Rice Upma Recipe: రవ్వ ఉప్మా కాదిది రైస్ ఉప్మా.. ఈ రెసిపీతో ట్రై చేశారంటే అమోఘం అనకుండా ఉండలేరు!-super and easy breakfast rice upma recipe to make during the hot summer months ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Rice Upma Recipe: రవ్వ ఉప్మా కాదిది రైస్ ఉప్మా.. ఈ రెసిపీతో ట్రై చేశారంటే అమోఘం అనకుండా ఉండలేరు!

Rice Upma Recipe: రవ్వ ఉప్మా కాదిది రైస్ ఉప్మా.. ఈ రెసిపీతో ట్రై చేశారంటే అమోఘం అనకుండా ఉండలేరు!

Ramya Sri Marka HT Telugu

Rice Upma Recipe: రవ్వ ఉప్మా, అటుకుల ఉప్మా, బొరుగుల ఉప్మా, సగ్గుబియ్యం ఉప్మా ఇవన్నీ మీకు తెలిసే ఉంటాయి. కానీ రైస్ ఉప్మా గురించి మీకు తెలుసా? ఎప్పుడైనా తిన్నారా? ఈ రెసిపీతో ఓ సారి ట్రై చేయండి. రుచి ఎంత బాగుంటుందంటే బ్రేక్ ఫాస్ట్, లంచ్ రెండింటికీ ఇదే కావాలంటారు.

బియ్యంతో తయారు చేసిన రుచికరమైన రైస్ ఉప్మా

వేసవిలో వంట చేయడం చాలా కష్టంగా అనిపిస్తుంది. ఎందుకంటే.. ఈ కాలంలో తీవ్రమైన వేడి కారణంగా శరీరంలో కొన్ని సమస్యలు ఏర్పడతాయి. వాటితో పాటు అగ్ని వేడి కలిస్తే వంట చేసేటప్పుడు మరింత అలసిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఈ రెండు నెలలు సులభంగా చేసుకోగలిగే వంటకాలను తయారు చేయడం మంచిది. అలాంటి వాటిలో ఒకటే ఈ రైస్ ఉప్మా. ఇది చాలా సింపుల్‌గా తయారు అవడమే కాకుండా రుచిగా కూడా ఉంటుంది. దీన్ని బ్రేక్ ఫాస్ట్, లంచ్ రెండు సమయాల్లోనూ ఆస్వాదించవచ్చు. పిల్లలు పెద్దలు అందరూ దీన్ని ఇష్టంగా తింటారు. ఆలస్యం చేయకుండా రెసిపీలోకి వెళిపోదాం పదండి.

రైస్ ఉప్మా తయారు చేయడం ఎలా?

కావలసిన పదార్థాలు

  • 2 కప్పులు బియ్యం
  • అర కప్పు పల్లీలు
  • 2 టేబుల్ స్పూన్లు నూనె
  • 1 టీస్పూన్ ఉలవలు
  • 1 టీస్పూన్ ఆవాలు
  • 1 టీస్పూన్ జీలకర్ర
  • 3 పచ్చిమిర్చి
  • 2 పెద్ద ఉల్లిపాయలు
  • 4 పచ్చిమిర్చి
  • చిటికెడు ఇంగువ
  • అర టీస్పూన్ పసుపు పొడి
  • ఒక టీస్పూన్ ఉప్పు
  • 2 టేబుల్ స్పూన్లు నిమ్మరసం
  • కొంచెం కరివేపాకు
  • కొంచెం కొత్తిమీర

రైస్ ఉప్మా తయారు చేసే పద్ధతి:

తయారీ విధానం

  1. రైస్ ఉప్మా తయారు చేయడం కోసం ముందుగా బియ్యాన్ని తీసుకుని రెండు మూడు సార్లు శుభ్రంగా కడగండి.
  2. తర్వాత నీటిని వడకట్టి బియ్యాన్ని మాత్రమే ఒక బౌల్ లోకి తీసుకుని పక్కన పెట్టండి.
  3. ఇప్పుడు ఒక కడాయి తీసుకుని అందులో నూనె వేయండి.
  4. నూనె కాస్త వేడెక్కిన తర్వా త దాంట్లో పల్లీలు వేసి వేయించండి. స్టవ్ మీడియం ఫ్లేమ్‌లో మాత్రమే ఉండాలని గుర్తుంచుకోండి.
  5. పల్లీలు చక్కగా వేగి బంగారు రంగులోకి మారిన తర్వాత వాటిని తీసి పక్కకు పెట్టుకోండి.
  6. ఇప్పుడు అదే కడాయిలో మరికాస్త నూనె వేసి వేడి చేయండి.
  7. నూనె వేడి అయ్యాక అందులో ఉలవలు, ఆవాలు, జీలకర్ర వేయించండి.
  8. ఉలవలు వేగి పగలడం మొదలు కాగానే దీంట్లో సన్నగా తరిగిన పచ్చిమిర్చీ, కరివేపాకు వేయండి.
  9. తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకన్న ఉల్లిపాయ ముక్కలను వేయండి.
  10. ఇవి రెండూ నూనెలో చక్కగా వేగి ఉల్లిపాయలు బంగారు రంగులోకి మారిన తర్వాత దీంట్లో ఇంగువ, పసుపు, ఉప్పు వేసి మరి కొన్ని సెకన్ల పాటు వేయించండి.
  11. అనీ చక్కగా వేగిన తర్వాత దీంట్లో కడిగి పెట్టుకున్న బియ్యాన్ని వేసి వేయించండి. మీకు నేరుగా బియ్యంతో చేసుకోవడం నచ్చకపోతే.. బియ్యాన్ని కచ్చాపచ్చాగా మిక్సీలో వేసి రవ్వలా తయారు చేసుకుని కూడా ఉప్మా చేసుకోవచ్చు).
  12. బియ్యం ఒక నిమిషం పాటు నూనెలో వేగిన తర్వాత దీంట్లోకి నీరు పోయండి.
  13. ఇలా బియ్యం ఉడికి మెత్తగా మారేంత వరకూ ఉడికించిన తర్వాత చివర్లో రుచికి సరిపడా ఉప్పు, వేయించి పక్కకు పెట్టుకున్న వేరుశనగలు వేసి బాగా కలపండి.
  14. తరువాత స్టవ్ ఆఫ్ చేసి నిమ్మరసం పిండుకుని, కొత్తిమీరతో గార్నీష్ చేసుకోండి.

అంతే రుచికరమైన రైస్ ఉప్మా రెడీ అయినట్టే. దీన్ని పిల్లలకు ఉదయం బ్రేక్ ఫాస్ట్ గా పెట్టచ్చు లేదంటే మధ్యాహ్నం లంచ్ బాక్సుల్లోకి పెట్టచ్చు. నచ్చితే రెండు పూటలకు దీన్నే కానిచ్చేయచ్చు. రెసిపీ నచ్చితే తప్పకుండా ట్రై చేసి చూడండి . వేసవిలో మీ వంటింటి పనిని సులభతరం చేసుకోండి.

Ramya Sri Marka

eMail
రమ్య శ్రీ మార్క హిందుస్థాన్ టైమ్స్‌లో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్. జర్నలిజంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉన్న ఆమె లైఫ్ స్టైల్, ఆస్ట్రాలజీ వార్తలు రాయడంలో ప్రత్యేకత కలిగి ఉంది. కాకాతీయ యూనివర్సిటీలో జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ పట్టా పొందారు. గతంలో ఈనాడు, టీన్యూస్, ఈటీవీ భారత్ వంటి సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు.లింక్డ్‌ఇన్‌లో ఆమెతో కనెక్ట్ అవ్వండి.

సంబంధిత కథనం