రెసిపీకి కావాల్సిన పదార్థాలు
బియ్యము - ఒక కప్పు
పాలు - ఒక కప్పు
కుంకుమపువ్వు - రెండు రేకులు
పంచదార - పావు కప్పు
కొబ్బరి పాలు - ఒక కప్పు
కొబ్బరి తురుము - నాలుగు స్పూన్లు
డ్రై ఫ్రూట్స్ - గుప్పెడు
నెయ్యి - రెండు స్పూన్లు
స్వీట్ రైస్ రెసిపీ
1. స్వీట్ రైస్ వండేందుకు ఒక గిన్నెలో బియ్యాన్ని కడిగి వేయాలి.
2. అలాగే అవి ఉడకడానికి సరిపడా కొబ్బరి పాలను కూడా వేయాలి. చిన్న మంట మీద వాటిని ఉడికించాలి.
3. అన్నం ఉడుకుతున్నప్పుడు కుంకుమపువ్వు రేకులు, పంచదార కూడా వేసి ఉడికించుకోవాలి.
4. అలాగే కొబ్బరి తురుమును కూడా వేసి వేయించాలి.
5. కుంకుమపువ్వు వల్ల అన్నం లేత పసుపు రంగులోకి మారుతుంది.
6. ఇది బాగా ఉడికాక స్టవ్ ఆఫ్ చేసేయాలి.
7. మరొక స్టవ్ మీద చిన్న కళాయి పెట్టి నెయ్యి వేయాలి.
8. ఆ నెయ్యిలో జీడిపప్పు, బాదం, పిస్తా, కిస్మిస్ వంటివి వేసి వేయించాలి.
9. వాటిని నెయ్యితో సహా ఈ రైస్ లో వేసి కలిపేయాలి.
10. అంతే టేస్టీ స్వీట్ రైస్ రెడీ అయినట్టే దీని రుచి అదిరిపోతుంది.
11. మీకు పంచదార ఇష్టం లేకపోతే బెల్లం కూడా వేసుకోవచ్చు.
12. కొబ్బరిపాలతో చేసిన ఈ స్వీట్ రైస్ తినే కొద్ది తినాలనిపిస్తుంది.
13. బెల్లంతో చేస్తే ఇది ఎంతో ఆరోగ్యకరమైనదిగా మారిపోతుంది.
దీనిలో మనం జీడిపప్పులు, బాదం, పిస్తా, కిస్మిస్ వంటి ఎన్నో పోషకాలు నిండిన ఆహారాలను కూడా వేసాము. కాబట్టి ఇవి శరీరానికి ఆరోగ్యాన్ని అందించడంతోపాటు శక్తిని అందిస్తాయి. వారానికి ఒకసారైనా పిల్లలకు ఇది వండి పెట్టండి. వారు ఇష్టంగా తింటారు.