Gulab jamun: చిలగడ దుంపలతో టేస్టీ గులాబ్ జామ్, నోట్లో పెడితేనే కరిగిపోయే స్వీట్ రెసిపీ ఇది
Gulab jamun: చిలగడదుంపలు ఇప్పుడిప్పుడే మార్కెట్లోకి వస్తున్నాయి. వీటితో గులాబ్ జామ్‌లు తయారు చేసి చూడండి. ఇంటిళ్లపాదికి నచ్చడం ఖాయం.
Gulab jamun: చిలగడ దుంపలను స్వీట్ పొటాటో అని అంటారు. వాటి రుచి తీయగా ఉంటుంది. కాబట్టే వాటికి వీటికి స్వీట్ పొటాటో అని పేరు వచ్చింది. వీటితో టేస్టీ గులాబ్ జామున్ తయారు చేయొచ్చు. స్వీట్ పొటాటో గులాబ్ జామూన్స్ చేయడం చాలా సులువు. సాధారణ గులాబ్ జామూన్‌తో పోలిస్తే వీటిని అంతే సులువుగా చేసేయొచ్చు. ఈ స్వీట్ రెసిపీ ఎలాగో తెలుసుకోండి.
స్వీట్ పొటాటో గులాబ్ జామున్ రెసిపీకి కావాల్సిన పదార్థాలు
స్వీట్ పొటాటోలు - మూడు
బేకింగ్ సోడా - చిటికెడు
నీరు - ఒక కప్పు
పంచదార - ఒక కప్పు
నూనె - సరిపడినంత
నెయ్యి - రెండు స్పూన్లు
యాలకుల పొడి - ఒకటిన్నర స్పూను
మైదా పిండి - రెండు స్పూన్లు
చిలగడదుంప గులాబ్ జామున్ రెసిపీ
1. ముందుగా చిలగడ దుంపలను ఉడకబెట్టి పైన పొట్టు తీసేయాలి.
2. చేతితోనే వాటిని ఒక గిన్నెలో మెత్తగా మెదుపుకోవాలి.
3. అందులోనే చిటికెడు బేకింగ్ సోడా వేసి కలపాలి. అలాగే యాలకుల పొడిని వేసి బాగా కలుపుకోవాలి.
4. ఆ మిశ్రమంలోనే రెండు స్పూన్ల మైదాపిండిని, రెండు స్పూన్ల నెయ్యిని వేసి బాగా కలుపుకోవాలి.
5. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టే డీప్ ఫ్రై చేయడానికి సరిపడా నూనె పోయాలి.
7. చిలగడదుంపల మిశ్రమాన్ని తీసుకొని గులాబ్ జామ్ సైజులో రౌండ్‌గా చుట్టుకోవాలి.
8. వాటిని నూనెలో వేసి వేయించుకోవాలి.
9. మరోపక్క చక్కెర సిరప్ రెడీ చేసుకోవాలి.
10. ఒక కప్పు చక్కెర, ఒక కప్పు నీరు ఒక గిన్నెలో వేసి ఐదు నిమిషాలు మరగనివ్వాలి.
11. అందులో యాలకుల పొడిని వేయాలి. కాసేపటికి చక్కెర సిరప్ రెడీ అవుతుంది.
12. ఇప్పుడు వేయించిన గులాబ్ జామూన్‌లను తీసి చక్కెర సిరప్‌లో వేసుకోవాలి.
13. రెండు మూడు గంటలు వదిలేస్తే అవి చక్కగా సిరప్‌ను పీల్చుకొని స్వీట్ గా తయారవుతాయి.
14. ఈ గులాబ్ జామూన్‌లు మెత్తగా నోట్లో పెడితే కరిగిపోయేలా ఉంటాయి. ఒక్కసారి చేసుకుని చూడండి మీకు నచ్చడం ఖాయం. 45 నిమిషాల్లో ఈ మొత్తం స్వీట్ రెడీ అయిపోతుంది.
చిలగడదుంపలు మార్కెట్లోకి వస్తున్నాయి. కాబట్టి వీటితోనే రకాల వంటకాలను ప్రయత్నించాలి. ఇక్కడ మేము స్వీట్ రెసిపీ ఇచ్చాము. సాధారణ గులాబ్ జామూన్‌లతో పోలిస్తే చిలగడ దుంపలతో చేసిన గులాబ్ జామూన్‌లు చాలా టేస్టీగా మరింత సహజంగా ఉంటాయి.