Super Foods For Heart: గుండె ఆరోగ్యం పెంచే ఆహారాలివే..
Super Foods For Heart: గుండె ఆరోగ్యం పెంచే రకరకాల ఆహారాల్ని రోజూవారీ భాగం చేసుకోవాలి. అలా తప్పకుండా తినాల్సిన ఆహారాలేంటో తెలుసుకోండి.
గుండె ఎంత ఆరోగ్యంగా ఉంటే మనిషి అంత నిశ్చింతగా ఉంటాడు. ప్రపంచ జనాభాలో అధిక శాతం మంది మరణాలకు కారణం గుండె జబ్బులేనని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. దీన్ని బట్టి చూసుకుంటే మనం గుండెను ఎంత జాగ్రత్తగా చూసుకోవాలో అర్థం అవుతోంది. ఆరోగ్యకరమైన జీవన శైలితోపాటు, ఏఏ ఆహారాల్ని తీసుకుంటే హృదయం భద్రంగా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.
వెల్లుల్లి :
మన రోజు వారీ ఆహారంలో కొద్దిపాటి వెల్లుల్లిని వేసుకోవడం వల్ల హృదయపు ఆరోగ్యం మెరుగవుతుంది. చాలా ఘాటైన వాసనతో ఉండే వెల్లుల్లితో హార్ట్ బ్లాకేజ్ సమస్యలు తగ్గుతాయి. దీంతో స్ట్రోక్ వచ్చే ప్రమాదమూ ఉండదు. మెలకెత్తుతూ ఉండే వెల్లుల్లి రేకుల్లో క్యాన్సర్లతో పోరాడే లక్షణాలూ ఉన్నాయి.
కమలా పండ్లు :
కాస్త పుల్లగా, కాస్త తియ్యగా ఉండే కమలా పండ్లంటే ఇష్టం ఉండని వారు ఎవరూ ఉండరు. వీటిలో ఉండే పొటాషియం, పెక్టిన్ సహా ఇతర పోషకాలన్నీ గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో ఉపకరిస్తాయి.
టమాటాలు :
ఎర్రగా ఉండే టమాటాల్లో లైకోపీన్ అనే పదార్థం ఉంటుంది. దీంట్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్తంలోని చెడు కొలెస్ట్రాల్ స్థాయిల్ని తగ్గించడం ద్వారా గుండెకు మేలు చేస్తుంది. దీనిలో ఉండే విటమిన్ ఏ, సీలు, ఫోలిక్ యాసిడ్, బీటా కెరోటిన్‌లు వృద్ధాప్య ఛాయలు తొందరగా రాకుండా చేస్తాయి.
సార్డినస్ చేపలు :
సార్డినస్ సముద్రపు చేపలు మెదడు, గుండె పని తీరును మెరుగుపరుస్తాయి. వీటిలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు పుష్కలంగా ఉంటాయి. అందుకనే వారంలో ఒకటి, రెండు సార్లు ఈ చేపలను తినడం వల్ల గుండెకు మంచిది. శరీరంలో వచ్చే వాపులను రానీయదు.
బాదం పప్పు :
రోజూ నాలుగైదు బాదం గింజలు తినడం వల్ల శరీరంలో మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. దీంతో గుండె పని తీరు మెరుగుపడుతుంది. మీరు తొందరగా అన్ని విషయాలనూ మర్చిపోతున్నట్లయితే బాదం పప్పులు ఆ సమస్యకు చెక్ పెడతాయి.
దానిమ్మ పండ్లు:
ఈ కాలంలో ఎక్కువగా దొరికే దానిమ్మ కాయల్లో విటమిన్ సీ తోపాటు యాంటీ ఆక్సడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి బ్లడ్ ప్రెషర్‌ని తగ్గిస్తాయి. అందువల్ల గుండె ఆరోగ్యం మెరుగవుతుంది. ఈ పండు కొన్ని రకాల క్యాన్సర్లతోనూ పోరాడే శక్తిని శరీరానికి కలగజేస్తుంది.